Type Here to Get Search Results !

Vinays Info

సంజ్ఞానాత్మక సిద్ధాంతం

Top Post Ad

సంజ్ఞానాత్మక సిద్ధాంతం

(Cognitive Development Theory)
తల్లి గర్భంలో జైగోట్ ఏర్పడిన నాటినుంచి శిశువు జన్మించి, మరణించేంత వరకు వికాసం వివిధ అంశాల కలయికతో అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం భౌతిక, మానసిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక, నైతిక అంశాల ద్వారా నిరంతరం పురోగమనంలోనే ఉంటుంది. సంజ్ఞానాత్మక వికాసం ఒక శిశువులో ఎలాంటి మార్పులను తెస్తుంది? దానికి అనుగుణంగా శిశువు వికాసంలో చోటుచేసుకునే పరిణామాలపై స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత మనో విజ్ఞాన శాస్త్రవేత్త జీన్ పియాజె ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది అందరి ఆమోదం పొందింది.
సంజ్ఞానాత్మక సిద్ధాంతం (Cognitive Development Theory)
శిశువు అభివృద్ధి చెందే క్రమంలో మొదట తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తనలోని స్మృతి, ఆలోచన, వివేచన, అభ్యసనాలను కలిపి జ్ఞానాన్ని కల్పించుకునే మానసిక చర్యనే 'సంజ్ఞానాత్మక వికాసం' అంటారు. అంటే వ్యక్తి ప్రజ్ఞలో వివిధ అంశాల ద్వారా అభివృద్ధి సాధించడమని అర్థం. ఈ సంజ్ఞానాత్మక అభివృద్ధిలో వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి 'స్కిమాటా' (Schemata) తోడ్పడతాయని పియాజె వివరించారు.
ఉదా: వెల్లకిలా పడుకుని ఉన్న శిశువుకు ఎదుటి వ్యక్తి చేతివేలును అందిస్తే దాన్ని ఆధారంగా భావించి పట్టుకోవడం.
¤ ఎదుటివారిని కాలితో, చేతితో కొట్టడం.
శిశువు పుట్టిన తర్వాత వయసుతోపాటు స్కిమాటాలో మార్పులు వస్తాయి. అతడిలోని సహజ లేదా పుట్టుకతో వచ్చిన రెండు అంశాలు దీనికి ప్రధాన కారణం.
1. వ్యవస్థీకరణ: భౌతికంగా కనిపించే మనో వైజ్ఞానిక నిర్మాణాలను మరింత అభివృద్ధి చెందిన సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరచే సంసిద్ధత.
ఉదా: శిశువు చిన్నతనంలో ప్రదర్శించే లక్షణాలైన చూడటం, పట్టుకోవడం లాంటి సాధారణ ప్రతిస్పందనలు మెల్లమెల్లగా అభివృద్ధి చెందడం.
2. అనుకూలత: దీన్ని సాంశీకరణం, అనుగుణ్యం అనే రెండు అంతర్గత ప్రక్రియలుగా పరిశీలించవచ్చు.
ఎ) సాంశీకరణం లేదా సంశ్లేషణం: శిశువుకు ఏదైనా కొత్త పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని తనదైన రీతిలో అవగాహన చేసుకోవడం.
ఉదా: సాధారణంగా చిన్న వస్తువులను నోటికి అందించుకునే శిశువు పెద్ద వస్తువులను కూడా నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం.
బి) అనుగుణ్యం: పరిసరాల్లో కలిగే నూతన సమస్యలను సర్దుబాటు చేసుకోవడమే అనుగుణ్యత.
ఉదా: గతంలో గాడిదను చూసిన యశ్వంత్ అనే బాలుడు ప్రస్తుతం కుక్కను చూస్తే, గాడిద, కుక్క రెండూ వేర్వేరు జంతువులని గుర్తించలేడు.
జీన్ పియాజె సంజ్ఞానాత్మక వికాసం శిశువులో నాలుగు దశల్లో జరుగుతుందని వివరించాడు.
అవి: 1. ఇంద్రియ చాలక దశ, 2. పూర్వ ప్రచాలక దశ, 3. మూర్త ప్రచాలక దశ, 4. అమూర్త ప్రచాలక దశ.
ఇంద్రియ చాలక దశ (0-2 ఏళ్లు)
శిశువు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండే దశ ఇది. శిశువు అనుకరణను అధికంగా ప్రదర్శించే ఈ దశలో తనకు జన్మతః ఉన్న ప్రతిక్రియలను బాగా మెరుగుపరచుకుంటాడు.
¤ మొదట 4 నెలల కాలంలో తనకు ఆనందాన్ని కలిగించే లేదా తృప్తినిచ్చే పనిని మళ్లీ మళ్లీ చేస్తాడు.
¤ 4 నుంచి 8 నెలల మధ్య తన దృష్టిని తన శరీరం నుంచి వస్తువులపైకి మారుస్తాడు.
¤ 8 నుంచి 12 నెలల మధ్య వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది.
¤ 12 నుంచి 18 నెలల మధ్య శిశువు వివిధ వస్తువుల మధ్య ఉన్న లక్షణాలను తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు.
¤ 18 నుంచి 24 నెలల మధ్య వస్తు లక్షణాల అన్వేషణలో భాగంగా అంతర దృష్టిని ఉపయోగిస్తాడు.
పూర్వ ప్రచాలక దశ (2-7 ఏళ్లు)
ఇది రెండు నుంచి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశను పియాజె శిశువులో జరిగే వికాసాన్ని అనుసరించి రెండు అంతర దశలుగా విభజించాడు.
1. పూర్వ భావనాత్మక దశ: 2 నుంచి 4 సంవత్సరాల వరకు జరిగే ఈ దశలో శిశువు భాషా వికాసం చాలా వేగంగా ఉంటుంది. దీనిలో శిశువుకు సమస్యా పరిష్కార సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది.
ఈ దశలో శిశువులో కనిపించే పరిమితులు:
¤ ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించే సర్వాత్మవాదం.
¤ ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించి ఆటలాడే ప్రతిభా సాత్మిక ఆలోచన.
¤ అహం కేంద్రవాదాన్ని కలిగి ఉంటారు.
2. అంతర్ బౌద్ధిక దశ: ఈ దశ 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. శిశువుకు సమస్య పరిష్కరించగల సామర్థ్యం ఉన్నప్పటికీ దాన్ని వివరించే వికాసం ఇంకా పెంపొందదు.
ఈ దశలోని పరిమితులు:
¤ ఒక వస్తువు ఆకారాన్ని బాహ్య పరిస్థితిని మార్చినా దాని గుణం, లక్ష్యం మారదు అని గ్రహించలేని 'పదిలపరచుకునే భావనా లోపం'.
¤ ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చనే భావన ఉండకపోవడం - ఇదే అవిపర్యయాత్మక భావనా లోపం.

మూర్త ప్రచాలక దశ (7 - 11 ఏళ్లు)

7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉన్న ఈ దశలోని బాలుడు పూర్వ ప్రచాలక దశలోని పరిమితులను అధిగమిస్తాడు. వాస్తవికతను కలిగి, నిగమనాత్మక ఆలోచనను పెంపొందించుకుంటాడు. బాలుడు తర్కంతో కూడిన ఆలోచనలు కలిగి ఉంటాడు కానీ ఆ ఆలోచనలన్నీ కేవలం మూర్త విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి.
ఈ దశ అంతానికి సంఖ్యా, బరువు, కాలానికి సంబంధించిన భావనలు ఏర్పడతాయి.
అమూర్త ప్రచాలక దశ (12 ఏళ్లు ఆ పైన)
12 సంవత్సరాల తర్వాత ఈ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశలోని కౌమారులు వివిధ ఆధారాల నుంచి సమాచారాన్ని కలిపి, ఫలితాలను సూచించగలరు.
¤ అవాస్తవికమైన కాల్పనిక సమస్యల గురించి ఆలోచించి పరిష్కారం చెప్పగలరు. సారళ్యత, మానసిక ప్రాకల్పనలను పరీక్షించడం, సమస్య పరిష్కరణలో వివిధ కోణాలుగా ఆలోచించి, ప్రకల్పనా నిగమనాత్మక ఆలోచనను ప్రదర్శిస్తారు.
Bit Bank
1. బన్నీ, బుజ్జి అనే పిల్లలు తమ ఇంట్లోని సైకిల్‌ను స్కూటర్‌గా భావించి వేగంగా నడుపుతున్నట్లు ఆటాడుతుంటే పియాజె ప్రకారం వారు ఏ దశలో ఉన్నారు?
జ: పూర్వ ప్రచాలక దశ
2. శిశువు ఇంద్రియాలకు, చలన ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపే దశ ఏది?
జ: ఇంద్రియ చాలక దశ
3. హాసిని అనే బాలిక ప్రతి రోజూ తన వద్ద ఉన్న బొమ్మలకు జోలపాడటం, నిద్ర పుచ్చడం లాంటి పనులు చేయడం ఏ దశ లక్షణమని పియాజె పేర్కొన్నారు?
జ: ప్రాక్ ప్రచాలక దశ
4. కిందివాటిలో ఏ అంశం పియాజె తెలిపిన 'అనుకూలత' ప్రక్రియకు చెందనిది?
1) సాంశీకరణం 2) అనుగుణ్యం 3) సంవేదనా క్రియ 4) ఏదీకాదు
జ: సంవేదనా క్రియ
5. పిల్లలు మొదటిసారిగా ఎవరి ప్రవర్తనా రీతులను అనుకరిస్తారు?
జ: తల్లిదండ్రులు
6. ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే ప్రస్తుతం సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని గ్రహించిన శిశువు కిందివాటిలో ఏ భావనను అర్థం చేసుకోలేదు?
1) పదిలపరచుకునే భావనాలోపం 2) సర్వాత్మవాదం 3) అవిపర్యయాత్మక భావనాలోపం 4) ఏకమితి
జ: పదిలపరచుకునే భావనాలోపం
7. కిందివాటిలో 'పరిపక్వత'కు సంబంధించి సరికానిది?
1) పరిపక్వతకు నైతిక స్వభావం ఉంది.
2) పరిపక్వత పరిసర సంబంధిత ఆర్జన కలిగింది.
3) సాధారణంగా జరిగే పరిపక్వతకు కొంత అభ్యసనను, శిక్షణను అందిస్తే కొంత వేగంగా సంభవించగలదు.
4) పరిపక్వత అందరిలో ఒకేరకంగా జరగదు.
జ: పరిపక్వత పరిసర సంబంధిత ఆర్జన కలిగింది.
8. కిందివాటిలో నైతిక వికాసాన్ని ప్రభావితం చేసే వికాసం?
1) భాషా వికాసం 2) సామాజిక వికాసం 3) ఉద్వేగ వికాసం 4) సంజ్ఞానాత్మక వికాసం
జ: సంజ్ఞానాత్మక వికాసం
9. తల్లి శిశువుకు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడుతూ గోరుముద్దలు తినిపించేటప్పుడు ఆ శిశువు చంద్రుడికి ప్రాణం ఉందని భావించడం పియాజె పేర్కొన్న ఏ దశకు చెందుతుంది?
జ: పూర్వ భావనాత్మక
10. భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని 'మోహిత్' ఏ దశలో ఉన్న విద్యార్థి?
జ: పూర్వ ప్రచాలక దశ
11. కింది అంశాల్లో ఇంద్రియ చాలక దశ లక్షణం కానిది?
1) శిశువు మొదటి నాలుగు నెలల కాలంలో తనకు తృప్తినిచ్చే సరళ చలనాత్మక కృత్యాలపై ఎక్కువ ఆసక్తి చూపుతాడు.
2) శిశువు 4 నుంచి 8 నెలల మధ్య కాలంలో అంతర్ దృష్టి ఆధారంగా వస్తువులను పడేసి, శబ్దాల మధ్య తేడాను గుర్తిస్తాడు.
3) 8-12 నెలల మధ్య శిశువు దృష్టి ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా మాత్రమే సాగుతుంది.
4) 12 నుంచి 18 నెలల మధ్య కాలంలో శిశువు వస్తు లక్షణాలను తెలుసుకోవడానికి యత్న దోష పద్ధతులను ఉపయోగిస్తాడు.
జ: శిశువు 4 నుంచి 8 నెలల మధ్య కాలంలో అంతర్ దృష్టి ఆధారంగా వస్తువులను పడేసి, శబ్దాల మధ్య తేడాను గుర్తిస్తాడు.
12. కిందివాటిలో సరికాని వాక్యమేది?
1) శిశువు ప్రాణంలేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించి తద్వారా ఆటలాడి ఆనందపడే భావనే సర్వాత్మవాదం.
2) పూర్వ భావనాత్మక దశలోని శిశువు ఒక వస్తువు నిజమైనది కానప్పటికీ నిజమైన వస్తువులాగా భావించడమనే భావనే ప్రతిభా సాత్మిక ఆలోచన.
3) ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది. దీన్నే కన్సర్వేషన్ అంటారు.
4) ప్రతి తార్కిక ప్రచాలనాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడమే అవిపర్యయాత్మక భావనా లోపం.
జ: ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది. దీన్నే కన్సర్వేషన్ అంటారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.