Type Here to Get Search Results !

Vinays Info

Current Affairs

Top Post Ad

తెలంగాణకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డులు

-దేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అత్యున్నత ప్రతిభ చూపిన 13 మంది ఐఏఎస్ అధికారులకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ 13 మందిలో దక్షిణ భారతీయులు కేవలం ఇద్దరేకాగా.. ఆ ఇద్దరూ తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. నగరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో సక్సెస్ అయినందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈ అవార్డులు దక్కాయి. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏప్రిల్ 21న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని చేతులమీదుగా వారు అవార్డులు అందుకున్నారు.
Janardhanreddy

ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం స్పోర్ట్స్ కోటా

-రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు రెండుశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ర్టానికి నాలుగు కాయకల్ప అవార్డులు

-ఉన్నత ప్రమాణాలతో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న ఆస్పత్రులకు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్న కాయకల్ప అవార్డులు రాష్ట్రంలోని నాలుగు ఆస్పత్రులకు దక్కాయి. ఇందులో జిల్లా ఆస్పత్రుల విభాగంలో తొలిస్థానంలో ఖమ్మం జిల్లా ఆస్పత్రి, రెండోస్థానంలో కింగ్‌కోఠి ఆస్పత్రులు నిలిచాయి. ఏరియా ఆస్పత్రుల విభాగంలో తొలి స్థానంలో బాన్సువాడ ఆస్పత్రి, రెండో స్థానంలో భద్రాచలం ఆస్పత్రులు బహుమతులు పొందాయి.

జేజి మామయ్య మృతి

-ప్రముఖ వాగ్గేయకారుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు ఏప్రిల్ 22న మరణించారు. ఆయన చండీదాస్, గ్రీష్మ రుతువు వంటి రచనలు చేశారు. జేజి మామయ్య పేరుతో చిన్న పిల్లల పాటను ఆకాశవాణిలో ప్రసారంచేసిన ఆయన ఆకాశవాణి సంచాలకునిగా పనిచేశారు. ఆయన రాసిన వాగ్గేయకార చరిత్ర పుస్తకానికిగాను 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
BALATHAPU-RAJANIKANTH

కోల్ ఇండియా సీఎండీగా సురేష్‌కుమార్

-సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ 2018, ఏప్రిల్ 20న కోల్ ఇండియా నూతన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్‌కు చెందిన జమ్ముకశ్మీర్ క్యాడర్ అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఢిల్లీ హైకోర్టు మాజీ సీజే మృతి

-ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్‌సింగ్ సచార్ మరణించారు. దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సచార్ అధ్యక్షత వహించారు.

చిన్నారులపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష

-12 ఏండ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే రేపిస్టులకు గరిష్టంగా మరణశిక్ష విధించే ఆర్డినెన్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఏప్రిల్ 22న ఆమోదం తెలిపారు. దీంతోపాటు రుణ ఎగవేతదారుల ఆస్తుల జప్తు, శిక్షల విధింపునకు సంబంధించిన ఆర్డినెన్సుపై కూడా సంతకం చేశారు.

క్యూబా అధ్యక్షుడిగా కనెల్

-క్యూబా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత మిగుల్ డియాజ్ కనెల్ (58) క్యూబా నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. రౌల్ క్యాస్ట్రో (86) అధ్యక్ష పదవికి ఏప్రిల్ 19న రాజీనామా చేశారు. అంతకుముందు రౌల్ సోదరుడు ఫిడెల్ క్యాస్ట్రో ఐదు దశాబ్దాలపాటు క్యూబా అధ్యక్షుడిగా పనిచేశారు. అనారోగ్య కారణాలవల్ల 2006లో ఫిడెల్ పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన సోదరుడు రౌల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
INTERNATIONAL

2018 పులిట్జర్ బహుమతులు

-అమెరికాలో జర్నలిజం, సాహిత్యం, సంగీతంలో ఇచ్చే అత్యున్నత పులిట్జర్ ప్రైజ్‌లను ఏప్రిల్ 17న ప్రకటించారు. జర్నలిజం విభాగంలో ది న్యూయార్క్ టైమ్స్, ది న్యూయార్కర్ పత్రికలకు సంయుక్తంగా ఈ బహుమతి దక్కింది. హాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చినందుకు వీటికి ఈ పురస్కారం లభించింది. సంగీత విభాగంలో పాప్ గాయకుడు కెండ్రిక్ లామర్ రూపొందించిన డామ్న్ ఆల్బమ్‌కు, సాహిత్యంలో అండ్రూ సీన్ గ్రీర్ రాసిన కాల్పనిక నవల లెస్‌కు పులిట్జర్ ప్రైజ్ వచ్చింది.

నాసా టెస్ ప్రయోగం విజయవంతం

-అంతుచిక్కని గ్రహాల అన్వేషణ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏప్రిల్ 18న స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఈఎస్‌ఎస్-టెస్)ను విజయవంతంగా ప్రయోగించింది.

సౌదీలో 35 ఏండ్ల తర్వాత సినిమా

-సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల సినిమా థియేటర్లపై నిషేధం ఎత్తివేయడంతో ఏప్రిల్ 19న తొలిసారి సినీ ప్రదర్శన జరిగింది. రాజధాని రియాద్‌లో బ్లాక్ పాంథర్ సినిమాను ప్రదర్శించారు.

కామన్‌వెల్త్ దేశాధినేతల సమావేశం

-ఏప్రిల్ 18, 19 తేదీల్లో లండన్‌లో కామన్‌వెల్త్ దేశాధినేతల 25వ సమావేశం జరిగింది. 52 దేశాల అధినేతలు పాల్గొన్న ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక అంశాలు, సైబర్ భద్రత, ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. భారత్ తరఫున ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నార్డిక్ దేశాల ప్రతినిధులతో ప్రధాని సమావేశం

-ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రధాని మోదీ నార్డిక్ దేశాల (స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్) ప్రతినిధులతో సమావేశమయ్యారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ఈ సమావేశం జరిగింది. పెట్టుబడులు, వాణిజ్యం, ఉగ్రవాదం నిర్మూలన తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.

విధుల్లోకి చైనా స్టెల్త్ యుద్ధ విమానం

-చైనా నూతనంగా అభివృద్ధి చేసిన బహుముఖ స్టెల్త్ యుద్ధ విమానం జే10-సీ ఏప్రిల్ 16న సైనిక విధుల్లో చేరింది. ఈ యుద్ధ విమానం ఉపరితల, సముద్ర లక్ష్యాలను కచ్చితంగా చేధించగలదు.

రవిశంకర్‌కు ఇంటర్నేషనల్ లీడర్‌షిప్ అవార్డు

-ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ లీడర్‌షిప్ అవార్డు లభించింది. ఏప్రిల్ 18న లాస్ ఏంజెల్స్‌లో ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

ఒకే టోర్నీని 11 సార్లు..

స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మోంటెకార్లో మాస్టర్ సిరీస్ టైటిల్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 22న మోంటెకార్లోలో జపాన్‌కు చెందిన నిషికోరితో జరిగిన ఫైనల్‌లో 6-3, 6-2తో విజయం సాధించాడు. దీంతో 1998 నుంచి ఓపెన్ శకంలో ఒకే టోర్నమెంటును అత్యధికంగా 11 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. నాదల్ కెరీర్‌లో ఇది 76వ సింగిల్స్ టైటిల్ కాగా, మాస్టర్స్ సిరీస్‌లో 31వది.
Raffel-nadal

విన్నింగ్ లైక్ సచిన్

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను తెలుపుతూ విన్నింగ్ లైక్ సచిన్-థింక్ అండ్ సక్సీడ్ లైక్ టెండూల్కర్ పేరుతో దేవేంద్ర ప్రభుదేశాయ్ పుస్తకాన్ని రాశారు.

జూడోలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు

దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు సాధించింది. ఏప్రిల్ 22న జరిగిన పోటీల్లో సునిబాలాదేవి (63 కేజీలు), అనిత (57 కేజీలు), కల్పనాదేవి (52 కేజీలు), సుశీలాదేవి (48 కేజీలు)లు స్వర్ణాలు సాధించారు.

టైమ్ జాబితాలో కోహ్లీ, దీపిక

-టైమ్ మ్యాగజీన్ 2018కిగాను ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రకటించింది. ఏప్రిల్ 19న వెల్లడించిన ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహవ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. వీరితోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ నటీమణులు నికోల్, గడోట్, మేఘన్ మెర్కెల్, బ్రిటన్ యువరాజు హ్యారీ, సౌదీ యువరాజు బిన్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, కెనడా ప్రధాని ట్రూడో, ఐర్లాండ్ ప్రధాని వరద్కర్, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పాప్ గాయని జెన్నిఫర్ ఈ జాబితాలో ఉన్నారు.
Dhipika

ఫార్చూన్ గ్రేట్ లీడర్స్ లిస్టులో ముఖేశ్

-ఫార్చూన్ మ్యాగజీన్ 2018కిగాను 50 మందితో రూపొందించిన ప్రపంచ గొప్ప నాయకుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి చోటు (24వ స్థానం) దక్కింది. ఏప్రిల్ 19న విడుదల చేసిన ఈ జాబితాలో మానవ హక్కుల న్యాయవాది ఇందిరా జైసింగ్ (20వ స్థానం) కూడా ఉన్నారు. అమెరికాలోని కాల్పుల బాధిత పాఠశాల మర్జోరీ స్టోన్‌మాన్ డగ్లస్‌తోపాటు ఇతర పాఠశాలల విద్యార్థులకు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది. బిల్, మిలిండా గేట్స్ రెండో స్థానంలో నిలిచారు.

మక్సూసీకి యుధ్‌వీర్ అవార్డు

-ఈ ఏడాది యుధ్‌వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీ ఎంపికయ్యారు. ఏప్రిల్ 30న ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డు కింద లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధుడు, పత్రికా సంపాదకుడు యుధ్‌వీర్ జ్ఞాపకార్థం ఈ అవార్డును నెలకొల్పారు.

ప్రపంచ కురువృద్ధుడు జరమిలో మృతి

-ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందిన, చిలీ దేశానికి చెందిన సిలినో విలాన్యుయెవా జరమిలో (121) ఏప్రిల్ 19న మృతి చెందారు. చిలీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం జరమిల్లో 1896 జూలై 25న జన్మించారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.