
ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ అవినీతి సూచీ- 2017 పేరుతో నివేదికను విడుదల చేసింది. గతేడాది జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుని 180 దేశాలకు ర్యాంకులను కేటాయించింది. అవినీతి, పత్రికా స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని ప్రతి దేశానికీ 0 నుంచి 100 మధ్య మార్కులు కేటాయించింది. 0 మార్కులు వస్తే అత్యంత అవినీతి గల దేశమని, 100 మార్కులు వస్తే పూర్తి నిజాయితీ గల దేశమని పేర్కొన్నది.
ఈ ఏడాది 89 మార్కులతో అత్యంత తక్కువ అవినీతి గల దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్ (88), ఫిన్లాండ్ (85), నార్వే (85), స్విట్జర్లాండ్ (85) ఉన్నాయి. 9 మార్కులతో అత్యంత అవినీతి గల దేశంగా సోమాలియా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ సూడాన్ (12), సిరియా (14), ఆప్ఘనిస్థాన్ (15), యెమెన్ (16) ఉన్నాయి. 40 మార్కులతో భారతదేశం 81వ స్థానంలో ఉన్నది. 2016లో భారత్ ర్యాంకు 79. బ్రిక్స్ దేశాల్లో దక్షిణాఫ్రికా 71, చైనా 77, బ్రెజిల్ 96, రష్యా 135వ స్థానంలో ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలైన భూటాన్ 26, శ్రీలంక 91, పాకిస్తాన్ 117, బంగ్లాదేవ్ 143వ స్థానాల్లో ఉన్నాయి.
Social Plugin