లక్నవరం - Laknavaram Pond
లక్నవరం అంటే తెలుసా మీకు? అది విశాలమైన స్థలంలో రెండు గుట్టల మధ్య ఉన్న అందమైన చెరువు. అదే లక్నవరం చెరువు. జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది.
ఈ చెరువును కాకతీయ రాజులు తవ్వించారు. ఎక్కువ వాననీళ్ళను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. ఈ చెరువు నీటివల్ల వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో పదమూడు ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మూడు ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. దీంతోపాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పటి నుండి లక్నవరం సందర్శకులతో కళకళలాడుతున్నది.