వేదకాలంలో విద్యావిధానం(Education system in Vedic period)
వేదకాలపు విద్యాలక్ష్యం విశిష్టమైంది. ఈ విధానంలో విద్యార్థుల మూర్తిమత్వవికాసానికి పలు అవకాశాలు కల్పించబడ్డాయి. గురువులు తమ శిష్యులపై వాత్సల్యంతో బోధన చేసేవారు. విద్యార్థులు గురుకులాల్లో బ్రహ్మచర్యంతో నిరాడంబర జీవితం గడిపేవారు. గోసంరక్షణ, గోసేవ, యజ్ఞయాగాది క్రతువుల్లో విద్యార్థులు పాలుపంచుకొంటూ విద్యాభ్యాసం చేసేవారు.
వేదకాలంలో విద్యాలక్ష్యాలు
- సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేవి (అపరవిద్య)
- ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం. పొందడానికి ఉపయోగపడేది (పరావిద్య)
- సత్ శీలం, సత్ ప్రవర్తనతో బ్రహ్మచర్యాన్ని పాటించడం చిత్తవృత్తి నిరోధ అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం
ఈ కాలంలో రాజులు గురుకులాలను, ఆశ్రమాలను ఆదుకునేవారు. వర్ణాశ్రమ ధర్మాల్లో భాగంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే గురుకులాల్లో ప్రవేశం కల్పించబడేది. శూద్రులు విద్యకు అనర్హులు.
వ్యక్తి జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించినారు.
- బ్రహ్మచర్యాశ్రమం (విద్యార్ధిదశ)
- గృహస్థాశ్రమం,
- వానప్రస్థాశ్రమం,
- సన్యాసాశ్రమం
- విద్యార్థిదశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది. ఉపనయనం అంటే దగ్గరకు చేర్చటం, శిష్యరికం స్వీకరించిన వారిని అంటే వాసి లేదా గురువుల వాసి అంటారు.
- ఈ కాలపు బోధనాంశాల్లో వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, వ్యాకరణం, భాష, తర్కం, క్షత్రియ యుద్ధ విద్యలు, యుద్ధతంత్రం ప్రధానమైంది.
- బోధన మౌఖికంగానే జరిగేది. గురువు చెప్పిన విషయాలను వల్లెవేయడం, కంఠతా పట్టడం తిరిగి అప్పచెప్పడం శాస్త్ర చర్చలు చేయడం జరిగేది. దీనిని శ్రవణం, మననం, నిధిధ్యాసలో బోధన జరిగింది.
- గురువులు శిష్యులను తమ సంతానంలాగా చూసేవారు. శిష్యులు గురువులను తమ తల్లిదండ్రులతో సమానంగా ఆరాధించేవారు. అందుకే గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అనే ఆర్యోక్తి నేటికి కొనసాగుతుంది.
వేదకాలంలో సమాజంలో వచ్చిన మార్పులు
విద్యావ్యవస్థలో కూడా పరిణామాలకు కారణమయ్యాయి. మనుస్మృతి తాను నివసించిన కాలంనాటి స్త్రీ సామాజిక స్థాయిని వివరిస్తూ ఈ విధంగా అంటాడు. "స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కుమారులు సంరక్షించేవారు. ఒకస్త్రీ ఎన్నడూ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు". స్త్రీలు గృహాలకే పరిమితం అయ్యారు. బాల్య వివాహాలు పెరిగిపోయాయి. వారు క్రమంగా విద్యావ్యవస్థకు దూరమయ్యారు. ఈ విధమైన పరిస్థితుల్లో చదవడం, రాయడం, లెక్కలు చేయడం (3R's) ప్రధానాంశాలైన ఎలిమెంటరీ విద్యాబోధన ప్రారంభమైంది. పరిమిత సంఖ్యలోనే విద్యార్థులు ఉన్నతస్థాయి విద్యను అభ్యసించడానికి అవకాశాలుండేవి.