Type Here to Get Search Results !

Vinays Info

పవనాలు(Wind) - Vinays Info

పవనాలు

అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి క్షితిజ సమాంతరంగా వీచే గాలిని ‘పవనం’ అంటారు.

పవనాలు 3 రకాలు. అవి..

1) ప్రపంచ పవనాలు 

2) రుతు పవనాలు

3) స్థానిక పవనాలు

పవనాల వేగాన్ని, దిశను ప్రభావితం చేసే అంశాలు

ఎ. పీడన ప్రవణత రేటు: రెండు ప్రదేశాల మధ్య గల సమభార రేఖల విలువలోని తేడాను ‘పీడన ప్రవణత రేటు’ అంటారు. సమభార రేఖలు దగ్గరగా ఉండే పీడన ప్రవణత రేటు అధికంగా ఉంటుంది. పీడన ప్రవణత రేటు ఎంత తక్కువగా ఉంటే పవన వేగం అంతే గరిష్ఠంగా ఉంటుంది.

బి. భూమి ఘర్షణ బలం: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్ది ఘర్షణ బలం తగ్గుతుంది. ఫలితంగా పవన వేగం పెరుగుతుంది.

సి. గురుత్వాకర్షణ శక్తి ప్రభావం: భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్ది గురుత్వాకర్షణ బలం తగ్గుతూ ఉంటుంది. ఫలితంగా పవన వేగం పెరుగుతుంది.

డి. కొరియాలిస్‌ ఎఫెక్ట్‌: కొరియాలిస్‌ ఎఫెక్ట్‌ వల్ల వేగంలో మార్పు ఉండదు. కానీ పవన దిశలో మార్పు ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఎడమ వైపునకు వంగి ప్రయాణిస్తాయి.

ప్రపంచ పవనాలు

ప్రపంచ పీడన మండలాల నుంచి నిరంతరాయంగా, స్థిరంగా వీచే పవనాలను ప్రపంచ పవనాలు అంటారు. వీటిని స్థిర పవనాలు అని కూడా అంటారు.

ప్రపంచ పవనాలు 3 రకాలు.. అవి..

1) వ్యాపార పవనాలు 2) పశ్చిమ పవనాలు

3) ధ్రువ తూర్పు పవనాలు

వ్యాపార పవనాలు: ట్రేడ్‌ (Trade) అనే జర్మన్‌ భాషా పదానికి ట్రాక్‌ (Track) అని అర్థం. ట్రాక్‌ అంటే నిర్దిష్ట దిశ. ఉప అయనరేఖ అధిక పీడన మండలం నుంచి భూమధ్య అల్పపీడన మండలం వైపునకు వీస్తాయి.

ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలు అని పిలుస్తారు.

భూమధ్య రేఖా ప్రాంతంలో సంభవించే సంవహన వర్షపాతానికి కారణం ఇవే.

పై రెండు వ్యాపార పవనాలు కలుసుకొనే ప్రాంతాన్ని ఐటీసీజడ్‌ (InterTropical Convergence Zone-ITCZ) అంటారు.

వ్యాపార పవనాలు ఖండాల తూర్పు వైపున వర్షాన్ని ఇచ్చి పశ్చిమం వైపున ఎడారులను ఏర్పరుస్తాయి.

భారతదేశం శుష్క ఈశాన్య వ్యాపార పవనాల మేఖలలో ఉంది.

పశ్చిమ పవనాలు: వ్యాపార పవనాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో వీస్తాయి. కాబట్టి ప్రతి వ్యాపార పవనాలు అని పేరు. ఉప అయన రేఖ అధిక పీడన మండలం నుంచి ఉపధృవ అల్పపీడన మండలం వైపునకు వీస్తాయి.

దక్షిణార్ధ గోళంలో వీటిని ‘గర్జించే నలభైలు’ అంటారు. ఎందుకంటే పశ్చిమ పవనాలు వీచే ఆ ప్రదేశాల్లో భూ భాగం లేదు. సముద్ర భాగం మీదనే పవనాలు వీయడంతో పవన వేగం అత్యధికంగా ఉంటుంది. 50 డిగ్రీల వద్ద ‘వణికించే యాభైలు’ అంటారు. 60 డిగ్రీల వద్ద ‘భీకరించే అరవైలు (Shrieking Sixties) అంటారు.

మధ్యధరా ప్రకృతి సిద్ధమండలంలో శీతాకాలంలో పడే వర్షపాతానికి కారణం ఈ పవనాలే.

పశ్చిమ పవనాలు ఖండాల పశ్చిమ భాగాన వర్షాన్నిచ్చి తూర్పు భాగాన వర్షాచ్ఛాయ ప్రాంతాలు ఏర్పడతాయి.

పశ్చిమ పవనాలు ధ్రువ తూర్పు పవనాలు కలుసుకునే ప్రాంతంలో ‘సమశీతోష్ణ మండల చక్రవాతాలు’ ఏర్పడతాయి.

ధ్రువ తూర్పు పవనాలు: ధృవ అధిక పీడన ప్రాంతం నుంచి ఉప ధ్రువ అల్పపీడన ప్రాంతం వైపు 900-650 ల ఉత్తర అక్షాంశాల మధ్య వీచే ప్రపంచ పవనాలే ధ్రువ (తూర్పు పవనాలు).

ఫెరల్‌ సూత్రం ప్రకారం ఉత్తరార్ధ గోళంలో ఈశాన్యం నుంచి, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయం నుంచి అవి వీయడంతో క్రమంగా వీటికి ఈశాన్య ధ్రువ పవనాలని, ఆగ్నేయ ధ్రువ పవనాలని పేరు వచ్చింది. వీటినే తూర్పు పవనాలని కూడా అంటారు.

రుతు పవనాలు

మౌసమ్‌ (Mausam) అనే అరబిక్‌ పదం నుంచి గ్రహించిందే మాన్‌సూన్‌ (Monsoon). అంటే రుతువు అని అర్థం.

రుతువును బట్టి పవనం వీచే దిశలో నిర్దిష్టమైన మార్పులు ఉంటాయి.

1) నైరుతి రుతుపవనాలు: ఆగ్నేయ వ్యాపార పవనాలు జూన్‌ నెలలో భూమధ్య రేఖను దాటి నైరుతి రుతుపవనాలుగా రూపాంతరం చెందుతాయి.

2) వాయవ్య రుతుపవనాలు: ఈశాన్య వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి వాయవ్య రుతుపవనాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ వాయవ్య రుతుపవనాలు ఆస్ట్రేలియా ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు వర్షాన్నిస్తాయి.

స్థానిక పవనాలు

పరిమిత ప్రాంతంలో పరిమిత కాలానికి వీచే పవనాలు.

1) భూపవనం: రాత్రి సమయంలో భూమి నుంచి జల భాగం మీదకు వీస్తాయి.

2) జల పవనం: పగటి సమయంలో జల భాగం నుంచి భూమి మీదకు వీస్తాయి.

3) పర్వత పవనం: రాత్రి సమయంలో పర్వతం నుంచి లోయ వైపునకు వీస్తాయి.

4) లోయ పవనం: పగులు ఏర్పడి, లోయ నుంచి పర్వతం వైపునకు వీస్తాయి.

ప్రపంచంలోని ముఖ్యమైన స్థానిక పవనాలు

1) వెచ్చని పవనాలు (Hot Local Winds)

చినూక్‌: రాకీ పర్వతాలను దాటి ఉత్తర అమెరికాలోకి వీస్తాయి. చినూక్‌ మంచు భక్షకాలు. ప్రయరీ గడ్డి భూముల్లోని మంచును తొలగిస్తుంది. చినూక్‌ అనే పేరు అమెరికాలోని మూలవాసి ప్రజల పేరు.

ఫోయెన్‌ (Foehn): ఫ్రాన్స్‌, ఇటలీల్లో వీస్తాయి. ద్రాక్ష పండ్లు పక్వం (Ripening) రావడానికి ఉపయోగపడతాయి. ఆల్ప్స్‌ పర్వతాల మీదుగా వీస్తాయి.

సిరాకో (Sirocco): సహారా ఎడారి నుంచి మధ్యధరా సముద్రం వైపునకు వీస్తాయి. రక్త వర్షాన్నిచ్చే పవనాలు. ఎర్రని ఇసుక, వర్షం కలిసి పడటం వల్ల ఈ వర్షాన్ని ‘రక్త వర్షం’ అంటారు.

సైమూన్‌ (Simoon): అరేబియాలో వీస్తాయి. విష పవనాలు (Poison Winds) అని పిలుస్తారు.

లూ (Loo): థార్‌ ఎడారి నుంచి ఉత్తర భారతదేశం మైదానాలకు వీచే పవనాలు.

యమో (Yamo): జపాన్‌లో వీస్తాయి.

నార్వెస్టర్‌ (Norwester): న్యూజిలాండ్‌లో వీస్తాయి.

శాంటా అనా (Santa Ana): కాలిఫోర్నియాలో వీస్తాయి. వీటికి ‘దయ్యపు పవనాలు’ అని పేరు.

గిబ్లి: లిబియాలో వీస్తాయి.

ఖామ్‌సిన్‌- ఈజిప్టులో వీస్తాయి.

హర్మటన్‌- కామెరూన్‌, నైజీరియాలో వీస్తాయి. వీటికి గినియా డాక్టర్లు అని పేరు.

కేప్‌ డాక్టర్లు: దక్షిణాఫ్రికాలో వీస్తాయి.

ఫ్రేమాంటిల్‌ డాక్టర్లు: పశ్చిమ ఆస్ట్రేలియాలో వీస్తాయి.

బ్రిక్‌ ఫీల్డర్‌: దక్షిణ ఆస్ట్రేలియాలో వీస్తాయి.

2) శీతల స్థానిక పవనాలు

మిస్ట్రల్‌: ఫ్రాన్స్‌లో వీస్తాయి. ఆల్ప్స్‌ పర్వతాల నుంచి మధ్యధరా సముద్రం వైపునకు వీచే పవనాలు. ఇవి రోమ్‌లోయ గుండా వీస్తాయి.

పూనా: పెరూలో వీస్తాయి. ఆండీస్‌ పర్వతాల్లో వీచే పవనాలు.

పాంపెరో: అర్జెంటీనాలో వీస్తాయి. పెటగోనియాలోని పంపా గడ్డి భూముల్లో వీచే పవనాలు.

బోరా: బాల్కన్‌ ద్వీపకల్పం

నోర్టె: మెక్సికోలో వీస్తాయి.

లెవాంటీర్‌: స్పెయిన్‌లో వీస్తాయి.

పుర్గ- రష్యాలోని టండ్రాలో వీస్తాయి. వీటికి బురాన్‌ పవనాలు అని పేరు.

వాతావరణ ఆర్ధ్రత

వాతావరణంలోని తేమ శాతాన్ని ఆర్ధ్రత అంటారు. ఆర్ధ్రత మాపకం (Hygrometer) ద్వారా ఆర్ధ్రతను కొలుస్తారు.

ఆర్ధ్రత 3 రకాలు. అవి..

1) విశిష్ట ఆర్ధ్రత (Specific Humidity): కిలోగ్రామ్‌ గాలిలో ఎన్ని గ్రాముల నీటి ఆవిరి ఉందో చెప్పడం.

2) నిరపేక్ష ఆర్ధ్రత: నిర్ణీత పరిమాణం గల గాలిలోని నీటి ఆవిరిని గ్రాముల్లో చెప్పడం

3) సాపేక్ష ఆర్ధ్రత: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వాతావరణం మోయగలిగిన నీటి ఆవిరికి, వాస్తవంగా ఉన్న నీటి ఆవిరికి మధ్యగల తేడాను ‘సాపేక్ష ఆర్ధ్రత’ అంటారు.

సంతృప్త స్థితి (Saturated): సాపేక్ష ఆర్ధ్రత వంద శాతానికి చేరుకుంటే సంతృప్తి స్థితిగా పరిగణిస్తారు.

సంతృప్త స్థాయి: ఏ ఉష్ణోగ్రత వద్ద వాతావరణం సంతృప్త స్థితికి చేరుకుంటుందో ఆ ఉష్ణోగ్రతను ‘సంతృప్త స్థాయి’ అంటారు.

ద్రవీభవనం (Condensation): వాతవరణంలోని తేమ నీరుగా మారే ప్రక్రియ.

ద్రవీభన స్థాయి (Dewpoint): 00 కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త స్థాయికి చేరుకుంటే ద్రవీభవన స్థాయి అంటారు (వర్షం పడుతుంది).

ఘనీభవన స్థాయి (Freeaing Point): 00 కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త స్థాయికి చేరుకుంటే ‘ఘనీభవన స్థాయి’ (వడగళ్లు (Hail Strorms) పడతాయి) అంటారు.

ఉత్పతనం (Sublimation): మంచు నీరుగా మారకుండా నేరుగా నీటి ఆవిరిగా మారడం.

అవపాతం: వాతావరణంలోని తేమ ఏ రూపంలోనైనా సరే భూమి ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతం అంటారు. అవపాతంలోని ప్రధానమైంది వర్షపాతం. హిమశీకరం, వడగళ్లు, తుషారం, హిమం ఇతర అవపాత రూపాలు.

హిమశీకరం (Sleet): వర్షపు బిందువుల రూపంలో ప్రారంభమై వర్షపాతం మార్గమధ్యలో అతి చల్లటి పరిస్థితుల వల్ల మంచుగా మారి భూ ఉపరితలాన్ని చేరడం.

వడగళ్లు: ఘనీభవన రూపంలో పడే వర్షాన్ని వగడళ్లు అంటారు. ఇవి పంటలకు నష్టం కలిగిస్తాయి.

తుషారం: చల్లని ఘన ఉపరితలంపై ఏర్పడే నీటి బిందువులు.

మేఘాలు


ఉష్ణోగ్రతలు బాగా తక్కువైనప్పుడు సాపేక్ష ఆర్ధ్రతలు పెరిగి దగ్గరగా చేరిన నీటి అణువుల సమూహాన్ని మేఘం అంటారు. మేఘాలను కింది విధంగా వర్గీకరించారు.

1) ఉష్ణోగ్రత ఆధారం

ఎ. శీతల మేఘాలు: మేఘాల ఉపరితలాలు 00 కంటే తక్కువగా ఉంటే వాటిని శీతల మేఘాలు అంటారు. వీటిలోని నీరు ఘన రూపంలో ఉంటుంది.

బి. ఉష్ణ మేఘాలు: మేఘాల ఉపరితలాలు 00 కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఉష్ణ మేఘాలు అంటారు. వీటిలో నీరు ఆవిరి రూపంలో ఉంటుంది.

సి. మిశ్రమ మేఘాలు: పై రెండు రకాల మేఘాలు కలిసి ఏర్పడే మేఘాలు. వీటి వల్లనే వర్షం పడుతుంది.

2) ఎత్తు, నిర్మాణాన్ని బట్టి

ఎ. ఉన్నత మేఘాలు: సరాసరి ఎత్తు 6000 మీ. వరకు ఉంటుంది. ఇవి మళ్లీ 3 రకాలు.

1) సిర్రస్‌ మేఘాలు: పలుచగా, పట్టుకుచ్చు వలే ఉంటాయి. వీటిని గుర్రం తోక మేఘాలు (Mares Tails) అంటారు. ఇవి నిర్మల వాతావరణాన్ని సూచిస్తాయి. 8000 నుంచి 1200 మీ. ఎత్తులో ఏర్పడుతాయి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి.

2) సిర్రోస్ట్రేటస్‌: పలచని పొరలాగా ఆవరించి ఉంటాయి. ఇవి తుఫాన్‌ రాకను సూచిస్తాయి.

3) సిర్రోక్యుములస్‌: చిన్న చిన్న మచ్చల రూపంలో బారులు బారులుగా ఉంటాయి. మెకరల్‌ అనే చేప పొలుసులను పోలి ఉంటాయి.

బి. మధ్య మేఘాలు: 2000 నుంచి 6000 మీ. సగటు ఎత్తున ఉండే మేఘాలు. ఇవి 3 రకాలు

1) ఆల్టోస్ట్రేటస్‌: పెద్ద వర్షం తర్వాత కనిపించే మేఘాలు. లేత నీలం రంగులో ఉంటాయి.

2) ఆల్టోక్యుములస్‌: పెద్ద మచ్చలతో తెలుపు, బూడిద రంగులో ఉండే మేఘాలు.

సి. నిమ్న మేఘాలు: ఉపరితలం నుంచి 2000 మీ. ఎత్తులో ఉండే మేఘాలు. ఇవి 5 రకాలు.

1) స్ట్రాటస్‌: భూ ఉపరితలంపై చిన్న చిన్న కొండలపై కనిపించే మేఘాలు. వేగంగా కదులుతూ కనిపించే మేఘాలు ఇవే. విభిన్న ఉష్ణోగ్రతలు గల వాయురాశుల కలయిక వల్ల ఏర్పడతాయి.

2) స్ట్రాటో క్యుములస్‌: బూడిద రంగులో ఉండి, అలలుగా విస్తరించి ఉండే మేఘాలు.

3) నింబో స్ట్రాటస్‌: వర్షాన్నిచ్చే మేఘాలు. మోస్తరుగా నలుపు రంగులో ఉంటాయి.

4) క్యుములస్‌: కాలీఫ్లవర్‌ ఆకారంలో కనిపించే మేఘాలు.

5) క్యుములోనింబస్‌: పర్వతాల వలే దట్టమైన నలుపు రంగులో ఉండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కారణమయ్యే మేఘాలు ఇవే. వీటిని మేఘాల రాజు అని అంటారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section