Type Here to Get Search Results !

Vinays Info

Current Affairs

Telangana
Telangana

కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సుకు ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి ఆహ్వానం అందింది. 2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ జరిగే 49వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని వేదిక అధ్యక్షుడు బెర్జ్ బెండే కేటీఆర్‌ను ఆహ్వానించారు.

ఉద్దీపన

ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్శించేందుకు తెలంగాణలోని నకిరేకల్ నియోజకవర్గంలో ఉద్దీపన కార్యక్రమం అమలుచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నారు. ఉద్దీపన కార్యక్రమం ద్వారా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారు.

విద్యుత్ వినియోగం

విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో 7వ స్థానంలో ఉందని కేంద్ర విద్యుత్ మండలి అక్టోబర్ 21న విడుదల చేసిన ఓ నివేదికలో వివరించింది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, కేరళ ఉన్నాయి. National
National

ప్రధానుల మ్యూజియానికి శంకుస్థాపన

న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో నిర్మించనున్న భారత ప్రధానుల మ్యూజియం నిర్మాణానికి కేంద్ర మంత్రులు మహేశ్ శర్మ, హర్దీప్ సింగ్ పూరి అక్టోబర్ 15న శంకుస్థాపన చేశారు. రూ. 271 కోట్లతో నిర్మించనున్న ఈ మ్యూజియంలో ప్రధాని పదవుల్లో ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాల వివరాలను పొందుపర్చనున్నారు.

ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తకావిష్కరణ

కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ రచించిన ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తకాన్ని అక్టోబర్ 16న న్యూఢిల్లీలో ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ఆవిష్కరించారు.

ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్ పేరు మార్పు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు ఆ రాష్ట్ర కేబినెట్ అక్టోబర్ 16న తీర్మానం చేసింది. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఇక్కడి గంగా-యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు పరిసర ప్రాంతాన్ని కలిపి ఇలాహాబాద్ అని పేరు పెట్టాడు. కుంభమేళా జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు.

లాన్సెట్ నివేదిక

లాన్సెట్ సంస్థ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా 2016లో శ్వాసకోశ సమస్యలవల్ల 48వేల మంది మరణించారు. అస్తమా వ్యాధిగ్రస్తుల్లో కేరళ మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణలో 19వేల మంది మరణించారు. ఆజాద్ హింద్ వార్షికోత్సవంఆజాద్ హింద్ సర్కార్ 75వ వార్షికోత్సవాన్ని అక్టోబర్ 21న ఢిల్లీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1943 అక్టోబర్ 21న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ సర్కార్‌ను ప్రారంభించారు.
International
International

ఉభయచర విమానం

అక్టోబర్ 20న ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానం ఏజీ-600 తొలిసారిగా నీటిపై నుంచి నింగిలోకి ఎగిరింది. 15 నిమిషాల పాటు గగన విహారం అనంతరం విజయవంతంగా మళ్లీ నీటిపైనే దిగింది. దీన్ని ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా రూపొందించింది.

బ్రహ్మోస్‌కు పోటీగా చైనా కొత్త క్షిపణి

భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి పోటీగా చైనాలోని గువాంగ్‌డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ అక్టోబర్ 15న ఓ సూపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీనికి హెచ్‌డీ-1 అని పేరుపెట్టింది.

గ్లోబల్ ఎంప్లాయర్స్ కంపెనీల జాబితా

ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ గ్లోబల్ ఎంప్లాయర్స్-2018 జాబితాను ఫోర్బ్స్ అక్టోబర్ 16న విడుదల చేసింది. 2000 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితాలో అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్ అగ్రస్థానంలో నిలవగా మైక్రోసాఫ్ట్ రెండో స్థానం, ఆపిల్ మూడో స్థానం, వాల్ట్ డిస్నీ నాలుగో స్థానం, అమెజాన్ ఐదో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో 100లోపు ర్యాంకులను పొందిన భారత కంపెనీల్లో ఎల్ అండ్ టీ 22వ స్థానం, మహీంద్రా అండ్ మహీంద్రా 55వ స్థానం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 59వ స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ 91వ స్థానాల్లో నిలిచాయి.

పొడవైన సముద్ర వంతెన

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను అక్టోబర్ 24న ప్రారంభించారు. పెరల్ నది డెల్టాలోని హాంకాంగ్-జుహై-మకావు నగరాలను ఇది కలుపుతుంది. మొత్తం 55 కి.మీ. పొడవున్న ఈ వంతెన 22.9 కి.మీ. సముద్రంపై, 6.7 కి.మీ. సొరంగంలో ఉంది. 2009 డిసెంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది.

ఆసియా-ఐరోపా సమావేశం

ఆసియా-ఐరోపా యూనియన్ ప్రతినిధుల సమావేశం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో అక్టోబర్ 20న నిర్వహించారు. ఈ సమావేశాలకు భారత్ నుంచి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆంట్వెర్ప్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.

మహాసముద్రాల లోతైన అధ్యయనం

ఐదు మహాసముద్రాల్లోని లోతుల్లో పరిశోధనలు చేపట్టేందుకు ఫైవ్ డీప్ ఎక్స్‌పెడీషన్ అనే పేరుతో ఓ భారీ మానవసహిత ప్రాజెక్టును శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు. దీనికోసం డీప్ సబ్ మెర్జిన్స్ వెహికిల్ అమిటింగ్ ఫ్యాక్టర్ అనే సబ్ మెర్సిబుల్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. దీని సాయంతో 36 వేల అడుగుల తోలుల్లోకి మానవులు చేరుకునే అవకాశం ఉంది.Sports
Sports

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 17వ స్థానం

అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో అక్టోబర్ 6 నుంచి నిర్వహిస్తున్న యూత్ ఒలింపిక్స్ పోటీలు అక్టోబర్ 18న ముగిశాయి. ఈ పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010లో 8 పతకాలతో 58వ స్థానంలో, 2014లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి.

ముంబైదే విజయ్ హజారే

దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన విజయ్ హజారే టైటిల్‌ను ముంబై జట్టు గెలుపొందింది. అక్టోబర్ 20న జరిగిన ఫైనల్‌లో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 12 ఏండ్ల తర్వాత ముంబై ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది.

షాంఘై మాస్టర్స్ విజేత జకోవిచ్

షాంఘై మాస్టర్స్ టోర్నీ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ నిలిచాడు. చైనాలోని షాంఘైలో అక్టోబర్ 14న జరిగిన ఫైనల్లో జకోవిచ్ క్రొయేషియా ఆటగాడు కొరిచ్‌పై గెలుపొందాడు.

డెన్మార్క్ ఓపెన్‌లో రన్నరప్‌గా సైనా

డెన్మార్క్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌గా భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిలిచింది. అక్టోబర్ 21న జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన తైజు యింగ్ చేతిలో ఓడింది. Persons
Persons

సుజాతకు శక్తి భట్ పురస్కారం

అమెరికాలో స్థిరపడిన తెలంగాణ దళిత రచయిత్రి సుజాత గిడ్లకు ఈ ఏడాది శక్తి భట్ తొలి రచన పురస్కారం లభించింది. ఆమె రచించిన యాంట్స్ ఎమాంగ్ ఎలిఫెంట్స్: యాన్ అన్‌టచబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది.

ఎన్‌డీ తివారీ మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణ్ దత్ తివారీ అక్టోబర్ 18న మృతిచెందారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో 1925, అక్టోబర్ 18న జన్మించారు. 1976లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. ఉత్తరాఖండ్, యూపీ రెండు రాష్ర్టాలకు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు.

అన్నా బర్న్స్‌కు మ్యాన్ బుకర్ ప్రైజ్

ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్ఠాత్మకమైన మ్యాన్ బుకర్ ప్రైజ్-2018ను ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్ అక్టోబర్ 16న అందుకున్నారు. ఆమె రచించిన మిల్క్ మ్యాన్ నవలకు ఈ అవార్డు దక్కింది. మ్యాన్ బుకర్ ప్రైజ్ చరిత్రలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

సంగీత కళాకారిణి అన్నపూర్ణ మృతి

ప్రముఖ హిందుస్థానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణాదేవి ముంబైలో అక్టోబర్ 13న మృతిచెందారు. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్‌లో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు రోషనారా ఖాన్ కాగా.. మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరు స్థిరపడింది.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అలెన్ మృతి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచపు అత్యంత ధనికుల్లో ఒకరైన పాల్ అలెన్ అక్టోబర్ 16న మృతిచెందారు. మైక్రోసాఫ్ట్ మరో సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అలెన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. 1975, ఏప్రిల్ 4న ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించారు.

భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్

భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్‌కు ఐన్‌స్టీన్ ప్రైజ్-2018 అందించనున్నట్లు అమెరికన్ ఫిజికల్ సొసైటీ అక్టోబర్ 15న ప్రకటించింది. ఆయన లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. అక్టోబర్ 23న జరుగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో ప్రైజ్‌తో పాటు 10 వేల డాలర్ల నగదు ప్రోత్సాహకాన్ని ఆయన అందుకోనున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section