ప్రకృతిలో జరిగే మార్పులవల్లనో, మానవ తప్పిదాల వల్లనో ప్రకృతి ప్రకోపిస్తుంది. వీటినే విపత్తులు అంటారు. వీటివల్ల తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుంది. ఇది ఆర్థికాభివృద్ధిపై ప్రభావం పడుతుంది. విపత్తులకు గురైన ప్రాంతాలు కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. విపత్తులు, వాటిలో రకాలు, కలిగే మార్పుల గురించి....
విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (DISASTER) అంటారు. విపత్తు అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి తీసుకున్నారు.
DISASTER- DUS అంటే చెడు, ASTER అంటే నక్షత్రం. ప్రాచీన కాలంలో పూర్వీకులు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రంతో ముడిపెట్టి, ఆ నక్షత్రాన్ని దుష్ట నక్షత్రంగా భావించేవారు. ప్రపంచానికి విపత్తు అనే భావనని పరిచయం చేసిన వ్యక్తులు గ్రీకులు. నిర్వచనం: ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేనివిధంగా, సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణనష్టం, ఆస్తినష్టం, పర్యావరణ వనరులను విలుప్తం చేసి, మౌలిక సౌకర్యాలకు, నిత్యావసర సేవలకు, జీవనోపాధికి, మానవ దైనందిన జీవితానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన, వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి: విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ: సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ: ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలుకోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పత నం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.
ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్నుకోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
ధన, ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం
ప్రజల జీవనోపాధి దెబ్బతినడం
విపత్తుకు లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి సహాయం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉండటం
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై, అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం.
వైపరీత్యాలను
1. సహజ వైపరీత్యాలు (Natural Hazards)
2. సామాజిక - సహజ వైపరీత్యాలు (Socio Natural Hazards)
3. మానవ ప్రేరేపిత వైపరీత్యాలు (Human Induced Hazards)
4. పర్యావరణ వైపరీత్యాలుగా విభజించవచ్చు.
భూకంపం, సునామీ, అగ్నిపర్వత విస్ఫోటనం, భూతాపం, ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం మొదలైనవాటిని ప్రకృతిసిద్ధ లేదా సహజ వైపరీత్యాలు అంటారు.
వరదలు, భూకంపాలు, కరువులు, ఆనకట్టలు కూలిపోవడం వంటి వాటికి మానవ ప్రేరేపిత, ప్రకృతి కారణాలు రెండూ ఉన్నాయి. అందువల్ల సామాజిక-సహజ వైపరీత్యాలు అంటారు.
ఉదాహరణ: వరదలు అధిక వర్షాల వల్ల రావచ్చు లేదా మావన నిర్లక్ష్యం కారణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంవల్ల కూడా రావచ్చు.
పారిశ్రామిక ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, ఆనకట్టలు కూలిపోవడం, విషపూరిత వ్యర్థాల లీకేజీ, యుద్ధం, అంతర్గత తిరుగుబాట్లు మొదలైనవి మానవ ప్రేరేపిత వైపరీత్యాలకు ఉదాహరణలు. కాలుష్యం, అడవుల నరికివేత, ఎడారీకరణ, తెగుళ్లదాడులు మొదలైనవి పర్యావరణ వైపరీత్యాలు.
ఉదా: మానవజాతి నివసించని ఎడారిలో భూకంపం సంభవిస్తే అది సమాజానికి ఎలాంటి ప్రత్యక్ష, తక్షణ నష్టం కలిగించదు. అందువల్ల దాన్ని విపత్తుగా పేర్కొనలేం.
ఉదా: 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంపం 10వేల మందికిపైగా మరణించారు.
దుర్బలత్వం
ఎప్పుడైతే విపత్తు సంభవిస్తుందో ఆ సమయంలో కొన్ని స్థలాల్లో కొంతవరకు అపాయాన్ని నిరోధించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని స్థలాల్లో అపాయం నుంచి రక్షించలేం. ఆ స్థితిని దుర్బలత్వం అంటారు.
ఉదా: 2001లో గుజరాత్ భూకంపం సందర్భంగా భుజ్ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నవారికంటే ఇరుకైన రోడ్లు, కొత్తగా నిర్మించి ఎత్తయిన, సురక్షితం కాని భవనాలు, అధిక జనసాంద్రత కలిగిన భుజ్ పాత నగరానికి చెందిన వారే ఎక్కువగా ప్రాణాలను కోల్పోయారు.
సామర్థ్యం
వైపరీత్య ప్రభావానికి లోనైన వ్యక్తులు/ప్రజా సమూహాలు తమ ఉపాధిని పునరుద్ధరించుకునే స్థితిని సామర్థ్యం అని పిలుస్తారు.
దీనికోసం దుర్బలస్థితిలో ఉన్న ప్రజల భౌతిక, ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలి.
సామర్థ్యాలు రెండు రకాలు
1. భౌతిక సామర్థ్యం
2. సామాజిక - ఆర్థిక సామర్థ్యం
ఆపద
వైపరీత్యాలు, దుర్బలత్వ పరిస్థితుల మధ్య పరస్పర చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపంలో అంతరాయం, పర్యావరణ క్షీణతతోపాటు మరణాలు, గాయాలు, ఆస్తి, జీవనోపాధి నష్టం వంటి హానికరమైన పర్యవసానాలు లేదా ఊహించని నష్టాలు జరిగే సంభావ్యతను ఆపద లేదా అపాయం అంటారు.
వైపరీత్యం X దుర్బలత్వం
అపాయం = సామర్థ్యం
విపత్తు రకాలు
విపత్తును 1. వేగాన్ని బట్టి, 2. కారణాలను బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు.