Type Here to Get Search Results !

Vinays Info

కలెక్టర్ అధికారాలు, విధులు

కలెక్టర్ అధికారాలు, విధులు

జిల్లా పాలన అధిపతి కలెక్టర్‌కు అనేక అధికారాలు, విధులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి
ఎ) రెవెన్యూ విధులు: జిల్లాలో భూమి శిస్తు వసూలు చేయడం, ప్రభుత్వానికి రావలసిన ఇతర బకాయిలను రాబట్టడం కలెక్టర్ ప్రధాన బాధ్యత. ప్రభుత్వ భూములను సర్వే చేయడం రికార్డులను భద్రపర్చడం ఇతడి రెవెన్యూ విధుల్లో ప్రముఖమైనవి. ఇతడి విధినిర్వహణలో జాయింట్ కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మొదలైనవారు సహకరిస్తారు.
బి) మెజిస్టీరియల్ విధులు : జిల్లా కలెక్టర్ అనేక మెజిస్టీరియల్ అధికారాలను, విధులను కలిగి ఉంటారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటం ఇతడి బాధ్యత
సి) ఎన్నికల విధులు : జిల్లాలో ప్రధాన ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, సవ్యంగా జరపడంలో అతడు తగిన బాధ్యతను వహిస్తాడు.
డి) సమన్వయ విధులు : జిల్లాలోని అనేక శాఖల మధ్య జిల్లా కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. అన్ని శాఖల అధిపతులు అతడికి జవాబుదారీగా ఉంటారు.
ఇ) జనాభా లెక్కల విధులు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధిగా ప్రతి పదేండ్లకు జరిగే జనాభా లెక్కల సేకరణలో కలెక్టర్ ఎన్నో చర్యలు తీసుకుంటారు.
ఎఫ్) ఇతర విధులు : జిల్లా అధిపతిగా జిల్లా కలెక్టర్‌కు అనేక విధులు ఉంటాయి. అతను పంచాయతీరాజ్ సంస్థల సమావేశాలకు, పట్టణ స్థానిక సంస్థల సమావేశాలకు హాజరవుతారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ కోశాగారాలపై పర్యవేక్షణ చేస్తారు. జూనియర్ అధికారాలకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల అమల్లో తగిన బాధ్యతను వహిస్తారు.
స్థానిక ప్రభుత్వాల్లో కలెక్టర్ పాత్ర :ప్రాంతీయ ప్రభుత్వాల వ్యవస్థలో కలెక్టర్ పాత్ర ఎంతో ప్రముఖమైంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా అనేక ఇతర సమస్యలు ప్రజలకు ఎదురైనప్పుడు కలెక్టర్ వారికి చేయూతనందిస్తారు.
ప్రాంతీయ, పట్టణ, స్థానక ప్రభుత్వాలను కలెక్టర్ సమన్వయపర్చి ఆ ప్రభుత్వాల నిర్వహణలో తగిన సహాయ సహకారాలను అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల సమస్యలను తెలుపుతాడు. తద్వారా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందేవిధంగా తోడ్పడతాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తాడు.
కలెక్టర్ కేంద్ర, రాష్ట్ర సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలైన మధ్యాహ్న భోజనం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం, స్వచ్ఛ భారత్ మొదలైన కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రముఖమైన పాత్ర వహిస్తాడు.
జిల్లాలోని ప్రజల సమస్యల పరిష్కార వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్‌ను ప్రధాన అధికారిగా ఎంపికచేసుకున్నాయి. జిల్లాలోని ప్రజలు కూడా కలెక్టర్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇటీవలకాంలో నిరంతరం పెరుగుతున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ కలెక్టర్ పాత్రపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా జిల్లాలో కలెక్టర్‌ను మకుటం లేని చిన్న రాజు అని చెప్పవచ్చు. 

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section