కణజాల వర్ధనం(Tissue Culture)
మొక్కల కణజాల వర్ధన ప్రక్రియలోని దశలు
పోషక యానకాన్ని తయారు చేయడం: కణజాల వర్ధనంలో పోషక యానకంపై మొక్క కణజాలం పెరిగేందుకు కావలసిన సూక్ష్మ, స్థూల మూలకాలు, విటమిన్‌లు, నీరు,హార్మోన్‌లు, కార్బోహైడ్రేట్స్ లాంటివి ఉంటాయి. నీటికి ఈ పదార్థాలను కలిపి పోషక యానకాన్ని తయారుచేస్తారు. యానకంలో కణజాలం మునిగిపోకుండా ఉండేందుకు పోషక యానకానికి అగార్-అగార్‌ను కలిపి ఘనస్థితికి తీసుకువస్తారు. వృద్ధి నియంత్రకాలు లేకుండా తయారు చేసిన యానకాన్ని ‘మౌలిక యానకం’ అంటారు. మౌలిక యానకంలో కణజాలం కాలస్ వరకు మాత్రమే పెరుగుతుంది. కాలస్ నుంచి పూర్తి మొక్క విభేదనం చెందాలంటే యానకానికి వృద్ధి నియంత్రకాలను కలుపవలసి ఉంటుంది. దీని కోసం ఆక్సిన్‌లు IAA-ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం, NAA- నాప్తలిన్ ఎసిటిక్ ఆమ్లం, 2,4-D- 2, 4 డైక్లోరో ఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం కొన్ని రకాల సైటోకైనిన్‌లు కలుపుతారు.
వర్ధన యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం: పదార్థాల ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులను పూర్తిగా నిర్మూలించడాన్ని ‘సూక్ష్మజీవ రహితం’ అంటారు. యానకంలో అనేక పోషక పదార్థాలు ఉండటం వల్ల సూక్ష్మజీవులు త్వరగా పెరిగి యానకాన్ని పాడుచేస్తాయి. యానకాన్ని సాధారణంగా ఆటోక్లేవ్ పద్ధతి ద్వారా సూక్ష్మజీవ రహితం చేస్తారు. ఆటోక్లేవ్‌లో 15 పౌండ్ల పీడనం, 1210C వద్ద 15 నిమిషాలపాటు ఉంచితే యానకం సూక్ష్మజీవ రహితం అవుతుంది. ఆటోక్లేవ్ చేసిన మరుసటి రోజు వర్ధన పాత్రలను తనిఖీ చేసి సూక్ష్మజీవ రహితంగా ఉండే వర్ధన పాత్రల్లోకి విత్తనాలు లేదా ఎక్స్‌ప్లాంట్‌లను అంతర్నివేశనం చేస్తారు.
ఎక్స్ ప్లాంట్‌ను తయారు చేయడం: పరస్థానిక పద్ధతిలో పూర్తి మొక్క లేదా అంగాలు వృద్ధి చెందడానికి వర్ధన యానకంలో ప్రవేశపెట్టే ఒక మొక్కలోని ఏదైనా భాగాన్ని ఎక్స్ ప్లాంట్ అంటారు. మొక్కల్లోని సజీవ భాగాలైన గ్రీవపు మొగ్గ, పత్రం, కాండ ఛేదాలు, వేరు అగ్రం, కాండాగ్రం, పరాగకోశం, అండాశయం, అంకురచ్ఛదం మొదలైన వాటిలో దేనినైనా ఎక్స్‌ప్లాంట్‌గా ఉపయోగించవచ్చు. ఆరోగ్యవంతమైన మొక్క భాగాలను ఎక్స్ ప్లాంట్‌గా ఎంపిక చేస్తారు.
తోటలో లేదా కుండీలో నుంచి తీసుకున్న ఎక్స్‌ప్లాంట్ అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించడానికి నీరు లేదా డిటర్జెంట్‌ను ఉపయోగించాలి. సూక్ష్మజీవ రహిత ఎక్స్‌ప్లాంట్‌ను మొలకలు (నారు మొక్క) నుంచి కూడా గ్రహించవచ్చు. దీని కోసం విత్తనాల ఉపరితలాన్ని 0.1 శాతం మెర్క్యూరిక్ క్లోరైడ్‌తోనూ, స్వేదన జలంతోనూ శుభ్రపరచాలి.
ఎక్స్‌ప్లాంట్‌ను అంతర్నివేశనం చేయడం: ఎక్స్‌ప్లాంట్‌ను వర్ధన పాత్రలోని సూక్ష్మజీవ రహిత పోషక యానకం మీద ప్రవేశపెట్టడాన్ని అంతర్నివేశనం అంటారు. అంతర్నివేశనం సాధారణంగా లామినార్ ఎయిర్‌ఫ్లో గదిలో చేస్తారు. దీనిలో సంపూర్ణ అసంక్రమిక పరిస్థితులు కల్పిస్తారు.
పెరుగుదల కోసం ఇంక్యుబేషన్: ఎక్స్‌ప్లాంట్ ఉన్న వర్ధన పాత్రలను కాంతి, ఉష్ణోగ్రత, తేమ నియంత్రించిన గదుల్లోకి మార్చాలి. ఈ పద్ధతిని ఇంక్యుబేషన్ అంటారు. ఇక్కడ ఎక్స్‌ప్లాంట్ యానకంలోని పదార్థాలను తీసుకుని పెరుగుతుంది. ఎక్స్‌ప్లాంట్‌ను వివిధ గాఢతలతో ఉండే ఆక్సిన్‌లు, సైటోకైనిన్‌లు యానకానికి కలిపి పెంచినప్పుడు వేర్లు, కాండం ఏర్పడతాయి. దీన్నే అవయవోత్పత్తి అంటారు. అధిక పరిమాణంలో ఆక్సిన్‌ను తక్కువ పరిమాణంలో సైటోకైనిన్‌ను ఉపయోగించి కాలస్ నుంచి వేళ్ల ఉత్పత్తిని ప్రేరేపించవచ్చు. దీన్ని రైజోజెనిసిస్ అంటారు. తక్కువ పరిమాణంలో ఆక్సిన్‌లను అధిక పరిమాణంలో సైటోకైనిన్‌ను యానకానికి కలిపితే కాలస్ నుంచి ప్రకాండ ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది. దీన్ని కాలోజెనెసిస్ అంటారు. పై విధంగా కాకుండా కాలస్ నుంచి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని శాఖీయ పిండోత్పత్తిగా వ్యవహరిస్తారు.
వాతావరణానికి అనుకూలత చెందించి పిల్ల మొక్కలను కుండీలోకి మార్చడం: అవయవోత్పత్తి, పిండోత్పత్తి ద్వారా వృద్ధిచెందిన మొక్కలను వాతావరణ అనుకూలత చెందించి కుండీలోకి మార్చాలి. మొక్కలపై ఉన్న యానకాన్ని నీటితో శుభ్రపరిచి వాటిని సాయిల్‌రైట్, కొబ్బరి టెంకలు, ఇతర కర్బన పదార్థాలతో తయారు చేసిన ప్లాస్టిక్ కుండీలోకి మార్చాలి. ఈ కుండీలపై పాలిథీన్ సంచి కప్పి, గది ఉష్ణోగ్రత వద్ద ఒకటి లేదా రెండు వారాల పాటు ఉంచాలి. పాలిథీన్ సంచి తేమను నియంత్రించి వాతావరణ అనుకూలతను కలుగజేస్తుంది. పాలిథీన్ సంచిని నెమ్మదిగా తీసివేసి వాతావరణ అనుకూలత చెందిన ఆరోగ్యంగా, బలంగా కనిపించిన మొక్కలను సాధారణ మృత్తిక ఎరువులు ఉన్న మిశ్రమంలోకి ప్రవేశపెట్టాలి.
కణజాల వర్ధనం- ప్రయోజనాలు