చర్మం
- శరీరంలో స్పర్శజ్ఞానం గ్రహించగల అతిపెద్ద జ్ఞానేంద్రియం చర్మం. చర్మం ప్రదర్శించే ఈ దృగ్విషయాన్ని ‘టాక్టియోసెప్షన్’ (Tactioception) అని వ్యవహరిస్తారు.
- ‘చర్మం’(Skin) గురించి అధ్యయనాన్ని ‘డెర్మటాలజీ’(Dermatology) అంటారు.
- మానవ శరీరంలో అతిపెద్ద అవయవం కూడా ఇదే.
- శరీరానికి దెబ్బతగలకుండా, హానికర క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా చర్మం అడ్డుకుని నిరంతరం రక్షణ కల్పించే రక్షక పొర. వ్యాధి నిరోధక యంత్రాంగంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- దేహ ఉష్ణోగ్రతా క్రమతలో పాల్గొనడమే కాకుండా, విసర్జకావయంగా కూడా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనపుడు ‘చెమట’ ద్వారా దేహ ఉష్ణోగ్రతను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది. చెమట ద్వారా శరీరం నుంచి వ్యర్థ పదార్థాల బహిష్కరణలో కూడా పాల్గొంటుంది. ముఖ్యంగా స్వేదం ద్వారా నీరు, లవణాలు, యూరియాలను బహిష్కరిస్తుంది. చర్మంలోని రక్తనాళాల సంకోచ, వ్యాకోచాల ద్వారా నీటి నష్టాన్ని నిరోధిస్తుంది.
- కొన్ని విటమిన్లు తయారుకావడానికి కూడా చర్మం ఉపయోగపడుతుంది.
చర్మ నిర్మాణంలో ముఖ్యంగా రెండు పొరలు గోచరిస్తాయి. అవి
- బాహ్యచర్మం (Epidermis)
- అంతశ్చర్మం (Endodermis)
1. బాహ్యచర్మం (Epidermis):
- ఇది చర్మంలో పూర్తిగా బయటవైపున ఉండే పొర.
బాహ్యచర్మంలో తిరిగి రెండు పొరలుంటాయి.
(a) కార్నియస్ స్తరం (Corneus layer)
(b) మాల్ఫీజియన్ స్తరం (Malpighian layer)
(a) కార్నియస్ స్తరం (Corneus layer): ఇది పూర్తిగా చర్మం బయటి వైపున అమరి ఉండే పొర. ఈ పొరలోని కణాలు నిర్జీవంగా ఉంటాయి. ఇవి ‘కెరాటిన్’ అనే ప్రోటీన్‌ను స్రవిస్తాయి. నిత్యం కొన్ని నిర్జీవ కణాలు వాటంతట అవే రాలిపోతూ ఉంటాయి. తిరిగి ఆ స్థానంలో మాల్ఫీజియన్ స్తరం నుంచి కొత్త కణాలు ఏర్పడతాయి.
(b) మాల్ఫీజియన్ స్తరం (Malpighian layer):దీనిని ‘జనన స్తరం’ అని కూడా అంటారు. ఇది సజీవంగా ఉన్న పొర. ఇందులో ఉత్పత్తి అయిన కణాలు క్రమంగా పైన గల కార్నియస్ పొరలోకి చేరుతాయి.
2. అంతశ్చర్మం (Endodermis):
- ఇది చర్మం లోపలి పొర. ఇందులో ఉండే ప్రోటీన్ ‘కొల్లాజిన్’.
- అంతశ్చర్మంలో రక్తకేశనాళికలు, నాడీ అంత్యాలు, కొల్లాజన్ పోగులు మొదలైనవి ఉంటాయి.
- ఇది బాహ్యచర్మం కంటే మందంగా ఉండి, కండరాలతో అతికి ఉంటుంది. కండరాల మధ్య సన్నటి ‘కొవ్వు పొర’ ఉంటుంది. కొవ్వులు ఇందులో నిల్వ ఉంటాయి. శరీరానికి కావలసిన శక్తిని వినియోగించుకుంటూ, శరీర ఉష్ణోగ్రతాక్రమతలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
- అంతశ్చర్మం ముఖ్యంగా చర్మానికి బలాన్ని, సాగే లక్షణాన్ని కలిగిస్తుంది. ఈ భాగంలోని ఎత్తు పల్లాల వల్లే ‘వేలిముద్రలు’ (Finger prints) ఏర్పడతాయి.
- అంతశ్చర్మంలో రోమ పుటికలు ఉంటాయి. ఇవి రోమాలను ఏర్పరుస్తాయి.
- వీటితో పాటు తైలాన్ని స్రవించే తైలగ్రంథులు, చెమటని స్రవించే స్వేదగ్రంథులు ఉంటాయి.
- అంతశ్చర్మంలో ‘స్పర్మ గ్రాహకాలు’ (Sensory Receptors) ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో వేళ్ల కొనల మీద, పెదవుల మీద అంతశ్చర్మ భాగంలో గుంపులుగా ఉంటాయి.
స్పర్శ గ్రాహకాలు రెండు రకాలు:
(a) పాసీనియన్ స్పర్శ గ్రాహకాలు
(b) నాసీసెప్టార్ కణాలు
- పీడనానికి సంబంధించిన గ్రాహకాలను ‘పాసీనియన్ స్పర్శ గ్రాహకాలు’ లేదా ‘పాసీనియన్ కణాలు’ అంటారు.
- ఉష్ణం, స్పర్శ, రసాయనాలకు సంబంధించిన గ్రాహకాలను ‘నాసీసెప్టార్ కణాలు’ లేదా ‘నాసీసెప్టార్‌లు’ అంటారు.
- చర్మం నుంచి ఏర్పడే నిర్మాణాలు:
(a) స్వేద గ్రంథులు
(b) తైల గ్రంథులు (లేదా) సెబేషియస్ గ్రంథులు
(c) క్షీర గ్రంథులు
(d) కొమ్ములు, గిట్టలు, రోమాలు మొదలైనవి.
స్వేద గ్రంథులు (Sweat glands):
ఇవి చెమటను స్రవిస్తాయి. చెమట శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. ఈ చెమటలో నీరు, లవణాలు ముఖ్యంగా సోడియం క్లోరైడ్, కొద్దిగా యూరియా, యూరిక్ ఆమ్లం, అకర్బన పదార్థాలు ఉంటాయి. చెమట దుర్వాసనకు కారణం దానిలో ఉండే యూరియా వలననే. శీతాకాలంలో చలికి రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల చెమట తక్కువగా రావడం జరుగుతుంది. స్వేద గ్రంథులు అధికంగా ఉండే ప్రాంతాలు అరిచేతులు, అరికాళ్లు. పెదాలపై స్వేద గ్రంథులుండవు.
తైల గ్రంథి (లేదా) సెబేషియస్ గ్రంథి(Sebaceous glands):
‘సెబం’ (Sebum) అనే ‘తైలం’ను స్రవిస్తుంది. సెబం చర్మాన్ని, వెంట్రుకలను నునుపుగా ఉంచుతుంది. తైల గ్రంథి రంధ్రాల్లో దుమ్ము, మలినాలు లేదా బాక్టీరియాలు చేరడం వల్ల ‘మొటిమలు’ (అఛ్ఛి) అనేవి ఏర్పడతాయి.
క్షీర గ్రంథులు(Milk Glands)
- క్షీర ఉత్పత్తికి తోడ్పడుతాయి. క్షీర గ్రంథులు మగవారిలో క్రియారహితం.
కొమ్ములు, గిట్టలు, రోమాలు:
- చర్మం మీది బాహ్యచర్మం నుంచి ఏర్పడే నిర్మాణాలు. ఇవి కెరటిన్ (Keratin)తో నిర్మితం.
చర్మానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు:
మెలనిన్ (Melanin):
- చర్మానికి రంగును ఆపాదిస్తుంది. మెలనిన్ గాఢత ఎక్కువైతే చర్మం గాఢ వర్ణంలోనూ, తక్కువగా ఉంటే లేత వర్ణంలోనూ ఉంటుంది.
- వెంట్రుకలు, కంటి నల్లగుడ్డు (ఐరిస్), పుట్టుమచ్చలలో ఉండు పదార్థం మెలనిన్. దీనివల్లనే వీటికి నలుపు రంగు కలుగుతుంది.
- మెలనిన్ లోపించినవారు తెల్లగా ఉంటారు. వీరిని ‘ఆల్బినో’లు (Albinos) అంటారు.అతినీలలోహిత కిరణాల దుష్ఫలితాల నుంచి చర్మాన్ని ఈ మెలనిన్ నిరంతరం రక్షిస్తుంది.
బ్లబ్బర్ (Blubber):
- కొన్ని జంతువులలో అంతశ్చర్మంలోని కొవ్వు పొర లేదా అడిపోజ్ కణజాలం చాలా మందంగా ఉంటుంది. దీనిని ‘బ్లబ్బర్’ అంటారు. శరీర ఉష్ణోగ్రతను కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
- ఉదా: తిమింగలాలు, డాల్ఫిన్, పెంగ్విన్ పక్షులు మొదలైనవి.