జంతువులు - వాటి నివాసాలు | Animals and their Shelter
- ఆరోజు ఆదివారం. మహేశ్, కమల, లత, సలీం, డేవిడ్ తోటకు వెళ్లారు. తోట పక్కనే మహేశ్ వాళ్ల పొలాలున్నాయి. తోటలో,పొలాల్లో వాళ్లకు రకరకాల జంతువులు,పక్షులు కన్పించాయి.
- తోటలో అందరూ మధ్యాహ్నం వరకు ఆడుకున్నారు. అక్కడ చాలా మంది పెద్దవాళ్లు చేపలు పడుతున్నారు. మహేశ్ చేపలు పట్టడం చూడడానికి చెరువు దగ్గరకు వెళ్లాడు. చెరువులో, చెరువు గట్టుమీద కూడా రకరకాల జంతువులు కనిపించాయి.
- చేపలు నీటిలోనే ఉంటాయి. కొన్ని రకాల పాములు నీటిలో ఉంటాయి; మరికొన్ని నేల మీద ఉంటాయి. కానీ కప్పలు, తాబేళ్లు, మొసళ్లు, ఎండ్రకాయలు వంటివి నీటిలోనూ, నేల మీద కూడా ఉంటాయి.
- జంతువులు వేరువేరు స్థలాల్లో నివసిస్తాయి. కొన్ని చెట్లమీద, కొన్ని నీళ్లలోను, కొన్ని నేలపైన, మరికొన్ని నేల లోపల బొరియలు చేసుకుని నివసిస్తాయి.
- కొన్ని జంతువులు మన ఇళ్లలో కూడా నివసిస్తాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులను "పెంపుడు జంతువులు(Domestic Animals)" అంటారు.
- కొన్ని పక్షులు గుడ్లుపెట్టి పిల్లల్ని పొదగడంకోసం, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళతాయి.
- అట్లాగే మరికొన్ని పక్షులు వేసవికాలంలోను, చలికాలంలోను అక్కడి వాతావరణానికి తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు వలసపోతాయి. ఇలాంటి పక్షులను "వలసపక్షులు(Migratary Birds)" అంటారు.
- జంతువులు మరియు పక్షులు ఒక చోటునుంచి మరో చోటుకు వెళ్లడానికి-కొన్ని నడుస్తూ వెళతాయి, కొన్ని పాకుతూ వెళతాయి, కొన్ని గెంతుతూ వెళతాయి, మరికొన్ని ఎగురుతూ వెళతాయి. ఇంకా కొన్ని ఈదుతూ పోతాయి. ఇందుకోసం అవి వాటి కాళ్లు, రెక్కలు, ఒక్కోసారి తోకను కూడా ఉపయోగిస్తుంటాయి.
- మనతో పాటు మన పరిసరాలలో అనేక జంతువులు జీవిస్తుంటాయి. అవన్నీ మనలాంటి జీవులే. గాయపడితే మనలాగే బాధపడతాయి. అందుకే వాటిని బాధపెట్టకూడదు.
- ఒకరకం దోమలు కుట్టడంవల్ల మలేరియా వచ్చిందని డాక్టరు చెప్పాడు. దోమలు నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి. మన పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
- నిలువ నీటిలో కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి.
- కొంత మంది దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వంటివి వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం.కాబట్టి దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడడం మంచిది.
- అట్లాగే ఈగలవల్ల కూడా మనకు అనేక నష్టాలు కలుగుతాయి. ఈగలు పెంటకుప్పలమీదా, అపరిశుభ్రమైన ప్రదేశాలలోనూ ఉంటాయి. ఇలాంటిచోట్ల వ్యాధులను కలగచేసే క్రిములు కూడా ఉంటాయి.
- మనం తినే ఆహారపదార్థాల మీదికి వచ్చి ఈగలు వాలుతూంటాయి. ఇలా ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. అందుకే ఆహారపదార్థాలమీద ఈగలు వాలకుండా మూతలు ఉంచాలి.
- ఈగలు, దోమలు పెరగకుండా ఉండాలంటే మన పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
- చెత్తను చెత్తకుండీలలో వేయాలి. మురుగునీటిమీద దోమలు పెరగకుండా కిరోసిన్ లేదా మలాథియాన్ వంటి మందులను పిచికారి చేయాలి.
- నీటిగుంటలు ఉండకుండా, వాటిలో చెత్తా చెదారమూ వేయకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో, బయట పరిశుభ్రత పాటిస్తే దోమలుండవు.