హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య-1948 | (Operation Polo 1948)
- విభజించు-పాలించు విధానంలో భాగంగా స్వదేశీ సంస్థానాలు హిందుస్థాన్‌లో అయినా, పాకిస్థాన్‌లో అయినా విలీనం కావచ్చునని లేదా స్వతంత్రంగానైనా ఉండవచ్చునని బ్రిటిష్ పాలకులు భారతదేశానికి, పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1947, జూన్ 3న ఒక ఫర్మానాను జారీచేశాడు. దీని ద్వారా 1947, ఆగస్టు 15న స్వతంత్ర, సార్వభౌమాధికారాన్ని హైదరాబాద్ రాజ్యం తిరిగి పొందనున్నట్లు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ఉద్దేశాన్ని ప్రకటించాడు.
- తరువాత భారత ప్రభుత్వ ఒత్తిడి, హైదరాబాద్ రాజ్య ప్రజల ఆందోళనతో నిజాం ప్రభుత్వం 1947, నవంబర్ 29న భారత ప్రభుత్వంతో ‘యథాతథస్థితి ఒప్పందం’ చేసుకొన్నాడు. హైదరాబాద్ రాజ్య విదేశీ వ్యవహారాలను 1948, నవంబర్ 29న భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది.
- యథాతథ ఒడంబడికకు ముందు పరిస్థితులు
- హైదరాబాద్ ప్రభుత్వం తరఫున రాజ్యాంగ సలహాదారు సర్ వాల్టర్ మాంక్టన్, నవాబ్ అలీ యావర్ జంగ్, చత్తారి నవాబ్‌లను భారత ప్రభుత్వంతో చర్చలకు నిజాం నియమించాడు. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ ఆధ్వర్యంలో ‘హైదరాబాదీయులకు స్వేచ్ఛాయుత హైదరాబాద్, భారత యూనియన్‌తో ఒప్పందం వద్దు’, ‘ఆజాద్ హైదరాబాద్’ వంటి నినాదాలతో ఊరేగింపులు తీశారు. కరపత్రాలు పంచారు.
- మరోవైపు స్టేట్ కాంగ్రెస్ 1947, జూన్ 3న నిజాం జారీచేసిన ఫర్మానాను వ్యతిరేకిస్తూ ‘హైదరాబాద్ భవిష్యత్తు హైదరాబాద్ ప్రజలే నిర్ణయించాలి, నిజాం కాదు, భారతదేశం నుంచి హైదరాబాద్‌ను వేరుచేసే రాచరిక పాలనను రుద్దే ప్రయత్నాలను తిప్పికొట్టండి’ అంటూ నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు.
- బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయాలని స్టేట్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఉద్యమాల నడుమ ప్రజల నిరసన మధ్య, హైదరాబాద్ ప్రభుత్వ ప్రతినిధులు భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగించారు.
- అక్టోబర్ 11-22 మధ్య ఢిల్లీలో చర్చలు ఒక కొలిక్కి వచ్చి ‘యథాతథ ఒడంబడిక’ డ్రాఫ్ట్‌తో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. నిజాం ప్రభుత్వ ‘ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’ యథాతథ ఒడంబడికను ఆమోదించింది. మౌఖికంగా నిజాం తన అంగీకారాన్ని అక్టోబర్ 25న తెలిపాడు.
- యథాతథ ఒడంబడికను వ్యతిరేకించిన ఖాసిం రజ్వీ
- 1947, అక్టోబర్ 28న వేల మంది ఖాసిం రజ్వీ అనుచరులు చర్చల కోసం నియమించిన ప్రతినిధుల ఇండ్లను చుట్టుముట్టి యథాతథ ఒడంబడిను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. దీంతో నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సైన్యాధిపతి ఎల్ ఎడ్రూస్‌ను, రాజకీయ సంస్కరణల కమిటీ చైర్మన్ అరవమూడు అయ్యంగారిని ఆహ్వానించారు.
- ఈ సమావేశంలో ‘భారత దేశంతో ఘర్షణ జరిగితే హైదరాబాద్ ఎంతకాలం ఎదుర్కొని నిలబడగలుగుతుంది?’ అన్న ప్రశ్నకు సైన్యాధిపతి ఎల్ ఎడ్రూస్ నాలుగు రోజుల కన్నా మించదు అని జవాబు ఇవ్వగా నిజాం జోక్యం చేసుకుంటూ రెండు రోజులు కూడా మించదని పేర్కొన్నాడు.
- అయ్యంగార్ ‘యథాతథ ఒడంబడికను ఆమోదించడం విజ్ఞతతో కూడిన నిర్ణయమంటూ’ నిజాంను, ఇతరులను ఒప్పించారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన మోయిన్ నవాజ్ జంగ్, అబ్దుల్ రహీం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.
- తరువాత ఖాసిం రజ్వీని పిలిచి నిజాం యథాతథ ఒడంబడికపై అభిప్రాయం అడిగినప్పుడు చర్చలను పునఃప్రారంభించాలి, కొత్త ప్రతినిధి వర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కారణాలు చెప్పమని నిజాం ప్రశ్నిస్తే ఇంతకన్నా మెరుగైన ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నుంచి సాధించవచ్చునని రజ్వీ బదులిచ్చారు. నిజాం రజ్వీ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముగ్గురు చర్చల ప్రతినిధులు రాజీనామా చేశారు.
- ఢిల్లీతో చర్చలకు కొత్త ప్రతినిధి బృందం
- నిజాం పాకిస్థాన్‌కు పంపిన ఇద్దరు ప్రతినిధులు అక్టోబర్ 29న హైదరాబాద్‌కు తిరిగి వచ్చి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. అక్టోబర్ 31న చర్చల ప్రతినిధుల్లో ఒకరైన సుల్తాన్ అహ్మద్‌తో నిజాం ఢిల్లీకి లేఖ పంపించారు. ఆ లేఖలో భారత్‌తో చర్చలు విఫలమైతే వెంటనే పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఒప్పందం చేసుకుంటామని హెచ్చరించారు. భారత ప్రభుత్వంతో చర్చల కోసం పోలీస్ మంత్రి మోయిన్ నవాజ్ జంగ్, ఉప ప్రధాని పింగళి వెంకట్రామా రెడ్డి, అబ్దుల్ రహీంలను నియమించారు.
- లార్డ్ మౌంట్ బాటన్, మోయిన్ నవాజ్ జంగ్‌తో నవంబర్ 2న మాట్లాడుతూ మజ్లిస్‌తో నిజాంకు ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నందున యథాతథ ఒడంబడికలో హైదరాబాద్‌కు చాలా రాయితీలివ్వడానికి భారత ప్రభుత్వాన్ని ఒప్పించాను, ఇది గొప్ప ముందడుగు అని అన్నాడు.
- చర్చల ప్రతినిధులు భారత ప్రభుత్వంతో తమకు విదేశాల్లో రాజకీయ ప్రతినిధులను నియమించుకునే అవకాశం, ఆయుధాలను దిగుమతి చేసుకొనే వెసులుబాటు ఉండాలని వాదించారు. భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. పాకిస్థాన్‌తో ఒప్పందం చేసుకుంటామన్న నిజాం హెచ్చరిక తప్పుడు సంకేతమైంది.
- భారత ప్రభుత్వం ఘాటుగా బదులిచ్చింది. హైదరాబాద్ సమస్యను ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనికాదని చర్చల ప్రతినిధులకు స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. చివరికి నిజాం 1947, నవంబర్ 29న యథాతథ ఒడంబడికపై సంతకం చేశారు. దీంతో హైదరాబాద్ రాజ్య విదేశీ వ్యవహారాలను 1948, నవంబర్ 29 వరకు భారత ప్రభుత్వానికి అప్పగించారు.
- నిజాం ఒకవైపు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో పాటు ఇంగ్లండ్, అమెరికా ఇతర రాజ్యాల సహకారానికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం మొదలుపెట్టాడు. దీనికి తోడు ఆయుధాలను సమకూర్చుకోవడానికి హైదరాబాద్ మిలిటరీ జనరల్ అయిన అహ్మద్ సయ్యద్ ఎల్ ఎడ్రూస్‌ను ఇంగ్లండ్ పంపి సిడ్నీ కాటన్, హెన్రీ లష్‌విజ్‌ల ద్వారా ఆయుధాల సరఫరాకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. మందుగుండు సామగ్రికి గాను బ్రిటిష్ మాజీ సైనికాధికారి టీటీ మూర్‌తో మరొక ఒప్పందం కుదుర్చుకున్నాడు.
- అంతేకాకుండా నిజాం తన రాజ్యంలో సాధారణ క్రయ విక్రయాల్లో సైతం భారత రూపాయి వినియోగంపై పరిమితులు విధించాడు. ఒప్పందంలోని విదేశీ వ్యవహారాల నియామకానికి విరుద్ధంగా హైదరాబాద్ నిజాం భారత సెక్యూరిటీల నుంచి రూ.20 కోట్లు పాకిస్థాన్‌కు రుణంగా ఇచ్చాడు. హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ 1948, ఆగస్ట్ 24న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సెక్రటరీ జనరల్‌కు భారత ప్రభుత్వంపై సర్ వాల్టర్ మాంక్టన్ సహాయంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు.
- నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వం ఆంక్షలు
- నిజాం రాజు అనుసరిస్తున్న చాటు మాటు వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం నిజాం రాజ్యంపై ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ఆర్థిక దిగ్బంధాలకు తోడు హైదరాబాద్‌కు చెందిన దక్కన్ ఏర్‌వేస్‌ను భారత భూభాగంపై ఎగరడాన్ని నిషేధించింది. దీంతో హైదరాబాద్‌కు బయటి ప్రపంచంతో గల ప్రయాణ సౌకర్యాలు, సమాచార, ప్రచార, ప్రసార సంబంధాలు తెగిపోయాయి.
- అదేవిధంగా మద్రాస్, ఢిల్లీ మధ్య నడిచే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలును హైదరాబాద్ రాజ్యం ద్వారా కాకుండా ఆ రాజ్య సరిహద్దుల బయటి నుంచి వెళ్లేటట్లు దారి మళ్లించడం, టెలీఫోన్ సంభాషణలు స్పష్టంగా వినబడకుండా అవరోధాలు కల్పించడం, హైదరాబాద్ రాజ్యానికి బదిలీచేసే భారత ప్రభుత్వ సెక్యూరిటీలపై పరిమితులు విధించడం, హైదరాబాద్ రాజ్యం నుంచి జరిగే బంగారం, వజ్రాభరణాలు, నాణాల ఎగుమతులపై నిషేధం విధించడం, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, హైదరాబాద్ స్టేట్ బ్యాంకుల మధ్య గల సంబంధాలను తక్షణమే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
- చివరికి హైదరాబాద్ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత యూనియన్‌లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని జవహర్ లాల్ నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రకటించడం లాంటి చర్యలు నిజాంకు హెచ్చరిక లాగా కనిపించాయి.