బడ్జెట్ - Budget
- బడ్జెట్ అనే పదం బౌగెట్టే (Bougette) అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. బౌగెట్టే అంటే ‘తోలు సంచి’ అని అర్థం.
- రాజ్యాంగంలోని 112 అధికరణలో బడ్జెట్ అనే పదానికి బదులుగా ‘యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్న్‌మెంట్’ అనే పదాన్ని వాడారు.
- What do you mean by budget?
- A budget is an estimation of revenue and expenses over a specified future period of time and is usually compiled and re-evaluated on a periodic basis. Budgets can be made for a person, a group of people, a business, a government, or just about anything else that makes and spends money.
- బడ్జెట్ అంటే రాబోయే ఆదాయాలు, చేయబోయే వ్యయాలకు సంబంధించిన ఒక ‘లిఖిత పూర్వక కోశ నివేదిక’.
- దేశంలో దేశానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం, రాష్ర్టాలకు సంబంధించిన బడ్జెట్‌ను ఆయా రాష్ర్టాలు ప్రవేశపెడతాయి.
- కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన బడ్జెట్‌ను మాత్రం కేంద్రమే రూపొందిస్తుంది.
- దేశ బడ్జెట్ ముసాయిదా వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పిస్తుంది.
- నోట్: ఆర్టికల్-202 ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు.
- మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన కవి అయిన రాజా తోడర్‌మల్ మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.
- బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా నేరుగా పొందుపర్చలేదు.
- ప్రపంచంలో మొదటిసారిగా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన దేశం- ఇంగ్లండ్
- బ్రిటిష్ పాలనా కాలం 1860లో బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన మొదటి బడ్జెట్‌ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టాడు (ఇది భారత తొలి బడ్జెట్). ఈ బడ్జెట్‌లోనే ఇన్‌కం ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు. లాటిన్ భాషలో ట్యాక్సో (Taxo) అంటే నేను అంచనా వేస్తా అని అర్థం.
- ట్యాక్స్ అనే పదం Taxo అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.
- 1909 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాయి.
- 1867 వరకు దేశంలో ఆర్థిక సంవత్సరం మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండేది.
- 1867 తర్వాత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అమల్లో ఉంది. ప్రస్తుతం కూడా ఇదే అమలులో ఉంది.
- 1921లో ‘అక్వర్త్ కమిటీ’ సూచనల ప్రకారం ‘రైల్వే బడ్జెట్’ను వేరు చేశారు. మొదటి రైల్వే బడ్జెట్‌ను 1924లో స్వతంత్రంగా ప్రవేశపెట్టారు.
- బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసుల ప్రకారం 2016 సెప్టెంబర్‌లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపేందుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 2017-18 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లోనే కలిపి ప్రవేశపెడుతున్నారు.
- సాధారణంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున, దానికి ముందు రోజు ఆర్థిక సర్వేను, దానికి ముందు రోజు రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. 2017-18 ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న ప్రారంభించారు.
- 1999 వరకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయం అమలులో ఉండగా, దానిని 1999 నుంచి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్తి పలికి ఉదయం 11 గంటలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
- 2017-18 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ఫిబ్రవరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు.
- భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం శెట్టి (1947, ఆగస్ట్ 15-1949) రూ.171 కోట్ల ఆదాయం, రూ.194 కోట్ల ఖర్చుతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- గణతంత్ర దేశంలో మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి- జాన్ మథాయ్ (1949-50) (రాజ్యాంగం అమలులోకి రాక ముందు ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌గా దీనిని చెబుతారు).
- రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత (1950, జనవరి 26) మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి- ఆర్‌కే షణ్ముగం శెట్టి (1950, ఫిబ్రవరి).
- 1973 బడ్జెట్‌లో జీఐసీ, బొగ్గుగనులు, జాతీయీకరణకు సంబంధించి నిధులను కేటాయించి బడ్జెట్‌ను రూపొందించింది- వైబీ చవాన్
- అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి- మొరార్జీ దేశాయ్ (10 సార్లు), రెండోవారు పీ చిదంబరం (9 సార్లు).
- బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఆ తరువాత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టారు.
- బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ప్రధాని- ఇందిరాగాంధీ
- రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది- ప్రణబ్ ముఖర్జీ (1983)
- ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగమైన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్’ వారు బడ్జెట్‌ను చాలా గోప్యంగా రూపొందిస్తారు.
- మొదట బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. 112 అధికరణ ప్రకారం లోక్‌సభలో చర్చించి ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపుతారు.
- రాజ్యసభలో ఇది 14 రోజుల్లోపు ఆమోదం పొందాలి. లేకపోతే ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు.
- బడ్జెట్‌ను పార్లమెంట్ ఆమోదించి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తుంది.
- బడ్జెట్ ప్రక్రియలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, కాగ్, అన్ని మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి.
బడ్జెట్ నిర్మాణం
- – కేంద్ర ప్రభుత్వం రాబడి, వ్యయాలు, రుణాలు, వివిధ రకాల లోట్లు, ఇతర ద్రవ్య ప్రవాహాలను ప్రదర్శించే పట్టికను వార్షిక బడ్జెట్ అంటారు. ఇది ప్రభుత్వ వార్షిక ప్రణాళిక అంశాలు, విధానాలను తెలియజేస్తుంది.
- బడ్జెట్ రాబోయే సంవత్సరానికి అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వ రసీదులు (Receipst), చెల్లింపు (Payments)లను 3 ఖాతాలుగా చూపుతుంది.
1) సంఘటిత నిధి2) అగంతుక నిధి3) ప్రభుత్వ ఖాతా
- సంఘటిత లేదా సమీకృత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్ అకౌంట్స్)
- 266 అధికరణ ప్రకారం పన్నులు, సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని రకాల ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు (ట్రెజరీ బిల్లులు, Ways & Means Advanceలు) ఈ నిధిలో జమచేస్తారు.
- ప్రభుత్వ వ్యయ (ఖర్చు) నిమిత్తం ద్రవ్యాన్ని (డబ్బును) తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
- సంఘటిత నిధికి చెందిన ఈ భాగాన్ని ‘సాధారణ బడ్జెట్’ అంటారు.
- నోట్: రాష్ట్ర రాబడులన్నీ రాష్ట్ర సంఘటిత నిధిలో జమచేస్తారు.
అగంతుక నిధి (Contingency Fund Account)
- ఈ నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది.
- పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వ్యయం చేయాల్సి వస్తుంది. ఉదా: వరదలు, తుపానులు, భూకంపాలు
- l అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంట్ అనుమతి తరువాత పొందవచ్చని రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న కంటింజెన్సీ నిధి నుంచి ప్రభుత్వం డబ్బు తీసుకొని ఖర్చు చేస్తుంది. తరువాత పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.
- ప్రభుత్వ వ్యయం కోసం ఈ నిధి నుంచి తీసుకున్న మొత్తాన్ని మళ్లీ ఈ నిధిలోనే జమచేయాలి.
- ప్రభుత్వ ఖాతా (Public Account)
- ప్రభుత్వ ఖాతాలో ప్రభుత్వ రాబడులు, వ్యయాల లెక్కలతో పాటు ఇతర లావాదేవీలు కూడా చేరి ఉంటాయి. ఉదా: ఉద్యోగుల భవిష్యత్ నిధి (పీఎఫ్), చిన్న మొత్తాల పొదుపులు, వాటి సేకరణ, చెల్లింపులు, ఇతర డిపాజిట్లు
- అంచనా రాబడి, అంచనా వ్యయం
- రాబోయే సంవత్సర బడ్జెట్‌లో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి..
1) అంచనా వేసిన రాబడులు2) అంచనా వేసిన వ్యయం
అంచనా వేసిన రాబడులు (Estimated Receipts)
- ఇది రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళిక, పథకాల అమలుపై చేయడానికి అంచనా వేసిన ఖర్చు. ప్రస్తుత సంవత్సరం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై చేసిన ఖర్చు ఆధారంగా రాబోయే సంవత్సర వ్యయ అంచనాలు తయారు చేస్తారు. అంటే ఈ వ్యయం వివరాలన్నీ దేశ వ్యయ విధానానికి సంబంధించినవి.
- బడ్జెట్ దేశ పన్నుల విధానాన్ని, వ్యయ విధానాన్ని తెలుపుతుంది. అయితే కోశ విధానంలో ఈ రెండు విధానాలకు అదనంగా ప్రభుత్వ రుణ విధానాన్ని కూడా చేర్చారు.
- బడ్జెట్‌లో భాగాలు
- రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయం ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను 2 ఖాతాలుగా వర్గీకరించారు.
రెవెన్యూ బడ్జెట్ లేదా ఖాతా
- ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా (Recurring) జరిగే ప్రభుత్వ లావాదేవీలన్నీ రెవెన్యూ బడ్జెట్‌లో చూపుతారు. రెవెన్యూ బడ్జెట్‌లో రెవెన్యూ రాబడులు (Revenue Receipts), రెవెన్యూ వ్యయం (Revenue Expenditures) భాగాలుగా ఉంటాయి.
- రెవెన్యూ రాబడులు-రసీదులు
- పన్ను రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది.
- పన్నుల రాబడి
- కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పన్నులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడిని సమకూర్చే పన్నుల్లో ముఖ్యమైనవి 1) కార్పొరేషన్ పన్ను 2) ఆదాయపు పన్ను 3) ఎగుమతి, దిగుమతి పన్ను 4) ఎక్సైజ్ పన్ను 5) జీఎస్టీ కొత్త పన్నులు విధించడం, పన్ను రేట్లు మార్పులు, ప్రస్తుతం ఉన్న పన్నులను కొనసాగించడానికి ఫైనాన్స్ బిల్లు ప్రతిపాదన అవసరం. ఇది పార్లమెంట్ ఆమోదం పొందాలి.
పన్నేతర రాబడి (Non Tax Revenue)
- కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా లభించే రాబడిని పన్నేతర రాబడి అని అంటారు.
- పన్నేతర రాబడులు లభించే మార్గాల్లో ముఖ్యమైనవి.. 1) ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు, డివిడెండ్లు 2) ప్రభుత్వానికి వచ్చే వడ్డీలు 3) వాణిజ్యపర లాభాలు 4) ప్రభుత్వ సేవలు (పోలీస్ లాంటి సేవలు) వసూలు చేసే రుసుములు మొదలైనవి ఇందులో భాగాలు.
- వీటిలో అతిపెద్ద రాబడి డివిడెండ్లు, లాభాల నుంచి వస్తున్నాయి.
- రెవెన్యూ వ్యయం
- ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా (Recurring) ప్రభుత్వం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటారు.
- ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపటానికి చేసే వ్యయం. దీనిలో
- 1) రుణాలపై వడ్డీ చెల్లింపులు 2) సబ్సిడీలు 3) రక్షణ వ్యయం మొదలైనవి ఉంటాయి.
- రెవెన్యూ వ్యయం వలస దేశంలో ఎలాంటి ఆస్తిని సృష్టించదు
- కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే విరాళాలను కూడా రెవెన్యూ వ్యయంగానే భావించాలి.
- రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ లోటు (Revenue Deficit)గా పేర్కొంటార
- మూలధన బడ్జెట్
- కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు ఆస్తులను సృష్టించడానికి ఉపయోగపడితే దానిని మూలధన బడ్జెట్ అంటారు. ఉదా: దేశంలోని ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు.
- ఏ) మూలధన రాబడులు
- కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తాన్ని మూలధన రాబడులు అంటారు. ఇవి రెండు రకాలు.
1) మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు
- ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన రుణాలు (మార్కెట్ రుణాలు), ట్రెజరీ బిల్లుల రూపంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి చేసే రుణం
- విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి సేకరించే రుణాలు. ఈ రెండింటిలో మార్కెట్ నుంచి తీసుకొనే రుణాలే అధికంగా ఉంటాయి.
2) రుణేతర రాబడులు
- రుణేతర రాబడుల్లో ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా గతంలో ప్రభుత్వం ఇచ్చిన రుణాలను వెనక్కి తీసుకోవడం ద్వారా రాబడిని సమకూర్చుకొంటాయి.
బీ) మూలధన వ్యయం (Capital Expenditure)
- ప్రభుత్వ ఆస్తులను సృష్టించి వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. ఉదా: జాతీయ ప్రాజెక్టులు, పరిశ్రమలపై చేసే వ్యయం.
- భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, షేర్లలో పెట్టుబడి వ్యయం (PSU)
- రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలు
- రక్షణ మూలధన వ్యయాలు దీనిలో భాగాలుగా ఉంటాయి.