Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకళాకారులు - Famous painters from Telangana

Top Post Ad

తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకళాకారులు - Famous Painters from Telangana

కాపు రాజయ్య

1925, ఏప్రిల్‌ 7న సిద్దిపేటలో జన్మించారు.

1943లో హైదరాబాద్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో చేరారు. మూడేండ్ల కోర్సు తరువాత ఆర్ట్స్‌లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ పొందారు (1946).

అనంతరం సంగారెడ్డిలో డ్రాయింగ్‌ టీచర్‌గా విధులు నిర్వర్తించారు.

1952లో హైదరాబాద్‌లోని ఆర్ట్స్‌ స్కూల్‌లో చేరి పెయింటింగ్స్‌లో డిప్లొమా పూర్తిచేశారు.

అవేకాకుండా 1945లో డ్రాయింగ్‌లో లోయర్‌ గ్రూప్‌ సర్టిఫికెట్‌ను మద్రాస్‌ సాంకేతిక విద్యా విభాగం నుంచి పొందారు. 1949లో డ్రాయింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు.

ప్రఖ్యాతిగాంచిన అజంతా, ఎల్లోరా చిత్రాలకు ప్రతికృతులను చిత్రించిన ఖాన్‌ బహదూర్‌ సయ్యద్‌ అహ్మద్‌, జలాలుద్దిన్‌ వంటి చిత్రకారుల వద్ద శిక్షణ పొందారు.

చిత్రకళలో రాజయ్యకు ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన వ్యక్తి- పీ కుబేరుడు (సూర్యాపేట)

రాజయ్య కుటుంబానికి చిన్నతనంలో ఆర్థికపరంగా సహాయం చేసినవారు- మార్క చంద్రయ్య

1953 నుంచి తాను గీసిన చిత్రాలను ప్రదర్శనల్లో ఉంచడం ప్రారంభించారు.

1953లో తాను గీసిన ‘గృహప్రశంస’ అనే చిత్రానికి ‘హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ’ వారు ‘హైలీ కమెండెడ్‌ (Highly Comme nded)’ సర్టిఫికెట్‌ను అందించారు.

తెలంగాణ చిత్రకళలో దేశీయ శైలిని ప్రవేశపెట్టారు.

తెలంగాణ జీవన శైలి మీద అనేక చిత్రాలు గీశారు.

రాజయ్య చిత్రించిన చిత్రాల్లో ఎల్లమ్మ జోగి, బోనాలు, కోలాటం, వీధి భాగవతం, కృష్ణాగోపిక, వసంతకేళి, దేశ విదేశాల్లో ప్రదర్శితమయ్యాయి.

రాజయ్య చిత్రించిన ‘బోనాలు’ అనే చిత్రాన్ని లండన్‌ స్టూడియో మ్యాగజీన్‌కు రంగుల ముఖచిత్రంగా ప్రచురించారు.

రాజయ్య చిత్రాలు 1950-60 మధ్యకాలంలో ‘ది ఇల్లుస్ట్రేటెడ్‌ వీక్లీ, ధర్మయంగ్‌’ లలో ప్రచురితమయ్యాయి.

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని వస్తువుగా గ్రహించి 27 చిత్రాలను చిత్రించారు.

వీటిలో కొన్నింటిని టీటీడీవారు కొనుగోలు చేశారు.

సిద్దిపేటలోని కంసాలి, కుమ్మరులు, కమ్మరులు, నకాషి చిత్రకారులను గురువులుగా భావించి చిత్రకళలో నైపుణ్యం సాధించారు.

1955 వరకు ‘వాష్‌’ విధానంలో చిత్రాలు చిత్రించారు.

తరువాత నకాషి చిత్రకారుల అద్భుతమైన ‘టెంపరా’ విధానంలో రంగుల వాడకం మొదలుపెట్టారు.

1954లో ఈయన గీసిన ‘మూలకారిణి’ చిత్రానికి అఖిల భారత చిత్ర కళాప్రదర్శనలో తృతీయ బహుమతి లభించింది. దీనిని ఒక అమెరికన్‌ కొనుగోలు చేశారు.

‘కోలాటం’ అనే చిత్రాన్ని రష్యా ప్రభుత్వం కొనుగోలు చేసింది.

రాజయ్య 1964లో సిద్దిపేటలో ‘లలితకళా సమితి’ని స్థాపించారు.

1993లో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు.

ఈయన ‘కుంచెపదాలు’ అనే వచన కవితా సంకలనానికి చాలా ఆదరణ లభించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 9వ తరగతి పుస్తకంలో కాపు రాజయ్య పాఠ్యాంశాన్ని చేర్చింది.

ఈయన 2012, ఆగస్ట్‌ 20న మరణించారు.


కొండపల్లి శేషగిరిరావు


మహబూబాబాద్‌ జిల్లా పెనుగొండ గ్రామంలో 1924, జనవరి 27న జన్మించారు.

హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లోని ‘దీన్‌దయాళ్‌ నాయుడు’ వద్ద చిత్రకళను అభ్యసించారు.

ఇతను నవాబ్‌ మెహదీ జంగ్‌ ప్రోత్సాహంతో బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో విద్యనభ్యసించారు.

ఇక్కడ నందలాల్‌ బోస్‌, అవనీంద్రనాథ్‌ ఠాగూర్‌ వద్ద శిష్యరికం చేశారు.

‘బనస్తరి విద్యాపతి’ వద్ద కుఢ్య చిత్రకళలో శిక్షణ పొందారు.

ఈయన స్వభావ సిద్ధంగా వేదాంతి కావడంతో ఆయన చిత్రాల్లో ఆధ్యాత్మిక భావాలు కనిపిస్తాయి.

ఈయన చిత్రాల్లో ముఖ్యమైనవి వరూధిని, ప్రవరాఖ్య, దమయంతి, రాయగిరి రాళ్లు, హరిజనోద్యమం, శకుంతల, పాండవ వనవాసం.

1949లో ఈయన గీసిన ‘సంతాల్‌ నృత్యం’ అనే చిత్రం అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.

ఈయన గీసిన చిత్రాల్లో సామాజిక చైతన్యం, ప్రకృతి సహజ వాతావరణం వంటి అంశాలు కనిపిస్తాయి.

ఈయన చిత్రించిన ‘హరిజనోద్యమం’ కుఢ్య తైలవర్ణ చిత్రం అతని సృజనాత్మక నైపుణ్యానికి కలికితురాయి అని చెప్పవచ్చు.

‘దమయంతి’ తైలవర్ణ చిత్రంలో భారతీయ, పాశ్చాత్య చిత్రరీతులు, ‘శకుంతల’ చిత్రంలో ప్రకృతి సహజ వాతావరణం ఉట్టిపడతాయి.

శాంతినికేతన్‌లో చదవడం వల్ల ‘నవ బెంగాల్‌ సంప్రదాయరీతులు’ ఈయన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

నిజాం పరిపాలనలోని క్రౌర్యాన్ని, చరిత్రాత్మక సత్యాలను మేళవించి సునిశితమైన వ్యంగ్యంతో, సామాజిక దృక్పథంతో చిత్రాలను సృష్టించారు.

ఇతని రేఖాచిత్రాలు భారతీయ పాశ్చాత్య, చైనా, జపాన్‌ దేశాల శైలులతో కూడిన అద్భుతమైన వర్ణ సమ్మేళనాలతో రాణించాయి.

ఈయన 2012, జూలై 26న మరణించారు.


ఏలే లక్ష్మణ్‌


ఈయన 1964, జూన్‌ 8న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కదిరేని గూడెం గ్రామంలో జన్మించారు.

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చిత్రకళ పట్టా పొందారు.

ఈయన చిత్రాల్లో తెలంగాణ గ్రామీణ ప్రజల ప్రేమ, అమాయకత్వం, విషాదఛాయలు, తెలంగాణ మట్టి సువాసనలు భావగర్భితంగా ఉంటాయి.

తెలంగాణ గ్రామీణ వాతావరణంలో పెరిగే స్త్రీ, పురుషుల సాదాసీదా వేషధారణ, వంపులు తిరిగిన సన్నని నడుములు, చేతులు పైకెత్తే స్త్రీల దృశ్యాలను అద్భుతంగా చిత్రించారు.

ఈయన ‘యాది, మల్లి’ అనే పెయింటింగ్‌ తెలంగాణ ప్రాంత జీవనం ఉట్టిపడేలా ఉంటుంది.

1995లో అమెరికాలోని చికాగోలో తానా ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఈయన చిత్రించిన చెట్టెక్కే పేద గీతపనివారు, ఆరుబయట పశువుల మేత దృశ్యాలు, తెలంగాణ ప్రాంత వీధుల్లో నడిచే స్త్రీ పురుషులు, బావుల వద్ద నీటి కోసం నిలుచున్న స్త్రీల చిత్రాలు కనువిందు చేస్తాయి.

ఈయన తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ లోగోను రూపొందించారు.

మనీ, మనీ మనీ, అనగనగా ఒక రోజు, సత్య, రంగీలా, దెయ్యం సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశారు.

పాకాల తిరుమలరెడ్డి


ప్రముఖ చిత్రకారుడు, శిల్పి అయిన ఈయన పీటీ రెడ్డిగా సుపరిచితులు.

1915, జనవరి 4న కరీంనగర్‌ జిల్లా అన్నారం గ్రామంలో జన్మించారు.

ఈయన బొంబాయి జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి డిప్లొమా పట్టా పొందారు.

జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో సమకాలీనుడైన ‘ఫ్రాన్సిస్‌ సుజా’ను తన గురువుగా భావించారు.

పీటీ రెడ్డి చైతన్యవంతమైన జీవితం, వ్యక్తుల భావప్రకటన, స్త్రీల సౌందర్యాన్ని తెలిపే ఎన్నో చిత్రాలను సృష్టించారు.

ఈయన చిత్రించిన చిత్రాలు.. త్యాగం, చంద్రుడు, చంద్రముఖి, పల్లెటూరి బడిపంతులు, గుల్‌మహల్‌ చెట్టు మొదలైనవి.

ఈయన రూపొందించిన వేలాది చిత్ర, శిల్ప కళాఖండాలను ప్రదర్శించడానికి నారాయణగూడలోని తన సొంత ఇంటిలో ‘సుధర్మ ఆర్ట్‌ గ్యాలరీ’ అనే పేరుతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

ప్రఖ్యాత కళా విమర్శకుడు ‘రిచర్డ్‌ బార్దోలిమియు’ యువకుడు అయినప్పటికీ ఆ కాలంలో అత్యంత గణనీయులైన, ప్రసిద్ధులైన కొందరు సమకాలీన భారతీయ చిత్రకారుల్లో పీటీ రెడ్డి ఒకరని పేర్కొన్నారు.

నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలపై ఇతర అనేక సమకాలీన సంఘటనల ఆధారంగా చేసుకొని గీసిన చిత్రాలు బహుళ ఆదరణ పొందాయి.

1962 సెంట్రల్‌ లలితకళా అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, 1980వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ కార్యదర్శగా పనిచేశారు.

ఈయన భార్య యశోదారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖ అధ్యాపకులుగా పనిచేశారు.

1996, అక్టోబర్‌ 21న మరణించారు

లక్ష్మాగౌడ్‌


ఈయన 1940, ఆగస్ట్‌ 21న మెదక్‌ జిల్లాలోని నిజాంపూర్‌లో జన్మించారు.

హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో 5 సంవత్సరాలు శిక్షణ పొంది 1963లో ప్రెస్కో టెక్నిక్‌లను నేర్చుకున్నారు.

శిల్పకళ, గాజుపై చిత్రకళలోనూ నైపుణ్యం గల చిత్రకారుడు లక్ష్మాగౌడ్‌.

బరోడాలోని ఎంఎస్‌ యూనివర్సిటీలో కేజీ సుబ్రమణ్యం పర్యవేక్షణలో గ్రాఫిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

గ్రామీణ ప్రాంతంలోని స్త్రీ, పురుషుల నిత్య జీవనం సుఖదుఃఖాలు, కోపతాపాలు, జానపద శృంగార క్రీడలు, జంతువులు, పక్షులు ప్రధాన వస్తువులుగా స్వీకరించి ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయంగా పేరుపొందారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, సరోజినీ నాయుడు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో అధ్యాపకునిగా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు.

‘సర్రియలిజం’ పద్ధతిలో చిత్రలేఖనం చేసిన చిత్రాలు అంతర్జాతీయంగా ప్రదర్శితమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ఈయనకు 2016కు గాను ‘పద్మశ్రీ’ పురస్కారం అందజేసింది.


Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.