Type Here to Get Search Results !

Vinays Info

కరెంట్ అఫైర్స్

Top Post Ad

Telangana
TELANGANA.jpg

మహిళా బైక్ రైడర్ల సాహసయాత్ర విజయవంతం

నలుగురు మహిళా బైక్ రైడర్లు తలపెట్టిన ఆరు దేశాల సాహసయాత్ర ఏప్రిల్ 8న విజయవంతంగా ముగిసింది. ఫిబ్రవరి 11న ఈ సాహసయాత్రను హైదరాబాద్‌లో ప్రారంభించిన జయభారతి, శాంతి, శిల్పాబాలకృష్ణన్, ప్రియా బహదూర్‌లు మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియాతోపాటు భారత్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు.

హైదరాబాద్‌లో బస్తీ దవాఖాన

-పేదలకు మెరుగైన వైద్య సేవలకు ఉద్దేశించిన బస్తీ దవాఖాన హైదరాబాద్‌లో ఏప్రిల్ 6న ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ దవాఖానను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరంలో ప్రతి 10 వేల మందికి ఒక దవాఖాన చొప్పున 100 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నారు.

నాయినికి లోహియా పురస్కారం

-రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. రామ్‌మనోహర్ లోహియా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. లోహియా 108వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 4న లోహియా విచార్‌మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆయనకు ఈ అవార్డును అందజేశారు.

అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్

-మే 24 నుంచి 26 వరకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మంత్రి కే తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Sports
Sports.jpg

అత్యధిక బంతుల బౌలర్

-టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక బంతులు విసిరిన మొదటి బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ (30,020) నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక బాల్స్ బౌలింగ్ చేసిన ఆటగాళ్లుగా మురళీధరన్ (44,039 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, కుంబ్లే (40,850), షేన్‌వార్న్ (40,705) తర్వాత స్థానాల్లో ఉన్నారు.

మిథాలి అత్యధిక వన్డేల రికార్డు

-మహిళల విభాగంలో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రికెటర్‌గా మిథాలి రాజ్ రికార్డు సృష్టించింది. 1999లో అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లోకి ప్రవేశించింన మిథాలి వన్డేల్లో 6295 పరుగులు పూర్తిచేసింది. అత్యధిక వన్డేలు ఆడిన రికార్డు ఇప్పటివరకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట (191) ఉంది.

ఈఎస్‌పీఎన్ అవార్డులు

-భారత్ తరఫున క్రీడల్లో విశేషంగా రాణించిన క్రీడాకారులకు ఈఎస్‌పీఎన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఏప్రిల్ 3న ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారిణిగా పీవీ సింధు, ఉత్తమ క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్, ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్, ఉత్తమ జట్టుగా భారత మహిళల హాకీ జట్టు ఎంపికయ్యాయి. మొత్తం 11 విభాగాలకు చెందిన క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది.

కామన్‌వెల్త్ గేమ్స్


kk-en.jpg
ఏప్రిల్ 4న 21వ కామన్‌వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ప్రారంభమయ్యాయి. కామన్‌వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలో జరుగడం ఇది ఐదోసారి. క్రీడలను బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు ప్రారంభించారు. మొత్తం 71 దేశాలు పాల్గొంటుండగా, 6000 మంది క్రీడకారులు పాల్గొంటున్నారు.
-మనుబాకర్ (షూటింగ్) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం
-పూనం యాదవ్ వెయిట్ లిఫ్టింగ్ (69 కేజీలు) స్వర్ణం
-మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు స్వర్ణం
-హీన సిద్ధు షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - రజతం
-రవికుమార్ షూటింగ్ 10 మీటరు - కాంస్యం
-వికాస్ ఠాగూర్ వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీలు - కాంస్యం

బహ్రెయిన్ గ్రాండ్‌ప్రీ విజేత వెటల్

2018, ఏప్రిల్ 8న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రీ టైటిల్ విజేత సెబాస్టియన్ వెటల్ (ఫెరారీ డ్రైవర్). ఇదే సీజన్‌లో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను కూడా గెలిచాడు.

International
International.jpg

నామ్ సదస్సు

అలీన (నామ్) దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశం అజర్ బైజాన్ రాజధాని బాకులో ఏప్రిల్ 5, 6 తేదీల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఉగ్రవాద నిర్మూలనపై ప్రసంగించారు. 1961లో ఏర్పడిన ఈ సంస్థలో ప్రస్తుతం 120 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

సౌదీలో తెరుచుకోనున్న థియేటర్లు

మూడున్నర దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియాలో ఈ నెల 18న సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి.

రెండు దేశాలకు కొత్త అధ్యక్షులు

ఏప్రిల్ 3న జరిగిన ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్ ఫతా ఎల్ సిసి రెండో సారి విజయం సాధించారు.కోస్టారికా అధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్థి కార్లోస్ అల్వరాడో ఏప్రిల్ 2న ఎన్నికయ్యారు. అత్యంత పిన్న వయస్సున్న (38 ఏండ్లు) అధ్యక్షుడిగా ఆయన రికార్డుల్లో నిలిచారు.

సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రీతంసింగ్

ఏప్రిల్ 8న సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతికి చెందిన ఎంపీ ప్రీతంసింగ్ ఎన్నికయ్యారు. 2011, మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో థియా చియాంగ్‌పై ప్రీతం విజయం సాధించారు. 2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు.

సూర్యుడిపై అన్వేషణకు ప్రయోగం

సూర్యుడిపై వాతావరణం అధ్యయనం కోసం డెల్టా ఫోర్ హెవి లాంచ్ వెహికిల్ ద్వారా పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018, జూలై 31న ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. దీని జీవితకాలం ఏడేండ్లు.

National
National.jpg

సల్మాన్‌కు ఐదేండ్ల జైలు.. ఆపై బెయిలు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998, సెప్టెంబర్ 26న రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను చంపిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ఏప్రిల్ 5న ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఏప్రిల్ 7న బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నటులు సైఫ్‌అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలమ్‌లను నిర్దోషులుగా గుర్తించింది.

పెరిగిన ఉపాధి కూలీ

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కార్మికులకు చెల్లిస్తున్న రోజువారీ కూలీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. తమిళనాడులో రూ. 224 ఇస్తుండగా, తెలంగాణలో రూ. 205, కర్ణాటకలో రూ. 248, కేరళలో రూ. 271, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 273 చెల్లిస్తున్నారు.

సైబర్ దాడుల బాధిత దేశాల్లో భారత్@ 3

ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల బాధిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిమాంటిక్ సంస్థ ఎనిమిది అంశాల ఆధారంగా రూపొందించిన నివేదికను విడుదల చేసింది. ఇందులో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా తర్వాతి ర్యాంకులో ఉంది.

బీజేపీకి 38 ఏండ్లు

భారతీయ జనతాపార్టీని స్థాపించి ఏప్రిల్ 6 నాటికి 38 ఏండ్లు పూర్తయ్యాయి. 1980 ఏప్రిల్ 6న శ్యామ్‌ప్రసాద్ ముఖర్జి స్థాపించారు.

బీఎస్‌ఎఫ్ మాజీ డీజీ మృతి

ఏప్రిల్ 8న సరిహద్దు భద్రతా దళం మాజీ డైరెక్టర్ జనరల్ రామ్మోహన్ మృతిచెందారు. ఆయన 1965 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1997 నుంచి 2000 వరకు బీఎస్‌ఎఫ్ డీజీగా పనిచేశారు.

కడక్‌నాథ్ కోళ్లకు జీఐ గుర్తింపు

కడక్‌నాథ్ కోళ్లపై గ్లోబల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు మధ్యప్రదేశ్‌కు దక్కింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల మధ్య 2017 నుంచి ఈ విషయమై వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. చెన్నైలోని జీఐ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తమ విద్యా సంస్థగా ఐఐఎస్‌సీ

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) రూపొందించిన ఉత్తమ విద్యాసంస్థలతో కూడిన జాబితాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఇందులో ఐఐఎస్‌సీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఢిల్లీ, ఖరగ్‌పూర్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. న్యాయవిద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం టాప్-5 యూనివర్సిటీల జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కమిటీ

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ, లోపాలను సమీక్షించేదుకు హెచ్‌ఆర్‌డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 4న ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రశ్నపత్రాల లీక్, ట్యాంపరింగ్ లేకుండా సాకేంతికత సాయంతో భద్రతాపరమైన పద్ధతిలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే అంశాలపై ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది.

నేపాల్ ప్రధాని పర్యటన

రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం తదితర అంశాలపై చర్చలు జరపడానికి నేపాల్ ప్రధాని ఖడ్గప్రసాద్ శర్మ ఓలి మూడు రోజులు భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు బీహార్‌లోని రక్సేల్ నుంచి కఠ్మాండు వరకు రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.