ఛత్రపతి శివాజి: పశ్చిమ భారతదేశానా మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన చత్రపతి శివాజీ అసలు పేరు శివాజీ రాజే భోంస్లే. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేసే పనిపట్ల అంకితభావం కలిగి ఉండటం, మచ్చలేని వ్యక్తిత్వం ఇవన్నీ శివాజీని ఆయన అనుచరులకు మరియు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా చేశాయి.
చత్రపతి శివాజి పట్టాభిషేకం 1674వ సంవత్సరంలో హిందూ నెల ప్రకారం జేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు జరిగింది. కావున ఆ రోజును హిందూ సామ్రాజ్య దివాస్ గా జరుపుకుంటారు.
జననం – బాల్యం:
చత్రపతి శివాజి మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందిన షాహాజీ, జిజియాబాయి దంపతులకు క్రీ.శ 1630 ఫిబ్రవరి 19న వైశాఖ మాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర ఉన్న శివనేరి కోటలో జన్మించాడు.
శివాజి తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. శివాజి కంటే ముందు జన్మించిన వారంతా మృతి చెందడంతో ఆమె పూజించే దేవతైన శివై పార్వతి పేరు శివాజికి పెట్టింది.
చిన్నపటి నుంచే శివాజికి తన తల్లి జిజియాబాయి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్దులు నేర్పింది. భారత రామాయణం, బలిచక్రవర్తి కథలు చెప్పి శివాజీలో వీర లక్షణాలు మొలకింప చేసింది. శివాజీ పరమత సహనం, స్త్రీలను గౌరవించడం ఇవన్నీ తన తల్లి వద్ద నేర్చుకున్నాడు.
తన తండ్రి జీవితకాలంలో ఎదురుకున్నా పరాజయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి నుంచి పాఠాలను నేర్చుకొని, శివాజి అనతి కాలంలోనే యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. అతి తక్కువ వయస్సులోనే సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన లక్ష్యంగా భావించి వ్యూహాలు మొదలు పెట్టాడు.