Important Public Sector Undertakings in the State of Telangana | తెలంగాణ రాష్ర్టంలోని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు
ఇక్రిశాట్(ICRISAT)
రాష్ర్టంలో ఏర్పాటైన ఏకైక అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్. దీన్ని 1972లో మెదక్ జిల్లా పటాన్‌చెరు వద్ద ఏర్పాటు చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో అర్ధశుష్క వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరిగే వంగడాలకు రూపకల్పన చేస్తోంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణనిస్తోంది. మెట్ట ప్రాంత వ్యవసాయ సాగుపై పరిశోధనలు చేస్తోంది. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్‌కు సంక్షిప్త రూపమే ఇక్రిశాట్. ఈ సంస్థ ప్రస్తుత డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్‌గవిన్‌సన్.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) - Bharath Electronics Limited
బీఈఎల్ మొదటి యూనిట్‌ను బెంగళూరులో 1954లో స్థాపించారు. ఇది రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని 9వ యూనిట్‌ను 1986లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ రక్షణ శాఖకు అవసరమైన ఎలక్ట్రానిక్ అవసరాలను తీరుస్తోంది. దీనికి నవరత్న హోదా కల్పించారు.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)
దేశంలో మొత్తం ఆరు బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మెదక్ జిల్లాలోని రామచంద్రాపురంలో 1963లో బీహెచ్‌ఈఎల్‌ను స్థాపించారు. దేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఇదొకటి. ఇక్కడ టర్బైన్లు, జనరేటర్లు, సర్క్యూట్ బ్రేకర్లు తయారవుతాయి. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దీనికి మహారత్న హోదా ఉంది.
ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ (ఐడీపీఎల్)
ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద ఫార్మా రంగ సంస్థ. దీన్ని 1961లో ఢిల్లీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆరు ఐడీపీఎల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ యూనిట్‌ను 1967లో బాలానగర్‌లో స్థాపించారు. అత్యవసర, జీవనాధార మందుల తయారీలో స్వయం సమృద్ధి సాధనకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)
1967 ఏప్రిల్ 11న హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇది అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాల పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధనలో కీలకపాత్ర పోషిస్తోంది.
దేశంలో తొలి డిజిటల్ కంప్యూటర్‌ను ఈసీఐఎల్ రూపొందించింది. దేశంలో తొలి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నియంత్రణ పరికర వ్యవస్థలను, టెలివిజన్లను ఈ సంస్థ రూపొందించింది.
ప్రాగా టూల్స్
దీన్ని 1959లో హైదరాబాద్‌లో స్థాపించారు. యంత్రాల విడి పరికరాలు, కట్టర్లు, టూల్స్, గ్రైండర్లు, త్రెడ్ రోలింగ్ మిషన్లు మొదలైన వాటిని ఇది రూపొందిస్తోంది.
హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)
హెచ్‌సీఎల్‌ను రంగారెడ్డి జిల్లాలో, పశ్చిమ బెంగాల్‌లోని రూప్ నారాయణ్‌పూర్‌లో స్థాపించారు. ఇది భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో పని చేస్తోంది. హెచ్‌సీఎల్‌లో టెలికాం కేబుల్స్‌ను తయారు చేస్తున్నారు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)
భారత్‌లో హెచ్‌ఏఎల్‌కు ఆరు యూనిట్లు ఉన్నాయి. 1965లో రంగారెడ్డి జిల్లాలో హెచ్‌ఏఎల్ యూనిట్‌ను ప్రారంభించారు. దీనికి నవరత్న హోదా కల్పించారు. ఇందులో విమానయాన యంత్ర భాగాలను ఉత్పత్తి చేస్తున్నారు. రేడియో అల్టీమీటర్ తయారీలో హెచ్‌ఏఎల్ హైదరాబాద్ డివిజన్‌ది కీలకపాత్ర. ఇది కమ్యూనికేషన్, నావిగేషన్లలో రక్షణ శాఖకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.