Type Here to Get Search Results !

Vinays Info

బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ 

"బుర్రకథా పితామహుడు"గా పేరొందిన షేక్ నాజర్ గారి జయంతి సందర్భంగా..*✍సురేష్ కట్టా (సోషల్ టీచర్)

*నింగితాకే రాగతరంగం*
*కదనుతొక్కే కవన తురంగం*
*నాజరుగళం రగడవిరుపులు*
*బుర్రకథా కళల వీరంగం*

*🔻నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు*

*🔻"బుర్రకథా పితామహుడు" గా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత మరియు గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.*

*🍥జీవిత విశేషాలు*

🔻గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకులముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5 వ తేదీన షేక్‌ మస్తాన్‌, బీబాబీలకు దంపతులకు జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". ఆయన 'కృష్ణలీల'లో 'దేవకి', 'శ్రీ కృష్ణ తులాభారం'లో 'రుక్మిణి', 'భక్త రామదాసు'లో 'ఛాందిని' వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. పాఠశాల స్థాయిలో "ద్రోణ" పాత్రకు జీవం పోసారని ప్రముఖ హార్మోనిస్టు ఖాదర్ ప్రశంసించారు. ఖాదర్ ఆయనను "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించారు. పేదరికం వల్ల అచట ఉండలేకపోయారు.

🔻ఆ తరువాత ఆయన 'బాల మహ్మదీయ సభ' పేరిట మళ్ళీ నాటకా లాడి మంచిపేరు గడించారు. దర్జీగా మారారు. ఆర్యమత సిద్ధాంతం నచ్చి మాంసాహారం మానేశారు. 'పాదుకా పట్టాభిషేకం'లో 'కైకేయి', 'ఖిల్జీ రాజ్యపతనం'లో 'కమలారాణి' పాత్రలు పోషించారు. నాస్తికుడయ్యారు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యారు. 'కొండపనేని బలరామ్‌, వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. 'వేపూరి రామకోటి' కథకుడు, నాజర్‌ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.

*🍥బుర్రకథా పితామహుడు*

🔻ప్రాచీన జానపద కళారూప మై న బుర్రకథకు  కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు. " ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.

🔻తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది.కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు. వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. 'అసామి ' అనే నాటకం రాసి ప్రదర్శనలి చ్చాడు. కొంతకాలం  విరసం  సభ్యుడు.

*🔻బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన 'పింజారీ 'అనే పుస్తకంగా ప్రచురించాడు.*

*🍥కళా ప్రతిభ*

🔻ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌.పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే - సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి .పుట్టిల్లు, అగ్గిరాముడు,చిత్రాలలోబుర్రకథలుచెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. పూలరంగడు సినిమాలో  అక్కినేని కి నేర్పింఛారు ఈ సినిమాలో అక్కినేనిలో నాజర్ కనిపిస్తారు. (ఇది ఆ ఇద్దరి ప్రతిభకూ రుజువు). చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీ ర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎస్‌. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు.

*🔻'ఆసామీ' నాటకాన్ని రచించారు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో 'ఆసామీ' నాటకం ప్రథమ బహుమతి పొందింది. నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు.*

*🔻వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం. రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్ నాజరును ' ఆంధ్ర అమరషేక్ ' అని అభివర్ణించడం.*

*🔻కామ్రేడ్  పుచ్చలపల్లి సుందరయ్య  నాజరు  ప్రజాభాషకు ముగ్ధుడై ' నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో ' అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.*

*🔻గుంటూరుకు ఎన్‌టిఆర్ వచ్చినప్పుడు నేను మీ అభిమానిని అని నాజర్ చెపితే ‘నేను మీ ఫాన్‌ను’ అని ఎన్‌టిఆర్ చెప్పి అందరినీ ఆనందపరిచారు.*

*🍥సత్కారాలు*

*🔻ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది.1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది.*

🔻అనారోగ్యంతో ఉన్నా ''జాతి జీవితం- కళా పరిణామం'' అనే జానపదుల, జానపదకళల జీవితాలకు సంబంధించిన గొప్ప గ్రంథం అచ్చువేస్తూ ఒకరోజు తప్పొప్పులు చూస్తూ బాగా నీరసంరాగా వారి పిల్లలు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. తలలో రక్తం గూడుకట్టిందని డాక్టర్లు చెప్పారు. ఫిట్స్‌లా వచ్చి 1997 ఫిబ్రవరి 21వ తేదీ తెల్లవారకముందే ఆయన పరమపదించారు.

(ఫిబ్రవరి 5, 1920 - ఫిబ్రవరి 22, 1997)
సే:సురేష్ కట్టా(సోషల్ టీచర్)
    

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section