అంతర్జాతీయం
అతి పెద్ద కార్గో విమానం
-ప్రపంచంలోనే అతిపెద్ద సరుకుల రవాణా విమానం ఆంటోనవ్ ఏఎన్-225 మ్రియా మే 13న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఆరు టర్బో ఫ్యాన్ ఇంజిన్లు ఉన్న దీని బరువు 640 టన్నులు. దీని గరిష్ట వేగం గంటకు 850 కి.మీ.. బోయింగ్ సి-17, ఎయిర్ బస్ 0-380ల కంటే ఎన్నో రెట్లు పెద్దది.
అతిపెద్ద నౌక ప్రారంభం
-ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల రవాణా నౌక హార్మోని ఆఫ్ ది సీస్ మే 22న తొలి ప్రయాణాన్ని ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి ప్రారంభించింది.
5వ స్థానంలో తాజ్‌మహల్
-ట్వెన్ స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలో అత్యధిక పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. ఇందులో పెరూ దేశంలోని మచు పిచ్చు మొదటి స్థానంలో ఉండగా ఇండియాలోని తాజ్‌మహల్ 5వ స్థానంలో ఉంది.
సముద్రంలో కూలిన విమానం
-ఈజిప్టు ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ 320 మే 19న మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో 56 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది మరణించారు.
ఐరాస ప్రత్యేక రాయబారులు
-ఎల్‌నినో, పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారులుగా మేరీ రాబిన్సన్, మచారియా కమావులను ఐరాస ప్రధానకార్యదర్శి బాన్‌కీమూన్ నియమించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరువు తాండవిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఈ రాయబారులు ఎల్‌నినో ప్రభావాన్ని, వాతావరణ మార్పులను ఎదుర్కోవటంలో ప్రపంచదేశాలకు సహకారం అందిస్తారు.