రాజ్యాంగంలోని 12వ భాగంలోని 280, 281 ప్రకరణలు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నారు. ఆర్థిక వనరుల విభజనకు సంబంధించి రాష్ట్రపతికి ఆర్థిక అంశాల్లో సలహా ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేశారు.
280 (1) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏండ్లకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
పదవీకాలం- సాధారణంగా 5 సంవత్సరాలు. కానీ ఆర్థిక సంఘం శాశ్వత సంస్థకాదు. ఆర్థిక సంఘం, దాని అధ్యక్షుడు, సభ్యుల పదవీకాలం రాష్ట్రపతి నిర్దేశించిన కాలం వరకు ఉంటుంది.
అర్హతలు
1951లో చేసిన పార్లమెంట్ చట్టం ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యుల అర్హతలు కిందివిధంగా ఉన్నాయి.
చైర్మన్‌కు ప్రజాసంబంధ విషయాల్లో పరిజ్ఞానం ఉండాలి.
ఒక సభ్యుడు ఆర్థికశాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి.
మరొక సభ్యునికి హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి.
మరొక సభ్యుడికి ఆడిట్, అకౌంటింగ్‌లో అనుభవం ఉండాలి.
మరో సభ్యుడు విత్తపాలనలో నిష్ణాతులై ఉండాలి.
విధులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య పంపిణీ చేసే లేదా చేసిన పన్నుల వివిధ రాబడులను రాష్ర్టాల మధ్య కేటాయించడం
భారత సంఘటిత నిధి నుంచి కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్‌ఎయిడ్ సూత్రాలను సూచించడం
రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్ర మున్సిపల్, పంచాయతీల ఆర్థిక వనరులను బలోపేతం చేసేందుకు తగిన సిఫారసులు చేస్తుంది.
దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్రపతికి తగిన సూచనలు ఇస్తుంది.
మొదటి కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్- కేసీ నియోగి (1951)
15వ ఆర్థిక సంఘం చైర్మన్- ఎన్‌కే సింగ్ (2017, నవంబర్ 27)