Type Here to Get Search Results !

Vinays Info

మూడు వ్యవసాయ చట్టాలు రద్దు: ప్రధాని మోదీ

మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్‌ జయంతి(నవంబర్‌ 19) సందర్భంగా ఆయన నవంబర్‌ 19న దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త చట్టాలపై దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నానని పేర్కొన్నారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.  సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను 2021 ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. 


మూడు సాగు చట్టాలు–వివరాలు


2020, జూన్‌ 5 : మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది.

2020, సెప్టెంబరు 14–22: ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడం, పెద్దగా చర్చలేకుండా లోక్‌సభ, రాజ్యసభలు మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయింది.

2020, సెప్టెంబర్‌ 27: రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చాయి.

2021, జనవరి 12: ఈ చట్టాల రద్దు కోరుతూ అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఈ మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై ‘స్టే’ విధించింది.

1. ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌– ఎఫ్‌పీటీసీ) యాక్ట్‌

రైతులు తమ ఉత్పత్తుల ప్రాంతీయ వ్యవసాయ మార్కెట్లలో కాకుండా... వాటి పరిధిని దాటి దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకొనే స్వేచ్ఛను కల్పించింది. అధికధరలు ఎక్కడ లభిస్తే అక్కడ విక్రయించుకోవచ్చు. ఎక్కడి వ్యాపారులైనా... ఎక్కడికైనా వచ్చి పంట ఉత్పత్తులను కొనొచ్చు. రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాలను నిర్వీర్యం చేసింది. మార్కెట్‌ కమిటీలు వసూలు చేసే సెస్‌ను రద్దు చేసింది.


2. ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ యాక్ట్, 2020

ఒప్పంద వ్యవసాయానికి (కాంట్రాక్టు ఫార్మింగ్‌) ఇది చట్టబద్ధతను చేకూర్చింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందు రైతులు ఫలానా ధరకు తమ పంటను అమ్ముతామని కొనుగోలుదారుతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొనుగోలుదారులు రైతులకు ఏ పంటకు ఎంత కనీస మద్దతు ధర చెల్లించాలనేది ఈ చట్టంలో ప్రస్తావన లేదు.


3. నిత్యావసర వస్తువుల సవరణ చట్టం–2020

నిత్యావసర వస్తువుల నిల్వల పరిమితిపై ఇదివరకున్న ఆంక్షలను ఈ చట్టం ఎత్తివేసింది. అసాధారణ, అత్యయిక పరిస్థితులు తలెత్తితే తప్ప నిత్యావసర వస్తువుల నిల్వలపై ఆంక్షలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా చేసింది. వంటనూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల తదితర ఆహార వినియోగవస్తువులను నిత్యావసరాల జాబితాలో నుంచి తొలగించింది. ఉద్యానపంటల ధరలు రిటైల్‌ మార్కెట్లో 100 శాతం పెరిగితే, ఆహారధాన్యాల ధరలు 50 శాతానికి పైగా పెరిగితేనే వ్యాపారులు, హోల్‌సేలర్ల వద్ద సదరు సరుకులు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిమితులు విధించడానికి ఈ చట్టంలో వీలుకల్పించారు.


కొందరు ప్రముఖులు...

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కొందరు ప్రముఖుల వివరాలు ఇలా..

1. రాకేశ్‌ తికాయత్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి. 52 ఏళ్ల వయసున్న ఒకప్పుడు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.

2. దర్శన్‌పాల్‌: అఖిల భారత సంఘర్ష్‌ సమన్వయ కమిటీ సభ్యుడు. వృత్తిరీత్యా డాక్టర్‌.

3. జోగిందర్‌  సింగ్‌ ఉగ్రహాన్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఉగ్రహాన్‌) అధ్యక్షుడు. ఒకప్పుడు ఆర్మీలో పని చేశారు.

4. బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌: భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అధ్యక్షుడు. వయసు 78 ఏళ్లు. మాజీ సైన్యధికారి.

5. సుఖ్‌దేవ్‌ సింగ్‌ కొక్రికలన్‌: బీకేయూ, ఉగ్రహాన్‌ ప్రధాన కార్యదర్శి. వయసు 71 సంవత్సరాలు. స్కూలు టీచర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section