ఇది బహుళ సభ్య సంస్థ. ప్రారంభంలో 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబర్ 15 వరకు ఏకసభ్య కమిషన్‌గా కొనసాగింది. 1989, అక్టోబర్ 16న బహుళసభ్య కమిషన్‌గా మారింది. కానీ 1990లో తిరిగి ఏకసభ్య కమిషన్‌గా కొనసాగింది. చివరికి 1993 నుంచి ఒక ప్రధాన ఎన్నికల కమిషన్‌తో పాటు ఇద్దరు కమిషనర్లను కలిగి ఉండి బహుళసభ్య సంస్థగా పనిచేస్తుంది.
ఏర్పాటు- 1950, జనవరి 25
నోట్: జనవరి 25ను ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మొదటిసారి 2011లో నిర్వహించారు. రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొంటున్నాయి.
నిర్మాణం: కేంద్ర ఎన్నికల సంస్థ రాజ్యాంగ సంస్థ, శాశ్వతసంస్థ.
324 ఆర్టికల్ ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
అధికారాలు-విధులు
324 (1) ఆర్టికల్ ప్రకారం కింది విధులు నిర్వహిస్తుంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం విధులను 3 రకాలుగా పేర్కొనవచ్చు. అవి..
1. పరిపాలన విధులు
ఓటర్ల జాబితాను రూపొందించడం, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని సవరించడం
పార్లమెంట్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు పర్యవేక్షణ
రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటికి గుర్తులను కేటాయించడం
సలహా విధులు
పార్లమెంట్, రాష్ట్రశాసన సభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌కు సలహా ఇస్తుంది.
అర్ధన్యాయసంబంధమైన విధులు- (క్వాజీ జుడీషియల్)
రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలను విని పరిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ట్రిబ్యునల్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ‘క్వాజీ జుడీషియల్ పవర్' అంటారు.
నోట్: ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు వచ్చిన వివాదాలను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ వివాదమైనా బాధితులు ఎన్నికల పిటిషన్‌ను హైకోర్టులోనే దాఖలు చేయాలి.
- 325 ఆర్టికల్ ప్రకారం మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికలపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు. అలాగే ప్రత్యేక గుర్తింపు ఇవ్వరాదు.
- 326 ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటుహక్కును గుర్తించారు. పార్లమెంట్, రాష్ట్రశాసనసభకు సార్వజనీన ఓటుహక్కు ప్రాతిపదికపైనా ఎన్నికలు జరుగుతాయి.
- 327 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్, రాష్ట్రశాసనసభ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఒక చట్టం ద్వారా విషయాలను నిర్ణయించవచ్చు.
- 328 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చట్టం చేయనంత వరకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది.
- 329 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానం సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు.
నోట్: ఎన్నికల తేదీని ప్రకటించడం మొదలైన అంశాలు పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని మక్కల్ శక్తి కచ్చి Vs ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (2011) కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది.
- ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్- సునీల్ అరోరా
- కమిషనర్లు- సుశీల్ చంద్ర, రాజీవ్‌కుమార్
- పదవీకాలం 65 సంవత్సరాల వయస్సు లేదా 6 సంవత్సరాల సమయం.
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం పేరు ‘నిర్వచన్ సదన్'
కేంద్ర ఆర్థిక సంఘం
- రాజ్యాంగంలోని 12వ భాగంలోని 280, 281 ప్రకరణలు ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నారు. ఆర్థిక వనరుల విభజనకు సంబంధించి రాష్ట్రపతికి ఆర్థిక అంశాల్లో సలహా ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేశారు.
- 280 (1) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 ఏండ్లకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
- పదవీకాలం- సాధారణంగా 5 సంవత్సరాలు. కానీ ఆర్థిక సంఘం శాశ్వత సంస్థకాదు. ఆర్థిక సంఘం, దాని అధ్యక్షుడు, సభ్యుల పదవీకాలం రాష్ట్రపతి నిర్దేశించిన కాలం వరకు ఉంటుంది.
అర్హతలు
- 1951లో చేసిన పార్లమెంట్ చట్టం ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యుల అర్హతలు కిందివిధంగా ఉన్నాయి.
- చైర్మన్‌కు ప్రజాసంబంధ విషయాల్లో పరిజ్ఞానం ఉండాలి.
- ఒక సభ్యుడు ఆర్థికశాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి.
- మరొక సభ్యునికి హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి.
- మరొక సభ్యుడికి ఆడిట్, అకౌంటింగ్‌లో అనుభవం ఉండాలి.
- మరో సభ్యుడు విత్తపాలనలో నిష్ణాతులై ఉండాలి.
విధులు
- కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య పంపిణీ చేసే లేదా చేసిన పన్నుల వివిధ రాబడులను రాష్ర్టాల మధ్య కేటాయించడం
- భారత సంఘటిత నిధి నుంచి కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్ ఇన్‌ఎయిడ్ సూత్రాలను సూచించడం
- రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్ర మున్సిపల్, పంచాయతీల ఆర్థిక వనరులను బలోపేతం చేసేందుకు తగిన సిఫారసులు చేస్తుంది.
- దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్రపతికి తగిన సూచనలు ఇస్తుంది.
- మొదటి కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్- కేసీ నియోగి (1951)
- 15వ ఆర్థిక సంఘం చైర్మన్- ఎన్‌కే సింగ్ (2017, నవంబర్ 27)
సభ్యులు: అజయ్ నారాయణ్, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చంద్, కార్యదర్శి అరవింద్ మెహతా.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)
- రాజ్యాంగంలో పొందుపరిచినవాటిలో కాగ్ అన్నింటికంటే ముఖ్యమైన వ్యవస్థ- బీఆర్ అంబేద్కర్
- కాగ్ గురించి రాజ్యాంగంలోని 148 నుంచి 150 వరకు ఉన్న ఆర్టికల్స్ పేర్కొంటున్నాయి. దీనిని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
- 148 ఆర్టికల్- కాగ్ నియామకం తొలగింపు, జీతభత్యాల గురించి పేర్కొంటుంది.
- కాగ్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
- అర్హతలు- కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగి అయి ఉండాలి.
- ప్రభుత్వ కార్యకలాపాల్లో నిష్ణాతులై ఉండాలి.
- సాధారణంగా ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ సర్వీస్ నుంచి తీసుకుంటారు.
- ప్రమాణ స్వీకారం- రాష్ట్రపతి ద్వారా 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది.
- జీతభత్యాలు- పార్లమెంట్ చట్టం ప్రకారం ఉంటాయి.
- సుప్రీంకోర్ట్ జడ్జి వేతనంతో సమానంగా పొందుతారు.
- రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపాలి.
- తొలగింపు- సుప్రీంకోర్టు జడ్జిలను తొలగించే విధంగానే (పార్లమెంట్ అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా) రాష్ట్రపతి తొలగిస్తారు.
149 ఆర్టికల్- కాగ్ అధికారాలు, విధులు
- ఇది రాజ్యాంగబద్ద సంస్థ. ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాదు.
- కేంద్ర, రాష్ట్రప్రభుత్వ వ్యయాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే స్వతంత్ర సంస్థ.
- భారత సంఘటిత నిధి & రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చేసిన వ్యయాన్ని పరిశీలించడం.
- ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలన్నింటిని ఆడిట్ చేస్తుంది.
నోట్: కాగ్ అధికార విధుల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు. పార్లమెంట్ చట్టం ద్వారా అధికార విధులను నిర్ణయిస్తుంది.
- 1971లో కాగ్ అధికార విధుల గురించి పార్లమెంట్ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం కాగ్ అంటే.. CAAG (Comptroller Accounts&Auditor General). 1976లో చట్టానికి సవరణ చేసి కాగ్‌ను CAG (Comptroller & Auditor General)గా మార్చారు. ఈ చట్ట సవరణ ద్వారా కాగ్ నుంచి అకౌంట్స్ విధులు వేరుచేశారు. కేవలం ఆడిట్ సంస్థ మాత్రమే.
- 150 ఆర్టికల్- కేంద్ర, రాష్ర్టాల జమా ఖర్చులు (అకౌంట్స్) కాగ్ సలహాపై రాష్ట్రపతి నిర్ణయించిన విధంగా ఉండాలి.
151 ఆర్టికల్- ఆడిట్ రిపోర్టులు
- కేంద్ర ప్రభుత్వ జమా ఖర్చుల ఆడిట్ రిపోర్ట్‌ను కాగ్ రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దానిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా చూడాలి.
- కాగ్‌తో పాటు కింది అధికారులు, ఉద్యోగులుంటారు
- 6000 మంది అధికారులు
- 60,000 మంది ఉద్యోగులు
- 10 మంది డైరెక్టర్ జనరల్స్ ఉంటారు.
- ప్రతి అంశంపైనా కాగ్ 3 దశల్లో ఆడిట్ చేస్తుంది.
ముఖ్యాంశాలు
కాగ్‌ను బహుళ సభ్య సంఘంగా మార్చాలని షుంగ్లు కమిటీ సిఫారసు చేసింది.
కాగ్‌పై విమర్శలు
- ఆడిటర్లకు ఆడిటింగ్ మాత్రమే తెలుసునని, పరిపాలనలో వారి పాత్ర పాదచారుల దారివలే చాలా ఇరుగ్గా ఉంటుంది- పాల్ ఆపిల్.బి
- కాగ్‌కు తన ఆఫీస్ సిబ్బందిపై ఎలాంటి పరిపాలన నియంత్రణ ఉండదు. అందుకే ఇతన్ని ‘alone wolf without chief’గా పేర్కొన్నది- సర్ ఫ్రాంక్ ట్రైబ్
- మొదటి భారత కాగ్- నరహరిరావు
- ప్రస్తుత కాగ్- గిరీష్ చంద్రముర్ము
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
- మొదటిసారిగా 1833 చార్టర్ చట్టం ద్వారా అటార్నీ జనరల్ నియామకం చేశారు. దీనిని ‘లా మెంబర్'గా పిలిచేవారు.
- రాజ్యాంగం ఈ పదవిని బ్రిటిష్ నుంచి గ్రహించింది.
- భారత ప్రభుత్వ (కేంద్ర) అత్యున్నతమైన అధికారి- అటార్నీ జనరల్. రాజ్యాంగంలో 76, 78 ఆర్టికల్స్ అటార్నీ జనరల్ గురించి పేర్కొంటున్నాయి.
- 76 ఆర్టికల్- నియామకం, అర్హతలు, పదవీకాలం గురించి పేర్కొంటుంది.
- నియామకం- రాష్ట్రపతి ద్వారా
- అర్హతలు- సుప్రీంకోర్ట్ జడ్జిగా నియమించడానికిగల అర్హతలు ఉండాలి.
- పదవీకాలం- రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు.
- జీతభత్యాలు- రాజ్యాంగంలో పేర్కొనలేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జి పొందే జీతభత్యాలుగా పరిగణించాలి. అటార్నీజనరల్ పొందే పారితోషికం ‘Retainer’గా పేర్కొంటారు.
విధులు
భారత ప్రభుత్వానికి న్యాయ సంబంధమైన సలహాలు ఇవ్వడం
రాష్ట్రపతి సూచించిన విషయాలపై సుప్రీంకోర్టుకు న్యాయసలహాలు సూచించడం
పార్లమెంట్ ఏదైనా శాసనం ద్వారా నిర్దేశించిన ఇతర బాధ్యతలను నిర్వర్తించడం
కేంద్రప్రభుత్వం తరఫున న్యాయవాదిగా ఏ న్యాయస్థానంలోనైనా హాజరుకావచ్చు
88 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సభా కార్యక్రమాలకు హాజరుకావచ్చు.