పద్యము(Padhyamu)
పాఠ్యభాగ ఉద్దేశ్యం : వెయ్యేళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి ఆలంబనగా నిలిచిన పద్య ప్రక్రియ మాధుర్యాన్ని, వైవిధ్యాన్ని తెలియ చేస్తూ పద్యం రాయువారికి తగిన సూచనలు చేయటం.
పాఠ్యభాగ సారాంశం : పద్య కవిత్వానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రాచీన సాహిత్యంలోని సాహిత్య గ్రంథాలతో పాటు శాస్త్రగ్రంథాలు కూడా పద్యాలలోనే రచింపబడ్డాయి. ఉదాహరణకు పావులూరి మల్లన రచించిన గణితశాస్త్రం కానీ, ఆయుర్వేద పుస్తకాలు కానీ, వైద్యగ్రంథాలు కూడా పద్యాల్లోనే రచింపబడ్డాయి. నన్నయకు ముందు నుంచే క్రీ.శ. 940 నాటి కుర్క్యాల శాసనంలో కూడా కంద పద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పద్యానికి నియమాలు, లయాత్మకమైన నడక ఉండటం వల్ల అందరిని ఆకర్షింపగలిగింది.
( పద్యం అనే పదానికి మార్గం, తోవ, అల్లడం కూర్చటం వంటి అర్థాలున్నాయి. యతి, ప్రాస నియమాలున్నాయి. వీటన్నింటిని కవి సమన్వయం చేస్తూ సృష్టించే నాలుగు పాదాల కూర్పును పద్యం అనవచ్చు. పద్యం అనే పదం "పదగతౌ”” అనే సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది.
నిర్వచనం : యతిప్రాస వంటి ఛందో నియమాలతో కూడిన దానిని పద్యం అంటారు. కవి చెప్పదలచుకున్న విషయాన్ని కళాత్మకంగా, పాఠకులు అనుభూతి చెందేటట్లు నియమాలను పాటిస్తూ రాస్తే దాన్ని పద్యం అనవచ్చు.
పద్యము లక్షణాలు :
- పద్యం ఛందస్సు సూత్రాలు అంటే గణాలు, యతి, ప్రాసలతో రూపుదిద్దుకుంటుంది.
- సాధారణంగా ఏ పద్యంలోనైనా నాలుగు పాదాలుంటాయి. ద్విపదలో మాత్రం రెండేసి పాదాలుంటాయి.
- అక్షరాలు గురువు, లఘువులుగా ప్రయోగించబడుతాయి. గురువు ద్విమాత్రాకాలంలో, లఘువు ఏకమాత్రకాలంలో పలుకబడే అక్షరం.
- గణాలతో పద్యం ఏర్పడుతుంది.
- పద్యపాదంలోని మొదటి అక్షరానికి అదే పాదంలోని నిర్దిష్ట స్థానంలోని అక్షరంతో మైత్రి పాటించే అక్షరం ఉంటుంది. దాన్ని యతి అంటారు. పద్యమును బట్టి యతిస్థానం మారుతూ ఉంటుంది.
- పద్యంలోని అన్ని పాదాల్లో రెండో అక్షరం ఏకరూపత కలిగి ఉంటుంది. దాన్ని ప్రాస అంటారు.
- అక్షర గణాలతో వృత్త పద్యాలు ఏర్పడతాయి.
- ఉపగణాలతో జాతి, ఉపజాతి పద్యాలు నిర్మాణమవుతాయి.
- ఇవి దేశీ ఛందస్సు శాఖకు చెందినవి.
- కందం, ద్విపద, ఉత్సాహ, తరువోజలు జాతిపద్యాలు. యతి ప్రాసలుంటాయి. మాత్రాగణాలతోనూ వీటిని లెక్కించవచ్చు.
- ఆటవెలది, తేటగీతి, సీసపద్యాలు ఉపజాతి రకానికి చెందినవి. వీటిలో ప్రాస ఉంటుంది కానీ నిర్బంధం కాదు.
- కవి చెప్పదలచుకున్న భావాన్ని అనుసరించి వృత్తం, జాతి, ఉపజాతి పద్యాన్ని ఎంపిక చేసుకుంటాడు.