Type Here to Get Search Results !

Vinays Info

రాజ్యాంగ ప్రవేశిక - రాజ్యాంగ లక్షణాలు | Constitutional preamble - constitutional features

రాజ్యాంగ ప్రవేశిక ఉత్తమ రాజ్యాంగ లక్షణం. ప్రవేశికలో రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు సంక్షిప్తంగా ఉంటాయి. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం, మూలతత్వమని పేర్కొంటారు. జవహర్‌లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు మూలం.

 ప్రవేశిక ప్రధానంగా 4 అంశాల గురించి తెలుపుతుంది..
 1.అధికారానికి మూలం
 2. రాజకీయ స్వభావం
 3. రాజ్యాంగ ఆశయాలు
 4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది
 
 ప్రవేశికలోని ‘భారత ప్రజలమైన మేము’ అనే పదం రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెలుపుతుంది. ‘శాసనం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అనే భావన రాజ్యాంగ పరిషత్తు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరిస్తుంది. సర్వసత్తాక దేశం అంటే సార్వభౌమాధికార దేశం. ఇతర దేశాల ఆధిపత్యం, నియంత్రణకు గురికాకుండా, దేశంలోని సంస్థలపై, వ్యక్తులపై అపరిమిత అధికారం ఉండడం.
 
 ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు
 రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ లాంటిది - జస్టిస్ హిదయతుల్లా
 ప్రవేశిక భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం - కె.ఎం. మున్షీ
 ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
 
లౌకిక రాజ్యం: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా గుర్తించని రాజ్యం. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది. ఈ పదాన్ని ప్రవేశికలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
 
ప్రజాస్వామ్యం: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తికీ భాగస్వామ్యం ఉండటం. వయోజన ఓటింగ్ ద్వారా పాలకులను నిర్ణీత కాలానికి ప్రజలే ఎన్నుకుంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రజాస్వామ్య ఆశయాలు.
 
గణతంత్ర దేశం: దేశాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నుకుంటారు.
 
రాజకీయ న్యాయం: రాజ్యపాలనలో పౌరులందరికీ అవకాశాన్ని కల్పించడం. సమాన రాజకీయ హక్కుల కల్పన ద్వారా రాజకీయ న్యాయాన్ని కల్పించవచ్చు. ఉదాహరణ: ఓటుహక్కు, పోటీచేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు.
 
ఆర్థిక న్యాయం: సంపదను వికేంద్రీకరించి పేదరికాన్ని నిర్మూలించడం. వృత్తి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పించడం.
 
సామ్యవాదం: సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ సమసమాజ నిర్మాణానికి తోడ్పడే విధానం. ఈ పదాన్ని ప్రవేశికలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సామ్యవాద సాధన కోసం 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు, 1951లో భూ సంస్కరణల చట్టం రూపకల్పన, 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ, 1971లో రాజభరణాల రద్దు, 1975లో 20 సూత్రాల పథకం, 1978లో ఆస్తి హక్కు తొలగింపు,
1980లో ఆరు బ్యాంకుల జాతీయీకరణ మొదలైనవి చేపట్టారు.
 
సాంఘిక న్యాయం: పౌరులందరూ సమానులే. కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన హోదాను కల్పించడం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం.
 
స్వేచ్ఛ: ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, స్వేచ్ఛాయుత నాగరిక జీవితం గడపడానికి అందరికీ ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, ఆరాధనలకు హామీ ఇచ్చారు.
 
సమానత్వం: అన్ని రకాలైన అసమానతలను వివక్షతలను రద్దు చేసి ప్రతీ వ్యక్తి తనకు తాను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి సమాన అవకాశాలను, హోదాను కల్పించడం.
 
సౌభ్రాతృత్వం: సోదరభావం, పౌరుల మధ్య సంఘీభావం, వ్యక్తి గౌరవం. దేశ సమగ్రతకు, ప్రజల ఐక్యతకు సోదరభావం తప్పనిసరి.
 
ఐక్యత, సమగ్రత: ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందించి వారిలో ఐక్యతకు దోహదపడటం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు.
ప్రవేశికకు చేసిన ఏకైక సవరణ: కేశవానంద భారతి కేసు నేపథ్యంలో స్వరణ్‌సింగ్  కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను చేర్చారు.
 
రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా? కాదా? అనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు 1960 బెరుబారి యూనియన్ కేసులో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది. 973 కేశవానంద భారతి కేసులో, 1980 మినర్వా మిల్స్ కేసులో అంతర్భాగమని తీర్పునిచ్చింది.
 
రాజ్యాంగ లక్షణాలు:
సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం: మన రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం. ప్రభుత్వాల నిర్మాణం, విధులు, అధికారాలు, ప్రాథమిక హక్కులు, దేశ వైవిధ్యం, చారిత్రక అవసరాలు, సమాఖ్య వ్యవస్థ మొదలైన అంశాలను వివరంగా చర్చించారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం 461 అధికరణలు 25 భాగాలు 12 షెడ్యూళ్లు ఉన్నాయి.
 
దృఢ, అదృఢ రాజ్యాంగం: మన భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం మాదిరిగా దృఢమైంది కాదు. బ్రిటన్ రాజ్యాంగం మాదిరిగా అదృఢమైందీ కాదు. ఇది దృఢ, అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం.
 
సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు: రాజ్యాంగంలోని అధికరణం 1 ప్రకారం రాష్ట్రాల సమ్మేళనం అయినప్పటికీ సమాఖ్య ఏక కేంద్ర ప్రభుత్వ లక్షణాలు కనిపిస్తాయి. సమాఖ్య లక్షణాలు అయిన అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ ఉన్నాయి. ఏకకేంద్ర లక్షణాలు అయిన ఒకే రాజ్యాంగం, ఏక పౌరసత్వం ఏకీకృత న్యాయవ్యవస్థ ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని అత్యంత కేంద్రీకృత సమాఖ్య రాజ్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
 
పార్లమెంట్ ప్రభుత్వం: బ్రిటన్‌ను అనుసరించి కేంద్ర, రాష్ట్రాల్లో పార్లమెంటరీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. రెండు స్థాయిల్లో శాసన నిర్మాణ శాఖకు కార్య నిర్వాహక శాఖ బాధ్యత వహిస్తుంది. రెండు స్థాయిల్లో రాజ్యాంగ అధినేత, ప్రభుత్వ అధినేత వేర్వేరుగా ఉంటారు. బ్రిటన్ పార్లమెంట్‌ను ‘పార్లమెంట్‌లకు మాత’ అని పిలుస్తారు.

ఏక పౌరసత్వం:
 పౌరులందరికీ ఒకే పౌరసత్వాన్ని అంటే దేశ పౌరసత్వాన్ని మాత్రమే కల్పించారు. పౌరులకు అన్ని రకాల హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అమెరికా, స్విట్జర్లాండ్‌లో ద్వంద్వ పౌరసత్వం ఉంది. మన దేశంలో జమ్మూకశ్మీర్‌లో మాత్రమే ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు.
 
స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ: మన రాజ్యాంగం స్వయం ప్రతిపత్తి ఉన్న ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్వయం ప్రతిపత్తి న్యాయశాఖ అంటే శాసన నిర్మాణ శాఖకు, కార్యనిర్వాహక శాఖకు బాధ్యత వహించకుండా స్వతంత్రంగా పనిచేయడం. ఈ తరహా న్యాయ వ్యవస్థకే న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది.

 స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు కారణాలు:
 1. కేంద్ర - రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
 2. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
 3. రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ
 4. ప్రాథమిక హక్కుల పరిరక్షణ
 
సార్వజనీన వయోజన ఓటుహక్కు: భారత పౌరులందరికీ నిబంధన 326 ప్రకారం కుల, మత, లింగ, ప్రాంత, ఆస్తి, భాష మొదలైన ఎలాంటి విభేదాలు లేకుండా నిర్ణీత వయసు దాటిన వారందరికీ ఓటుహక్కును కల్పించారు. ఓటింగ్ వయోపరిమితిని 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు.
 
ప్రాథమిక హక్కులు: వ్యక్తి పరిపూర్ణ వికాసానికి తోడ్పడే అవకాశాలే హక్కులు. ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి గ్రహించి, ఐఐఐవ భాగంలో చేర్చారు. 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనలు వీటి గురించి వివరిస్తున్నాయి. మొదట 7 ప్రాథమిక హక్కులు కల్పించారు.
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
 
ఆదేశిక సూత్రాలు: భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా, ఉత్తమ రాజ్యంగా నిర్మించడానికి రాజ్యాంగంలోని  ఐగవ భాగంలో ఆదేశిక సూత్రాలను చేర్చారు. 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు వీటి గురించి తెలియజేస్తాయి. వీటిని అమలు చేయాలని రాజ్యాంగం ప్రభుత్వాలను ఆజ్ఞాపిస్తుంది.
 
ప్రాథమిక విధులు: స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసు మేరకు 10 ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా IV(A)లో చేర్చారు. వీటి గురించి నిబంధన 51 (A) తెలుపుతుంది. 2002లో 86వ సవరణ ద్వారా పదకొండో ప్రాథమిక విధిని చేర్చారు.

గతంలో అడిగిన ప్రశ్నలు

1. ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు?
 1) ఆదేశిక సూత్రాలు
 2) ప్రాథమిక హక్కులు
 3) మానవ హక్కులు
 4) శాసన సూత్రాలు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section