Type Here to Get Search Results !

Vinays Info

ప్రాచీన పట్టణ నాగరికత

 రాఖీగర్హ్‌, మొహంజొదారో, కాళీభంగన్, దోలవీరాలను పరిశీలించాక పట్టణ ప్రణాళిక విషయంలో ఆనాటి పట్టణాల్లో ఏకరూపత ఉన్నట్లు తెలుస్తోంది. నగరాల్లో పశ్చిమ వాయవ్య ప్రాంతాలు ఎత్తుగా ఉండి, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు పల్లంగా కనిపిస్తున్నాయి. ఎత్తుగా ఉండే ప్రాంతాన్ని కోట అని పిలిచారు. కోట్‌డిజి వంటి వాటి ద్వారా కోట చుట్టూ ఆగడ్త ఉండటమే కాకుండా, కోట పై భాగంలో బురుజులున్నాయి అని తెలుస్తోంది. 12-14 అడుగుల ఎత్తు వరకు ప్రాకారాలు సురక్షితంగా ఉన్నట్లు అవగతమవుతోంది.

మొహంజొదారోలో స్నానవాటిక, రెండు స్థూపాలు, స్తంభ మండపం, కళాశాల భవనం వంటి నిర్మాణాలను గుర్తించారు. హరప్పాలో దిగువ భాగాన ఒక గ్రామం, ఒక దిబ్బ ఉండి, దిబ్బకు తూర్పు వైపున పోలీస్‌స్టేషన్ వంటి నిర్మాణ విశేషాన్ని కనుగొన్నారు. ప్రధాన వీధులు 4 నుంచి 6 మీటర్ల వరకు వెడల్పుతో ఉండేవి. రోడ్లన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఒకదానికొకటి లంబ కోణంలో ఉన్నాయి. లోథాల్ (గుజరాత్) వంటి పట్టణాల్లో కుమ్మరులు, లోహ కర్మ, శిలాకర్మలు చేసే వారి కార్ఖానాలు ఏర్పడ్డాయి.
పట్టణాలన్నింటిలో రోడ్ల పక్కన మురుగునీటి కాల్వలను నిర్మించారు. ఈ కాల్వల తయారీకి కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఈ మురుగు నీటి కాల్వలను బాగు చేయడానికి అనువుగా నియమిత అంతరాల్లో మనిషి దిగడానికి కావాల్సిన రంధ్రాలను ఏర్పర్చారు. అదేవిధంగా ఎక్కువగా పారిన నీరు ఇంకడానికి చిన్న చిన్న గోతులను తవ్వారు.

ప్రత్యేక నిర్మాణాలు
మొహంజొదారోలో గొప్ప స్నాన వాటిక, స్తంభ మండపం, హరప్పాలో ధాన్యాగారాలు, లోథాల్‌లో ఓడరేవును గుర్తించారు. మొహంజొదారోలోని స్నానవాటిక 30×23×8 అడుగుల కొలతలతో నిర్మితమైంది. దీని గోడలు నీరు ఇంకకుండా ఏర్పడ్డాయి. దీనికి ఒకవైపు మెట్లవరుస, గ్యాలరీలా కూర్చోవడానికి వీలుగా నిర్మాణాలు ఉన్నాయి. దీనికి పైభాగంలో కొన్ని వరండాలు, గదులు కూడా ఉన్నాయి. హరప్పాలోని ధాన్యాగారాలను 50×20 అడుగుల కొలతతో ఆరు నిర్మాణాలను నదీ తీరాన నిర్మించారు. రెండు వరుసల్లో మొత్తం 12 ధాన్యాగారాలు ఉన్నాయి. లోథాల్ ప్రసిద్ధ ఓడరేవు. దీన్ని నదికి జతపరుస్తూ కృత్రిమ కాల్వలను తవ్వారు. ఈ నిర్మాణాలన్నింటికి ఒకే కొలతతో కూడిన కాల్చిన ఇటుకలను వాడారు. ఇటుకలు 11×5.5×2.75 అంగుళాల్లో, 4 : 2 : 1 నిష్పత్తిలో పొడవు, వెడల్పు, మందాన్ని కలిగి ఉండేవి.

నగర వ్యవస్థపై సామాజిక ప్రక్రియల ప్రభావం
నాగరికత కాలాల్లోని కట్టడాల్లో బానిసలను అధిక సంఖ్యలో వినియోగించినట్లు వాల్టేర్ రూబెన్ అభిప్రాయం. ఇళ్ల పరిమాణాల్లోని మార్పులు, వివిధ విలాసాల ఉనికిని బట్టి కొందరు చరిత్రకారులు సమాజంలోని అంతరాలను ఊహించారు. సామాజిక ప్రక్రియలో ప్రయోజనాత్మక గమనశీలత.. పట్టణ నిర్మాణ వ్యవస్థ, ప్రణాళికలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేయగా నగర, గ్రామ సంబంధాలు పట్టణ వ్యవస్థ అస్థిత్వానికి దోహదపడ్డాయి. కానీ వ్యవసాయక వృత్తుల ప్రాముఖ్యత కలిగిన గ్రామీణ నిర్మాణాల గురించి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు.

రెండో పట్టణీకరణ
క్రీ.పూ. 600-300 మధ్యకాలంలో గంగానది లోయలో చోటు చేసుకున్న పట్టణీకరణను భారత ఉపఖండంలో రెండో పట్టణీకరణగా పేర్కొంటారు. రాజ్‌గాట్, చిరంద్ తవ్వకాల్లో లభ్యమైన ఆధారాలను బట్టి ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో, బీహార్ పశ్చిమ ప్రాంతంలో ఇనుము వినియోగం విస్తృతంగా ఉండేదని తెలుస్తోంది. ఈ ఇనుము వాడకం విశాల సామ్రాజ్య స్థాపనకు దారి తీసింది. ఈ సామ్రాజ్యాలన్నీ సైనికపరంగా ఆయుధ సంపత్తితో కూడుకొన్నవి. వీటిలో యుద్ధవీరుల వర్గం ప్రధాన పాత్ర పోషించింది. కొత్త వ్యవసాయ పనిముట్లు రైతులు అధిక ఉత్పత్తి చేయడానికి దోహదం చేశాయి. ఈ ఉత్పత్తులు పాలక వర్గ అవసరాలను తీర్చడమే కాకుండా అసంఖ్యాకమైన ఇతర నగరాలను పోషించాయి. ఈ భౌతిక వస్తు వినియోగశక్తి కోసల, మగధ సామ్రాజ్యాల విస్తరణకు దోహదం చేసింది. వైదికేతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ సామ్రాజ్యాల్లో కలిసిపోయారు. తద్వారా కొత్త సామ్రాజ్యాలు పరిపాలనా సంబంధమైన కొత్త సమస్యలను, సామాజికంగా ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొన్నాయి.
పాళీ, సంస్కృత గ్రంథాల్లో పేర్కొన్న అనేక నగరాలు కౌశాంబి, శ్రావస్తి, అయోధ్య, కపిలవస్తు, వారణాసి, వైశాలి, రాజగిరి, పాటలీపుత్రం మొదలైనవి తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆవాసాలు, మట్టి నిర్మాణాల చిహ్నాలు కన్పించాయి. వాస్తవానికి ఇవి భారతదేశంలో రెండో నగరీకరణ ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. మొత్తం దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటే శ్రావస్తి లాంటి పెద్ద నగరాలు దాదాపు 20 వరకు ఉంటాయి. తర్వాత కాలంలో నగరాలు గణనీయంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం గ్రీకు నుంచి అలెగ్జాండర్ సైన్యం భారతదేశానికి తరలి రావడమేనని గుర్తుంచుకోవాలి. దీనివల్ల అనేక వ్యాపార రవాణా మార్గాలు ఏర్పడ్డాయి. వాయవ్య భారతదేశం, పశ్చిమ ఆసియాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.

నగర ఆర్థిక వ్యవస్థ
నగరాల ఆవిర్భావానికి కారణాలు (రాజకీయ, ఆర్థిక, మతపరమైనవి) విభిన్నంగా ఉన్నప్పటికీ చివరికి ఈ నగరాలన్నీ మంచి వ్యాపార కేంద్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వాటిలో రకరకాల వృత్తి నిపుణులు, వ్యాపారులు స్థిరపడ్డారు. వీరు కొన్ని సంఘాలుగా ఏర్పడ్డారు. జాతక కథల్లో అంటే బుద్ధుడి పుట్టుకకు సంబంధించిన కథల్లో ఇలాంటి సంఘాలను దాదాపు 18 వరకు పేర్కొన్నారు. అందులో నాలుగు పేర్లు (వడ్రంగులు, కుమ్మరులు, తోలుపని చేసేవారు, చిత్రకారులు) మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రతి సంఘం నగరంలో ఒక ప్రత్యేక ప్రాంతంలో నివసించేది. అంటే ఇలాంటి నివాసాలు, పరిశ్రమలు వృత్తుల స్థానికీకరణకు తోడ్పడటమే కాకుండా వారసత్వంగా తండ్రుల నుంచి వారి సంతానానికి సంక్రమించడానికి ఈ కళలు దోహదపడ్డాయి. సాధారణంగా వ్యాపారులంతా నగరాల్లోనే జీవించేవారు. కానీ వ్యాపారులు జీవనోపాధి కోసం రాజు జారీ చేసిన మాన్యాలు (భోగ గ్రామాలు) చేసుకోవడానికి గ్రామాలతో సంబంధం పెట్టుకోక తప్పలేదు. ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు చేస్తున్న సేవలను బట్టి పరమ నిరంకుశులైన రాజులు కూడా వారిని తగిన రీతిలో గౌరవించేవారు. వీటన్నింటినీ గమనిస్తే వృత్తి నిపుణులు, వ్యాపారులు నగరాల్లో ప్రధానమైన సామాజిక వర్గాలుగా అభివృద్ధిలోకి వచ్చారన్న విషయం అవగతమవుతోంది.
వృత్తి నిపుణులు తయారుచేసిన వస్తువులను వ్యాపారులు సుదూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించేవారు. జాతక కథల్లో 500 బండ్లకు సరిపోయే వస్తువులు, వస్త్రాలు, దంతపు వస్తువులు, కుండలు మొదలైనవి తీసుకెళ్లినట్లు ప్రస్తావించారు. ఆ కాలంలో అన్ని ప్రధాన నగరాలు నదీ తీరాలకు ఆనుకునే ఉండేవి. వాటిని కలుపుతూ వ్యాపార మార్గాలు చాలా ఏర్పడ్డాయి. ఉదాహ‌రణ‌కు శ్రావస్తి పట్టణాన్ని కౌశాంబి, వారణాసి, కపిలవస్తు, కుశినార మొదలైన నగరాలతో అనుసంధానం చేశారు. లోహాలతో తయారైన నాణేలు మొట్టమొదట ఈ కాలంలోనే కన్పిస్తాయి. వైదిక గ్రంథాల్లో కనిపించే నిష్క, శతమాన అనే పదాలను నాణేల పేర్లుగానే గుర్తించినప్పటికీ అప్పటికే దొరికిన నాణేలు క్రీ.పూ. 6వ శతాబ్ది నాటి కంటే పాతవి మాత్రం కావు. ఈ కాలంలో మొట్టమొదటి దశలో నాణేలు చాలావరకు వెండితో తయారుచేశారు. కొన్ని రాగి నాణేలు కూడ లభించాయి. లోహ నాణేలపైన కొన్ని గుర్తులు అంటే.. కొండలు, చెట్లు, చేప, వృషభం మొదలైన చిహ్నాలతో రంధ్రాలు చేయడం వల్ల వీటిని రంధ్రపు గుర్తులున్న నాణేలనేవారు. పాళీ గ్రంథాలు ధనాన్ని విస్తారంగా ఉపయోగించేవారని, జీతభత్యాలు ధనరూపంలోనే చెల్లించేవారనీ పేర్కొన్నాయి.
అశోకుడికి ముందు రెండు శతాబ్దాల కిందటే ప్రారంభమైన లిపి కూడా వ్యాపారాభివృద్ధికి చాలా దోహదం చేసింది. ఈ కాలంలో గ్రంథాలన్నీ కొలతలకు సంబంధించిన సునిశిత పరిజ్ఞానాన్ని వివరించాయి. బహుశా ఇవి ఇళ్లు, భూముల సరిహద్దుల గుర్తింపులకు, నిర్మాణాలకు ఉపయోగపడి ఉంటాయి. ఆ విధంగా లేఖనం అనేది చట్టాలు, మతాచారాల సంకలనానికి మాత్రమే కాకుండా వ్యాపార వివరాలు, పన్నుల చెల్లింపు, విస్తృతమైన సైనిక ఉద్యోగుల వివరాలు రాసి పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ ఈ కాలంలో లిపి ఉండేదనే విషయానికి సంబంధించి ఎలాంటి పురావస్తు ఆధారాలు లేవు. అయితే ఈ ప్రాచీన రికార్డులను శిలలు, లోహపు ఫలకాలపై రాయకపోవడం వల్ల అవి నాశనమై ఉండొచ్చని అందుకే అవి అలభ్యాలని చెప్పొచ్చు.

మౌర్యుల తర్వాత పట్టణీకరణ
వ్యాపారం అభివృద్ధి చెందడం, ద్రవ్య ఆర్థిక విధానం విస్తరించడం పట్టణీకరణకు కారణభూతమయ్యాయి. చైనా యాత్రికులు తమ రచనల్లో పాటలీపుత్రం, వైశాలి, వారణాసి, కౌశాంబి, హస్తినాపురం, మధుర, ఇంద్రప్రస్థం మొదలైన నగరాలను పేర్కొన్నారు. కుషాణుల కాలంలో చిరండ్, సోన్‌పూర్, బక్సార్ (బీహార్), తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఖేరత్, మాసన్, ఉత్తరప్రదేశ్‌లో సోహ్‌గౌరా, భీటా, కౌశాంబి, శృంగవేర్‌పూర్, ఆంత్రజిఖేరా, మీరట్, మజఫర్‌పూర్ ప్రాంతాలు సంపదలతో తులతూగేవి. అదేవిధంగా పంజాబ్‌లోని జలంధర్, లూథియానా, రూపార్‌ల్లో కూడా కుషాణుల కాలం నాటి నిర్మాణాలు బయటపడ్డాయి. మొత్తం మీద కుషాణుల కాలంలో నగరీకరణ అత్యున్నత స్థాయికి చేరుకుంది. పశ్చిమ భారతదేశంలో మాళ్వా ప్రాంతాన్ని పరిపాలించిన శకుల నగరాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వారి ప్రధాన నగరం ఉజ్జయిని. కౌశాంబి నుంచి మధుర, మధుర నుంచి పశ్చిమ తీర ప్రాంతానికి వచ్చే రెండు ప్రధాన రహదారులు ఉజ్జయినిలో కలవడం వల్ల ఆ నగరానికి అధిక ప్రాధాన్యత లభించింది. దీనికితోడు ఉజ్జయిని అతి విలువ కలిగిన ఆగేట్, కార్నిలియన్ రాళ్ల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 200 నుంచి ఇక్కడ కార్నిలియన్, జాస్పర్ రాళ్లతో పూసల్ని తయారు చేసేవారని తవ్వకాలు నిరూపిస్తున్నాయి. క్షిప్రా నదీ గర్భంలో పుష్కలంగా ముడిసరుకు లభించడం వల్ల ఈ పరిశ్రమ గొప్పగా వర్థిల్లింది.
శకులు, కుషాణుల యుగంలా శాతవాహనుల కాలంలో టగర్, పైఠాన్, ధాన్యకటకం, అమరావతి, నాగార్జునకొండ, బరూచ్, సొపారా, అరికమేడు, కావేరిపట్నం ప్రసిద్ధి చెందాయి. తెలంగాణలో ఫణిగిరి, మునుల గుట్ట, పోతన్ ప్రసిద్ధి చెందిన బౌద్ధ పట్టణాలని ‘ప్లిని’ అనే చరిత్రకారుడు తన రచనల్లో పేర్కొన్నారు.

గుప్తుల యుగం నాటి పట్టణీకరణ క్షీణత - ప్రభావం
6వ శతాబ్దం నుంచి వ్యాపారం తీవ్రంగా తగ్గు ముఖం పట్టింది. రోమన్ సామ్రాజ్యంతో, పశ్చిమ దేశాలతో వ్యాపారం ఆగిపోయింది. 6వ శతాబ్దంలో ఇరాన్, బైజాంటియన్‌లతో పట్టువస్త్రాల వ్యాపారం ఆగిపోయింది, భారతదేశం.. చైనా, ఆగ్నేయ ఆసియాతో వ్యాపారం కొనసాగించడంలో దళారీలైన అరబ్బుల పాత్ర ప్రధానం. లాభాలు కూడా పూర్తిగా వారే పొందారు. వ్యాపారం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో బంగారం నాణేలు పూర్తిగా తగ్గిపోయాయి. క్రమంగా పట్టణాలు శిథిలం కావడంతో మధుర, శ్రావస్తి, చరంద్, వైశాలి, పాటలీపుత్రం మొదలైన నగరాలు కాలగర్భంలో కలిసినట్లు తవ్వకాలు నిరూపిస్తున్నాయి. భారతీయ ఎగుమతులకు అవకాశాలు తగ్గడం వల్ల చేతివృత్తులవారు, వ్యాపారులు గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లి వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించారు. 5వ శతాబ్దం చివరలో పట్టు నేసేవాళ్లు పశ్చిమ తీరం నుంచి మాళ్వా ప్రాంతంలోని మాంద్‌సోర్‌కు వలస వెళ్లారు. పట్టణాలు శిథిలం కావడం వల్ల, వ్యాపారం తగ్గుముఖం పట్టి గ్రామాలు తమకు కావలసిన నూనె, ఉప్పు, సుగంధద్రవ్యాలు, బట్టలు మొదలైన వస్తువుల్ని సమకూర్చు కోవాల్సివచ్చింది. అందువల్ల ఉత్పత్తి కేంద్రాలు చిన్నవిగా మారి, తమ అవసరాలకు మాత్రమే పరిమితంగా ఉండిపోయాయి. తర్వాత సామాజిక నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఉత్తర భారతదేశంలో వైశ్యులను స్వతంత్ర రైతులుగా పరిగణించేవారు. భూదానాలు రాజుకు, రైతుకు మధ్య భూస్వాములను సృష్టించాయి. అందువల్ల వైశ్యులు శూద్రులతో సమానమైపోయారు. ఈ మార్పు ఉత్తర భారతదేశం నుంచి బెంగాల్‌కు, దక్షిణ భారతదేశానికి విస్తరించింది.

వర్ణ వ్యస్థలో మార్పులు
ధర్మశాస్త్రాల ప్రకారం వ్యక్తుల సామాజిక స్థాయి వర్ణంపై ఆధారపడి ఉండేది. ఒక వ్యక్తికి ఉన్న ఆర్థిక హక్కులు కూడా అతని వర్ణంపై ఆధారపడి ఉండేవి. పరిస్థితులు మారిన తర్వాత కొత్త భూస్వామ్య వర్గానికి ఇవ్వాల్సిన స్థానాన్ని గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో మార్పులు చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section