Type Here to Get Search Results !

Vinays Info

భాగ్యరెడ్డి వర్మ

Top Post Ad

భాగ్యరెడ్డి వర్మ

ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ మతంలోనూ లేని కుల వ్యవస్థ భారత దేశంలో వుంది. ప్రాచీన కాలం లో పుట్టి ఇప్పటికీ ఇంకా పెంచి పోషించబడుతున్న అతి భయంకరమైన సామాజిక రుగ్మత ఇది. ఈ కుల వ్యవస్థలో అతి దారుణంగా అణచివేతకు గురైన నిమ్న కులాల ప్రజలు పంచములుగా, అంటరానివాళ్లుగా అతి దుర్భరమైన, హేయమైన, పశువులకంటే హీనమైన జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఈ అమానవీయ వ్యవస్థకు వ్యతిరేకంగా గతంలో అనేక పోరాటాలు జరిగాయి. చార్వాక, బౌద్ధ, జైన తత్వాలు క్రీ.పూ.5వ వతాబ్దంలోనే కులవ్యవస్థను ఎదురించాయి. ఎందరో కింది కులాలకు చెందిన తత్వవేత్తలు హిందూ మతంలో వుంటూనే కులతత్వాన్నీ, అంటరానితనాన్నీ నిరసించారు. భక్తి ఉద్యమకారులైన నందనార్, చోకమేళ, రవిదాస్, కబీర్దాస్ వంటి వారు బ్రాహ్మణ భావజాలాన్ని కొంతవరకు తట్టుకుని ఎదురు నిలిచినప్పటికీ కుల రక్కసిని నిర్మూలించలేకపోయారు. అయితే వారి కృషి దళిత ఉద్యమాలకు నాంది పలికింది. మహత్మా జ్యోతీరావు ఫూలే భక్తి ఉద్యమ వారసత్వానికి భిన్నంగా హిందూ ధర్మశాస్త్రాల్ని అవహేళన చేస్తూ నిమ్న కులాలవారి దైన్యాన్ని ఎత్తి చూపుతూ నూతన కుల నిర్మూలనా భావజాలాన్ని నిర్మించారు.

నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో దళితోద్యమానికి బాటలు వేసపిన మహానేత భాగ్యరెడ్డి వర్మ(మాదరి భాగయ్య) .. 1888 సం. మే 22 నాడు జన్మించారాయన. అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడాయన.. తదనంతర కాలంలో బాబా సాహెబ్తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు.. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు భాగ్యరెడ్డి వర్మ.. ‘ మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..’ అని గర్వంగా చాటారు.. ఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. తెలుగు నేలపై విజయవాడ తదితర ప్రాంతాలకూ విస్తరించారు.. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు..

ఆది హిందూ ఉద్యమం :- 

దేశంలోనే అతి పెద్దదైన హైదరాబాద్ సంస్థానంలో దిగువ కులాలు తమకుతాముగా చేపట్టిన ఉద్యమం ఆది హిందూ ఉద్యమంగా పిలవబడింది. ఉద్యమంలో ఆది ఆంధ్రకు బదులు నిజాం ఆధ్వర్యంలోని హైదరాబాద్ సంస్థానం కనుక ఆది హిందూ అనే పదం వాడబడినది. ఉద్యమానికి ప్రారంభం నుండి భాగ్యరెడ్డి వర్మ నిర్ధేశకుడైనాడు.

భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించి దళితులలో చైతన్యానికి కారకుడైనాడు. 1911లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన మన సంఘం 1922లో ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యగా మార్పు చెందినది.

ఆది హిందూ ఉద్యమం ఆది ఆంధ్ర ఉద్యమాన్ని పోలిన ఉద్ధేశాలనే తమ ఉద్ధేశాలుగా ప్రకటించింది. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చిన జోగినీ వ్యవస్థ రద్దు, బాల్య వివాహాల వ్యతిరేకత, దళితులలో విద్యావ్యాప్తి మరియు వ్యసనాలు లేని సమాజం ఉద్యమ ఉద్ధేశ్యాలైనాయి.

ఉద్యమ గమనం :-

1. 1917లో భాగ్యరెడ్డి వర్మ నిర్వహించిన ప్రథమ పంచమ మహాసదస్సు పంచములు అనే పదం వాడరాదని తీర్మానించింది.

2. 1925లో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ కళాకారుల చిత్ర మరియు శిల్పకళల ప్రదర్శన శాలను హైదరాబాద్లోని రెసిడెన్సీ బజార్లో నిర్వహించారు. దళిత యువకులలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ప్రఖ్యాత మల్ల యోధుడైన కోడి రామ్మూర్తి అధ్యక్షతన ఆది హిందూ జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు.

1925లో హైదరాబాద్లో కలరా వ్యాధి ప్రబలినప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి సామాజిక సేవలందించాడు.

భాగ్యరెడ్డి వర్మ కృషి వల్ల 1925 - 30 కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల కొరకు పలు విద్యా సంస్థలు ఏర్పడ్డాయి.

1930 లో లక్నోలో జరిగిన ఆది హిందూ మహాసభ సమావేశానికి అంబేద్కర్ లండన్లో జరుగబోయే రౌండ్టేబుల్ సమావేశంలోనే దళితులు ప్రాతినిధ్యం వహించాలని తీర్మానించబడింది.

భాగ్యరెడ్డి వర్మ అనంతరం హైదరాబాద్ అంబేద్కర్గా పిలవబడ్డ డా.బి.ఎస్.వెంకట్రావ్ ఉద్యమానికి నాయకుడైనాడు. ఆది ద్రావిడ సంఘం స్థాపించి వెంకట్రావ్ దేవాదాసీ వ్యవస్థ నిర్మూలనకు దళితుల ఐక్యతకు పాటుపడ్డాడు. హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల కొరకు 18 ఆయాలు నిర్మించాడు. అంబేద్కర్ యువజన సంఘాలు స్థాపించాడు.

ఉద్యమానికి మరో గొప్ప నాయకుడైన అరిగె రామస్వామి నీచజన్మ సిద్ధాంతాన్ని ఖండించాడు. సర్వ మానవ సమానత్వాన్ని చాటాడు.

ఆది హిందూ మహాసభలు

1911లోనే 'ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్'నునెలకొల్పి, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన భాగ్యరెడ్డివర్మ 1921 నుండి 1924 వరకు ప్రతి ఏటా ఆది హిందూ మహాసభలు నిర్వహించారు. 'హరిజన' పదం అప్పటికి తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తిలోకి రాలేదు. ఆది హిందువులుగా, ఆది ఆంధ్రులుగా, ఆది భారతీయులుగా నిమ్నవర్గ ప్రజలు తమను తాము ప్రకటించుకోవాలని భాగ్యరెడ్డి వర్మ ప్రచారం చేశాడు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మాడపాటి హనుమంతరావుగారు ఈ సభల నిర్వహణకు సహకరించేవారు.

ఆది హిందూ వలంటీర్ దళం

1906 నాటికే హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో ఆది హిందూ వలంటీర్ దళం పనిచేయసాగింది. ఈ దళంలో 35 మంది నిబద్ధ వలంటీర్లుండేవారు. హరిజనోద్ధరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేయడంతోపాటు హరిజనులు సభలు, సమావేశాలు జరుపుకున్నప్పుడు ఈ దళ సభ్యులు వారికి సహకరిస్తూ ఉండేవారు. సవర్ణ హిందువులుగా పిలువబడుతున్న వారితో కలసిమెలసి పనిచేస్తూ, అస్పృశ్యతా నివారణ కోసం కృషి సలిపేవారు. హైదరాబాద్లో కలరా, ఇన్ప్లూయెంజా వంటి భయంకరమైన వ్యాధులు సోకినప్పుడు మానవసేవా దృక్పథంతో ఈ దళం సేవలు చేస్తుండేది. ఈ వ్యాధుల బారిన పడి మరణించిన వారి దహన సంస్కారాలు జరిపేవారు.

జగన్ మిత్ర మండలి - 1906

అస్పృశ్య కుటుంబంలో పుట్టిన భాగయ్య (భాగ్యరెడ్డివర్మగా తనపేరు మార్చుకున్నాడు) జగన్ మిత్ర మండలి ని నెలకొల్పి, విశ్వజనీనతను ప్రచారం చేశాడు. హరిజనులైన హరిదాసుల చేత, మాల జంగాల చేత హరికథలు చెప్పించేవాడు. 1911వ సంవత్సరంలోనే జగన్మిత్ర మండలి సాంస్కృతిక ప్రదర్శనల సందర్భంగా సంస్థానులు కులభేదాలు విస్మరించి సహపంక్తి భోజనాలు చేయడం భాగ్యరెడ్డి వర్మ సాధించిన అద్భుత విజయంగా భావింపవచ్చు.భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన జగన్ మిత్ర మండలి హైందవ (వైదిక) ధర్మాన్ని, వర్ణవ్యవస్థను నిరసించి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసింది.

1913 లో ఆర్యసమాజ్ భాగ్యరెడ్డిని "వర్మ" బిరుదుతో సన్మానించినది.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.