Type Here to Get Search Results !

Vinays Info

కుల వ్యవస్థీకరణ

Top Post Ad

-ఇవి ప్రతికులానికి సంబంధించిన ముఖ్యులతో రూపొంది ఆయా కులసభ్యుల మధ్య కులపరమైన కట్టుబాట్లు, వివాహం, పండుగలు, ఆస్తుల వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఘర్షణలను పరిష్కరిస్తాయి.
-డా. జీఎస్ ఘర్యే తన క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో కులానికి సంబంధించిన ఆరు సంప్రదాయ లక్షణాలను వివరించాడు. అవి..
-కులం అనేది సమాజంలో సెగ్మెంటల్ విభజన
-సమాజంలో గల క్రమానుగత విభజన (Hierarchical division)
-సామాజిక సంబంధాలు, ఆహార నియమాల్లో హద్దులను కలిగి ఉంటుంది.
-ఆయా కులాలకు సంబంధించి పౌర, మతపరమైన అశక్తతలను, ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.
-వృత్తి ఎంపికలో స్వేచ్ఛ ఉండదు.
-వివాహం విషయంలోనూ నిబంధనలు ఉంటాయి

ఈ ఆరు ముఖ్య లక్షణాల్లో కులానికి సంబంధించి ఘర్యే వివరించిన అంశాలు..

-కులం అనేది తీసివేయలేనిది, మార్చలేనిది, పంపిణీ చేయలేనిది
-కులాన్ని కులమే పాలించుకుంటుంది (కుల పంచాయతీల ద్వారా)
-ప్రతి కులానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది.
-భారతీయ సమాజం వివిధ కులాలు, ఉప కులాలతో ఏర్పడింది. వీటిలో కొన్ని స్వచ్ఛమైనవి, ఉన్నతమైనవి, మరికొన్ని నిమ్నమైనవిగా పరిగణించబడుతున్నాయి.
-కొన్ని కులాలకు పౌర, మతపరమైన ఉన్నతస్థాయి, మరికొన్ని కులాలకు అధమస్థాయి ఆపాదించబడింది. ఇదే అంటరానితనానికి దారితీసింది.
-ప్రతి కులం ప్రత్యేక వృత్తిని కలిగి ఉంది. ఈ వృత్తులు కొన్ని ఉన్నతంగాను, మరికొన్ని అధమంగాను పరిగణించబడుతున్నాయి.
-వివాహాలు కులానికి సంబంధించిన వ్యక్తుల మధ్యే జరుగుతాయి. దీన్నే కుల అంతర వివాహం అంటారు.
-కుల సంఘాల్లో పవిత్రత, అపవిత్రత అనే భావన ఉంటుంది.

కులం ప్రకార్యాలు లేదా విధులు

-కులం వృత్తిని నిర్ణయిస్తుంది
-కుల వ్యవస్థ ప్రధాన లక్షణం కులపరమైన వృత్తులు. ఇలా కులం ఆయా కుల సభ్యులకు వృత్తులను నిర్దేషిస్తూ సంబంధిత వృత్తి నైపుణ్యాలు అందేలా దోహదపడుతుంది.
-కుల వ్యవస్థ వల్ల ఆయా కుల సభ్యులు సంఘటితంగా ఉండి అవసరాల్లో కులంపై ఆధారపడటంవల్ల సాంఘిక భద్రత, నియంత్రణ సాధ్యమవుతుంది.
-కులంవల్ల ఏర్పడిన వివిధ రకాల వృత్తుల వైవిధ్యం వల్ల సమాజ అవసరాలు తీరేందుకు సరిపడే శ్రమవిభజన ఏర్పడింది.
-హిందూ మతం, సంస్కృతి ఈ వ్యవస్థ ద్వారానే సంరక్షించబడుతున్నాయి. అందుకే కులాన్ని హిందూ మత వ్యవస్థకు కంచుకోటగా ఏఆర్ దేశాయ్ అభివర్ణించారు.
-కులం వ్యక్తిగతంగా కుల సభ్యునికి వృత్తిని, వివాహాన్ని, సామాజిక భద్రతను ఇస్తుంది.
-కులం సమూహ స్థాయిలో వారి వారి కుల అలవాట్లను, సంస్కృతిని అలాగే భద్రతనిస్తుంది.
-సమాజ స్థాయిలో కులంవల్ల ఒక సామాజిక క్రమం, శ్రమ విభజన లాంటి పనులు చేస్తుంది.

కులం ఆవిర్భావ సిద్ధాంతాలు

కులం ఆవిర్భావం గురించి శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు సిద్ధాంతాల రూపంలో వివరించారు. అవి...
-సంప్రదాయ సిద్ధాంతం లేదా దైవ సిద్ధాంతం- రుగ్వేదం
-వృత్తిపర సిద్ధాంతం- నెస్‌ఫీల్డ్
-జాతి సిద్ధాంతం- రిస్లే
-రాజకీయ సిద్ధాంతం- యూరోపియన్ స్కాలర్లు
-కల్చరల్ ఇంటిగ్రేషన్ సిద్ధాంతం- శరత్ చంద్రరాయ్
-పరిణామ సిద్ధాంతం- డెంజిల్
-సంస్కార సిద్ధాంతం- హీకార్స్
-భౌగోళిక సిద్ధాంతం- గిల్బర్ట్

దైవ సిద్ధాంతం

-పురాతన భారతీయ సాహిత్యం ఈ సిద్ధాంతానికి ఆధారం. ఈ సిద్ధాంతం ప్రకారం కుల వ్యవస్థను దైవం ఏర్పర్చిందిగా భావిస్తారు. దీన్ని రుగ్వేదంలోని పురుష సూక్తంలో పేర్కొన్నారు.
-దీని ప్రకారం ప్రజాపతి బ్రహ్మ/విరాట్ పురుషుని తల నుంచి బ్రాహ్మణ వర్గం, భుజాల నుంచి క్షత్రియ వర్గం, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారు. వీటినే చాతుర్‌వర్ణాలు అంటారు. తల నుంచి ఏర్పడినవారు జ్ఞాన సంబంధమైన, భుజాల నుంచి ఏర్పడినవారు పాలనా సంబంధమైన, తొడల నుంచి ఏర్పడినవారు వ్యాపారం, వ్యవసాయం, పాదాల నుంచి ఉద్భవించిన శూద్రులు పై వర్గాలకు సేవలు చేసేందుకు ఏర్పడ్డారని తెలుపుతున్నది.
-కాలక్రమేణా అనులోమ (దాసి పుత్రులు), విలోమ (5వ వర్గం- పంచములు) వివాహాల వల్ల ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారిందనే అభిప్రాయం ఉంది. అలాగే తిరిగి కులాల మధ్య ఉపకులాలు కాలక్రమేణ ఏర్పడ్డాయనే వాదన ఉంది.

వృత్తిపరమైన సిద్ధాంతం

-దీన్ని నెస్‌ఫీల్డ్ రూపొందించాడు. ప్రజలు ఆచరించే వివిధ వృత్తుల మూలంగా ఆయా కులాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపాడు.
-కులానికి జాతి గాని, మతం గాని కారణం కాదని అభిప్రాయపడ్డారు.
-ఆర్యులు, ఆదిమ జాతి వారు అనే వైవిధ్యం అంగీకరించలేదు. కాలక్రమేణా అభివృద్ది చెందిన వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర జీవన ఉపాధులను బట్టి జీవన క్రమం, ప్రగతి అనుసరించింది. ఆయా సమూహాల వారు నిర్వహించే వృత్తిని బట్టి ఒక స్థితి, ప్రత్యేకత కలిగిందని వివరించాడు.
-హిందూ దేశంలో కులాలు ఏర్పడటంతో వాటిలో ఉన్నత, నిమ్నం అనే భావన కలగడానికి మానవ సమాజ చరిత్రే ముఖ్య సూచికని నెస్‌ఫీల్డ్ భావించాడు.
-కొన్ని వృత్తులు Pureగాను, మరికొన్ని Impureగాను పరిగణింపబడ్డాయి. వాటిని అనుసరించేవారు pure Casteగాను, Impure Caste గాను పరిగణింపబడ్డారని తెలిపాడు.

జాతి సిద్ధాంతం

-ఈ సిద్ధాంతాన్ని హెర్‌బర్ట్ రిడ్లే ప్రతిపాదించాడు.
-వివిధ జాతులకు నిలయమైన భారతదేశంలో తెలుపురంగు వారు ఉన్నత కులాలుగా, నలుపురంగు జాతులవారు నిమ్నకులాలుగా పరిగణించబడ్డారని తెలిపాడు. జాతికి మూలం శరీర ధర్మం, వారసత్వం, శరీర అవయవాల రూపు రేఖలు, ఇలా జాతి పరమైన కారణాలవల్ల కులాలు ఏర్పడ్డాయని వివరించాడు.

రాజకీయ సిద్ధాంతం

-సంప్రదాయ సిద్ధాంతాన్ని బలపరిచే యూరోపియన్ స్కాలర్లు ఈ వాదనను ముందుకు తీసుకువచ్చారు. వీరి ప్రకారం బ్రాహ్మణులు తమ సామాజిక ఆధిపత్యం కోసం ఏర్పర్చిన ఏర్పాటని వివరించారు.

సాంస్కృతిక సమీకృత సిద్ధాంతం

-దీన్ని శరత్‌చంద్ర రాయ్ తెలిపారు. వివిధ జాతుల మధ్యగల సంస్కృతులు సమీకృతం అవడం, విలీనీకరణం చెందడం వల్ల కులాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.

పరిణామ సిద్ధాంతం-ఈ సిద్ధాంతాన్ని డెంజిల్ ఇబ్బెస్టన్ రూపొందించాడు. ఇతని ప్రకారం జాతులన్నింటిలోనూ తెగలు వ్యవస్థీకరించబడి క్రమంగా తొమ్మిది వృత్తి సంఘాలు ఏర్పడి, వృత్తి నియమాలు ఏర్పాటు చేసి, వివాహం వంటి విషయాల్లో వీటి మధ్య నియమాలు రూపొందించడం, కొన్ని వృత్తులు పవిత్రం, అపవిత్రం అనే భావనలు పరిణామక్రమంలో ఏర్పడ్డాయని తెలిపాడు.

భౌగోళిక సిద్ధాంతం

-దీన్ని గిల్బర్ట్ ప్రతిపాదించాడు. దేశంలోగల వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులవల్ల వివిధ ప్రాంతాల వారు అనేక రకాల వృత్తులు నిర్వహించేవారు. చేపలు పట్టడం, వ్యవసాయం, పశుపోషణ లాంటి ఆయా పరిస్థితులకు అనుకూలించే జీవన విధానాలు పాటించేవారు. వారు వేరే ప్రాంతంలో స్థిరపడిన ఆయా పనులనే కొనసాగించడం వల్ల ఆయా కులాలు ఏర్పడ్డాయని తెలిపాడు.

పైన తెలిపిన సిద్ధాంతాలతోపాటు కులం ఆవిర్భావానికి సంబంధించి కింది వాదనలు వినిపిస్తాయి.
-కేట్కర్ అభిప్రాయం ప్రకారం దేశంలో గల వివిధ తెగలు, వర్గాలు హిందూ సమాజంలోకి రావడంవల్ల ఏర్పడ్డాయి.
-ఆర్యుల మూలంగానే కులం ఏర్పడిందని Sencut అభిప్రాయపడ్డారు.
-హట్టన్ సిద్ధాంతం అయిన Mana (అతీత శక్తి) ప్రకారం ఇతర అలవాట్లు ఆహారాలు, ఇతర సామాజిక అలవాట్లు సరైనవి కాదని భావించి ఒక సామాజిక సమూహం తనదైన జీవన విధానాన్ని పరిరక్షించుకోవడంవల్ల కులం ఆవిర్భవించదని తెలిపాడు.
-హట్టన్ ప్రకారం కులం అనేది ఏ ఒక్క మూల కారణంవల్ల ఏర్పడలేదు. పైన తెలిపిన బహుళ కారణాలవల్ల ఏర్పడిందని పేర్కొన్నాడు.

కులం అనుకూలతలు, ప్రతికూలతలు

-సమాజంలో వివిధ వృత్తులు ఉండటంవల్ల శ్రమ విభజనను ఏర్పర్చింది.
-ఆయా కులసభ్యులకు సామాజిక రక్షణ, భద్రతలను ఇస్తుంది.
-కుల సభ్యులు, కులాల మధ్య సేవా వినిమయం ద్వారా సహకార భావనను పెంపొదిస్తుంది.
-కులం జాతిపరమైన స్వచ్ఛతను పాటిస్తుంది.
-సంస్కృతి వ్యాప్తికి, ప్రసరణకు తోడ్పడుతున్నది.
-కులం ఒక సామాజీకరణ సాధనంగా పనిచేస్తుంది.
-కులం కులసభ్యుల మధ్య ఘర్షణను కులపంచాయతీల ద్వారా పరిష్కరిస్తుంది.
-సాంస్కృతిక వైవిధ్యాలకు తోడ్పడుతుంది.
-చేతివృత్తులు, కళలు వర్ధిల్లేందుకు తోడ్పడుతుంది.

-పైన తెలిపిన ఉపయోగాలు ఉన్నప్పటికీ కుల వ్యవస్థ సమాజంలో వివిధ అవలక్షణాలకు దారితీస్తుంది.
-సామాజిక అసమానతలు
-సామాజిక వెలి
-అంటరానితనం
-కొన్ని కులాలకు పరిమితమైన అమానవీయ సాంఘిక దురాచారాలు సతి, దేవదాసి, జోగిని వ్యవస్థలు, మానవ అక్రమ రవాణా
-మానవ హక్కుల ఉల్లంఘన
-వృత్తులను పరిమితం చేస్తూ ఆయా వర్గాలకు చెందినవారిని సామాజికంగా, ఆర్థికంగా బలహీనపరిచి వృత్తి గతిశీలత లేకుండా చేయడం
-సమాజంలోని వనరులను దూరం చేయడం
-సామాజిక ప్రగతికి ఆటంకంగా మారడం
-కులపరమైన సంఘర్షణలు
-ఘర్షణ ఫలితంగా జాతీయ సమగ్రతకు సవాలుగా మారడం
-వెట్టిచాకిరీ వంటి దురాచారాలు
-కొన్ని కులాలకు పరిమితమైన బాల్యవివాహ వ్యవస్థలు
-కులతత్వం
-ఇతర కులాలపట్ల ఘర్షణ వైఖరి కలిగి ఉండటం మొదలైనవి.

హిందూయేతర కులాలు

-వర్ణం, కులం ప్రాతిపదికన ఏర్పడిన హిందూ సామాజిక వ్యవస్థను విమర్శించిన ఇస్లాం, క్రిస్టియానిటీ ఇతర మతాలకు సంబంధించిన సమాజాల్లోనూ, వివిధ సమూహాల మధ్య కులవ్యవస్థను పోలిన విభజన కనిపిస్తుంది. ఇందుకు మతమార్పిడులు ఇతర అంశాలు కారణం అయినప్పటికీ ఆయా సమాజాల్లోని కులరూప వ్యవస్థలు కిందివిధంగా గోచరిస్తాయి.

ముస్లింల్లో కులాన్ని పోలిన వ్యవస్థ

-మొఘల్ పరిపాలనాకాలంలో ముస్లిం సమాజంలో Ashrafas, Ajlafs అనే విభజన ఉంది.
-Ashrafas: విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు వారి సంతానం.
-Ajalfs: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినవారు.
-పై రెండు వర్గాల్లో వృత్తిపరంగా, సామాజికపరంగా, సంస్కారపరంగా హిందూ కులవ్యవస్థలో ఉన్నట్లుగానే Ashrafasలకు ఉన్నత స్థానం, Ajlafsలకు నిమ్నస్థానం ఆపాదించారు.

Below Post Ad

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Really wonder Amaging your provided information. Nice. Thank you So much. All the best.

    ReplyDelete