Type Here to Get Search Results !

Vinays Info

జల విద్యుత్ కేంద్రాలు(Hydraulic Power Stations)

శ్రీ శైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం

ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్టు ఎత్తు 270 మీ., పొడవు 512 మీ. ఇది 800 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. ఈ కేంద్రంలో 150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 6 టర్బైన్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం

ఇది రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. ఈ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యం 815.6 మెగావాట్లు. ఇక్కడ 110 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 1 టర్బైన్, 100.8 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 టర్బైన్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం

ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించారు. ఈ కేంద్రంలో 30 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న 2 టర్బైన్లు ఉన్నాయి. దీని మొత్తం ఉత్పాదక సామర్థ్యం 60 మెగావాట్లు.

ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం

మహబూబ్‌నగర్ జిల్లాలోని రేవులపల్లి గ్రామం వద్ద కృష్ణానదిపై 1995లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ కేంద్రంలో 39 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 6 టర్బైన్లు (యూనిట్లు) నెలకొల్పారు. దీని మొత్తం ఉత్పాదక సామర్థ్యం 234 మెగావాట్లు.

దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం

ఇది నిర్మాణ దశలో ఉన్న ప్రధానమైన జలవిద్యుత్ ప్రాజెక్టు. దీన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆత్మకూర్ మండలం, మూలమల్ల గ్రామం వద్ద నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2008లో ప్రారంభించారు. 2015 చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ఉత్పాదక సామర్థ్యం 240 మెగావాట్లు. ఈ కేంద్రంలో 40 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 6 టర్బైన్లను ఏర్పాటు చేశారు. దీని మొదటి యూనిట్‌ను 2013 డిసెంబర్‌లో, రెండో యూనిట్‌ను 2014 జనవరిలో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

పోచంపాడు జలవిద్యుత్ కేంద్రం

ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్ డ్యాంకు దిగువన నిర్మించారు. ఈ కేంద్రంలో 9 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లను స్థాపించారు. దీని స్థాపిత సామర్థ్యం 36 మెగావాట్లు.

నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం

దీన్ని నిజామాబాద్ జిల్లాలోని ‘హసనపల్లి’ గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఉత్పాదక సామర్థ్యం 10 మెగావాట్లు.

సింగూర్ జల విద్యుత్ కేంద్రం

ఈ విద్యుత్ కేంద్రం మెదక్ జిల్లాలోని పులకల్ గ్రామంలో సింగూరు రిజర్వాయర్ వద్ద ఉంది. ఈ కేంద్రంలో 7.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 యూనిట్లను ఏర్పాటు చేశారు. దీని మొత్తం స్థాపిత సామర్థ్యం 15 మెగావాట్లు.

పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రం

దీన్ని ఖమ్మం జిల్లా పాలేరు గ్రామంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1993 ఫిబ్రవరి 13 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దీని స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2 మెగావాట్లు.

పెద్దపల్లి మినీ జల విద్యుత్ కేంద్రం

ఈ విద్యుత్ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాకతీయ కాలువపై నిర్మించారు. ఇక్కడ 1986 మార్చి 31 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 9.16 మెగావాట్లు.

పులిచింతల జల విద్యుత్ కేంద్రం

ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. నిర్మాణ దశలో ఉంది. దీన్ని పద్మభూషణ్ కనూర్ లక్ష్మణరావు ప్రాజెక్టుగా కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్టును గుంటూరు జిల్లా పులిచింతల గ్రామం వద్ద కృష్ణానదిపై నిర్మిస్తున్నారు. దీని ప్రతిపాదిత జల విద్యుత్ కేంద్రం నల్గొండ జిల్లా ‘నెమలిపురి’ గ్రామంలో ఉంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 120 మెగావాట్లు. ఇందులో 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 యూనిట్లు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు

1. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO):

1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా దీన్ని APGENCO, APTRANSCOగా విభజించారు. విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను APGENCO, సరఫరా బాధ్యతలను APTRANSCO చూసేది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ 2న APGENCO నుంచి TSGENCOను ఏర్పాటు చేశారు. TSGENCO ద్వారా 2282.50 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 2081.76 మెగావాట్ల జల విద్యుత్, 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

2. ట్రాన్‌‌సమిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSTRANSCO):

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 1999 ఫిబ్రవరి 1న APTRANSCOను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2న APTRANSCO నుంచి TSTRANSCO ఏర్పడింది. రాష్ట్ర విద్యుత్ సరఫరా బాధ్యతలు మొత్తం దీని పరిధిలోనే ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. అవి:

ఎ) తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TSNPDCL): దీని ప్రధాన కేంద్రం వరంగల్‌లో ఉంది. ఈ కంపెనీ 5 ఉత్తర జిల్లాల విద్యుత్ అవసరాలను తీరుస్తోంది.

అవి: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం.

బి) తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSPDCL): దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ 5 దక్షిణ జిల్లాల విద్యుత్ అవసరాలను తీరుస్తోంది.

అవి: హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ.

ఈ రెండు పంపిణీ సంస్థలు దాదాపు రాష్ట్రంలోని 1.2 కోట్ల వినియోగదారుల విద్యుత్ అవసరాలను తీరుస్తున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section