తెలంగాణలోని రవాణా సౌకర్యాలు | Transport Facilities in Telangana State
రవాణా సౌకర్యాలు
ఒక దేశంలోని ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ, జీవన స్థితిగతులు ఆ దేశంలోని రవాణా సౌకర్యాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి. వస్తువులను, ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి చేర్చడాన్ని ‘రవాణా’ అంటారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధిలో రవాణా సౌకర్యాల పాత్ర అత్యంత కీలకం. రాష్ట్రంలో 2014-15 నాటికి సేవా రంగంలో రవాణా రంగం వాటా 10.58 శాతంగా ఉంది. సేవా రంగంలో ఇది ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది.
రాష్ట్రంలో ప్రధానంగా మూడు రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అవి:
1. రోడ్డు రవాణా
2. రైల్వే రవాణా
3. వాయు రవాణా
తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి రాష్ట్రంలో జల రవాణాకు తగిన ప్రాధాన్యం లేదు.
రోడ్డు రవాణా
- తెలంగాణ రాష్ట్రంలో ‘నిజాం స్టేట్ రైల్వే’లో భాగంగా 1932లో భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘నిజాం రాష్ట్ర రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ).
- రాష్ట్రంలోని మొదటి రోడ్డు రవాణా సంస్థ 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.
- నిజాం రాజ్య ప్రధానమంత్రి సాలార్జంగ్ చొరవతో హైదరాబాద్ - షోలాపూర్ రహదారిని నిర్మించారు.
- 1932లో రహదారులను జాతీయం చేసి ప్రభుత్వమే బస్సులను నడిపింది.
- 1936 నాటికే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.
- ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ 1951 నవంబర్ 1.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1965లో ‘రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)’ను ఏర్పాటు చేశారు.
- ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు ‘తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ’ పరిధిలో ఉన్నాయి.
- రాష్ట్రంలో 80 శాతానికి పైగా సరకులు, ప్రయాణికుల రవాణా రోడ్డు మార్గాలపైనే ఆధారపడి ఉంది.
- 2015 జనవరి 30 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు 26,837 కి.మీ.
- రాష్ట్రంలో ఒక చదరపు కి.మీ.కు రోడ్డు సాంద్రత 0.23 కి.మీ.గా ఉంది.
- తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వేయి మందికి అందుబాటులో ఉన్న రోడ్డు 0.86 కి.మీ.
రోడ్లు - రకాలు(Different Types of Roads in Telangana)
- రాష్ట్రంలోని రోడ్లను ‘ఆర్ అండ్ బీ నెట్ వర్‌క’ కింద ఉన్న రోడ్లు, ‘పంచాయతీ రాజ్’ రోడ్లు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
- ఆర్ అండ్ బీ నెట్‌వర్క్ కింద ఉన్న రోడ్లను తిరిగి జాతీయ రహదారులు (ఎన్‌హెచ్), రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్), ప్రధాన జిల్లా రహదారులు, గ్రామీణ రోడ్లుగా విభజించవచ్చు.
రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్(Roads Network in TS)
- రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల విస్తీర్ణం 2,592 కి.మీ.
- రాష్ట్ర రహదారుల పొడవు 3,152 కి.మీ.
- ప్రధాన జిల్లా రహదారుల పొడవు 12,079 కి.మీ.
- గ్రామీణ రహదారుల పొడవు 9,014 కి.మీ.
- జాతీయ రహదారులు మినహాయించి రాష్ట్ర రహదారుల మొత్తం పొడవు 24,245 కి.మీ.
జాతీయ రహదారులు(National Highways in Telangana)
- ఇవి సెంట్రల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉంటాయి.
- తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదార్లు అధికంగా (266 కి.మీ.) ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
- అతి తక్కువగా హైదరాబాద్‌లో (36 కి.మీ.) ఉన్నాయి.
- రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.25 కి.మీ.గా ఉంది.
- దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ. ప్రాంతానికి 2.82 కి.మీ.
- రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్-44’, అతి చిన్న జాతీయ రహదారి ‘ఎన్‌హెచ్-61’.
- రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు 2,592 కి.మీ. ఇందులో.. నాలుగు లేన్ల జాతీయ రహదారుల పొడవు 964 కి.మీ.
- రెండు లైన్ల జాతీయ రహదారుల పొడవు 1264 కి.మీ.
- మధ్య తరహా (ఇంటర్మీడియెట్) లైన్ జాతీయ రహదారుల పొడవు 153 కి.మీ.
- సింగిల్ లైన్ జాతీయ రహదారుల పొడవు 211 కి.మీ.
రాష్ట్రంలోని జాతీయ రహదారులు(National Highways in Telangana)
1. జాతీయ రహదారి నంబర్ - 44
ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉంది. దీని పాత నంబర్ - 7. ఇది మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాద్, నిర్మల్, రామాయంపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఈ రహదారి పొడవు 519.64 కి.మీ.
2. జాతీయ రహదారి నంబర్ - 65
దీని పాత నంబర్ -9. ఇది కర్ణాటక సరిహద్దు నుంచి జహీరాబాద్, హైదరాబాద్, సూర్యాపేట్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 291.74 కి.మీ.
3. జాతీయ రహదారి నంబర్ - 63
దీని పాత నంబర్ -16. ఇది నిజామాబాద్ నుంచి ఆర్మూర్, జగిత్యాల, లక్సెట్టిపేట, చెన్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 235.15 కి.మీ.
4. జాతీయ రహదారి నంబర్ - 167
ఇది నూతన రహదారి. ఇది కర్ణాటక సరిహద్దు నుంచి జడ్చర్ల (మహబూబ్‌నగర్) మీదుగా ఎన్‌హెచ్-44ను కలుస్తుంది.
5. జాతీయ రహదారి నంబర్ - 163
దీని పాత నంబర్-202. ఇది హైదరాబాద్ నుంచి జనగాం, వరంగల్, వెంకటాపురం మీదుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో దీని పొడవు 306 కి.మీ.
6. జాతీయ రహదారి నంబర్ - 30
దీని పాత నంబర్- 221. ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెనుబలి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 100 కి.మీ.
7. జాతీయ రహదారి నంబర్ - 61
దీని పాత నంబర్ - 222. ఇది రాష్ట్రంలో మహారాష్ట్ర సరిహద్దు నుంచి నర్సాపూర్ మీదుగా నిర్మల్ వరకు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 53.6 కి.మీ.
8. జాతీయ రహదారి నంబర్ - 161
ఇది నూతన జాతీయ రహదారి. ఇది సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 140.5 కి.మీ.
9. జాతీయ రహదారి నంబర్ - 363
ఇది నూతన జాతీయ రహదారి. ఇది మహారాష్ట్ర సరిహద్దు నుంచి మహాదేవ్‌పూర్, పరకాల, ఆత్మకూరు ద్వారా ఎన్‌హెచ్-163తో కలుస్తుంది.
10. జాతీయ రహదారి నంబర్ -365
ఇది నూతన జాతీయ రహదారి. ఇది నకిరేకల్ నుంచి తుంగతుర్తి, మహబూబాబాద్, నర్సంపేట మీదుగా మల్లంపల్లి వద్ద ఎన్‌హెచ్-163తో కలుస్తుంది.
11. జాతీయ రహదారి నంబర్ - 565
ఇది కూడా నూతన జాతీయ రహదారి. ఇది నకిరేకల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
- 363, 365, 565 నంబర్ జాతీయ రహదార్ల మొత్తం ఉమ్మడి పొడవు 330 కి.మీ.
12. జాతీయ రహదారి నంబర్ - 563
ఇది నూతన జాతీయ రహదారి. ఎన్‌హెచ్-63పై ఉన్న మంచిర్యాల మీదుగా కరీంనగర్- వరంగల్ ద్వారా ఎన్‌హెచ్-163తో కలుస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 136 కి.మీ.
13. జాతీయ రహదారి నంబర్ - 365ఎ
ఇది కూడా నూతన జాతీయ రహదారి. ఇది ఎన్‌హెచ్-65పై ఉన్న కోదాడ మీదుగా ఖమ్మం- మహబూబాబాద్ ద్వారా ఎన్‌హెచ్ -365తో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో దీని పొడవు 75 కి.మీ.
14. జాతీయ రహదారి నంబర్ - 765
ఇది నూతన జాతీయ రహదారి. హైదరాబాద్ నుంచి అమన్‌గల్, వెల్దండ, కల్వకుర్తి, వంగూర్, అచ్చంపేట మీదుగా ఆంద్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో దీని పొడవు 196 కి.మీ.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 768 కి.మీ. పొడవైన జాతీయ రహదారులను ‘నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు’ కింద నాలుగు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తోంది.
రాష్ట్ర రహదారులు(State Roads)
- రాష్ట్ర రహదారులు ప్రధానంగా జిల్లాల ప్రధాన కేంద్రాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర రహదారులు తెలంగాణలో 3,152 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి.
- రాష్ట్ర రహదారులు కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి.
జిల్లా రహదారులు(District Roads)
- తాలూకా కేంద్రాలతో; జిల్లా కేంద్రాలతో; ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలు, మార్కెట్ కేంద్రాలను రాష్ట్రీయ రహదారులతో; రైల్వేస్టేషన్‌లతో కలిపే రహదారులను ‘జిల్లా రహదారులు’ అంటారు.
- రాష్ట్రంలో జిల్లా రహదారులు 12,079 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి.
పంచాయతీరాజ్ రహదారులు(Panchayat Roads)
- పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం, నిర్వహణను రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ గ్రామీణ ప్రాంత రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, బిల్డింగ్‌లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తుంది. 2014 ఏప్రిల్ 1 నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 64,046 కి.మీ. పొడవైన పంచాయతీ రాజ్ రహదారులు ఉన్నాయి.
- పంచాయతీ రాజ్ రోడ్లకు సంబంధించిన వివిధ రకాల రోడ్లు
- సి.సి., బి.టి. రోడ్ల పొడవు 20,282 కి.మీ.
- కంకర రోడ్ల పొడవు 14,734 కి.మీ.
- డబ్ల్యూబీఎం రోడ్ల పొడవు 14,146 కి.మీ.
- మట్టి రోడ్ల పొడవు 14,884 కి.మీ.