Type Here to Get Search Results !

Vinays Info

అభ్యసనం - Learning

 

అభ్యసనం

  • అభ్యసనాన్ని ఇంగ్లిష్‌లో ‘లెర్నింగ్‌' అంటారు.
  • ఈ లెర్నింగ్‌ పదం లెర్నైన్‌ అనే జర్మనీ పదం నుంచి ఉద్భవించింది.
  • జర్మన్‌ భాషలో లెర్నైన్‌ అంటే I Knew (నాకు తెలుసు) అని అర్థం.
  • లెర్నింగ్‌ అనే పదాన్ని హిల్‌గార్డ్‌ ‘ది మెమొరీస్‌ ఆఫ్‌ లెర్నింగ్‌' అనే గ్రంథంలో మొదటిసారిగా ఉపయోగించారు.
  • ఒక వ్యక్తిలో ఏదైనా ఒక విషయానికి సంబంధించి నాకు తెలియదు అనే పరిస్థితి నుంచి నాకు తెలుసు అనే పరిస్థితికి తీసుకువెళ్లేదే అభ్యసనం.
  • సాధారణ పరిభాషలో అభ్యసనం అంటే నేర్చుకోవడం
  • అభ్యసనం = అంత్యప్రవర్తన > తొలిప్రవర్తన
  • వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పే అభ్యసనం

వ్యక్తి ప్రవర్తనలో మార్పు రెండు రకాలుగా సంభవిస్తుంది. అవి.. 

1) పెరుగుదల   2) అనుభవం.

పెరుగుదల/పరిపక్వత

  • వ్యక్తి ఆకారంలో, పరిమాణంలో మార్పు రావడం (ఎదగడం)
  • ఈ మార్పు వ్యక్తి ప్రమేయం లేకున్నా జరుగుతుంది. ఉదా: కౌమారంలో గౌణ లైంగిక లక్షణాలు రావడం (గడ్డం, మీసాలు)
  • ఈ మార్పు సృష్టిలోని జీవులన్నింటిలో జరుగుతుంది

అనుభవం

  • వ్యక్తి ఆలోచనల్లో, అలవాట్లలో మార్పు రావడం
  • ఈ మార్పు వ్యక్తి ప్రయత్నంతో, అభ్యాసంతో మాత్రమే సాధించగలం ఉదా: ఈత, సైకిల్‌, డాన్సింగ్‌, టైపింగ్‌, రైటింగ్‌, డ్రైవింగ్‌ మొదలైనవి.
  • ఈ మార్పు ఎక్కువగా మానవుల్లో జరుగుతుంది
  • ఈ విధంగా వ్యక్తిలో జరిగే రెండో మార్పునే అభ్యసనం/నేర్చుకోవడం అంటారు.
  • నిర్వచనాలు

    • ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడమే అభ్యసనం
    • ఇంతకుముందు లేని జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులు, సామర్థ్యాలను పొందడమే అభ్యసనం.
    • ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పర్చే ప్రక్రియ- బోజ్‌
    • అనుభవం ద్వారా గాని, శిక్షణ ద్వారా గాని ప్రవర్తనలో కనిపించే మార్పు- గేట్స్‌
    • పరిసర అవసరాలను తీర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పు- మర్ఫీ
    • అభ్యసనం అంటే అనుభవ ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం/పాత ప్రవర్తనను బలపర్చడం లేదా బలహీనపర్చడం- హెన్రీ పీ స్మిత్‌
    • వ్యక్తి అంతర్గత మార్పులతో, పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు- హిల్‌గార్డ్‌
    • ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తిసామర్థ్యాల్లో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవంవల్ల వస్తుంది. కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాలవల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదు- హెర్జన్‌హాన్‌
    • పునర్బలనం చెందిన ఆచరణవల్ల ప్రవర్తనారీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు- డెస్సికో & క్రాఫర్డ్‌
    • ఈ నిర్వచనం ప్రకారం అభ్యసనం జరిగిందని తెలుసుకోవడానికి మూడు ముఖ్యమైన అంశాలు దోహదపడుతాయి. అవి.. 1) ప్రవర్తనలో మార్పు 2) ఆచరిండచం 3) శాశ్వతమార్పు

    ప్రవర్తనలో మార్పు

    అభ్యసనానికి ముందు ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది. అభ్యసనం జరిగిన తర్వాత ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. ఉదా: ఈత రాకముందు పిల్లలు నీటిలో దిగితే మునిగిపోతారు. ఇది అభ్యసనానికి ముందు ప్రవర్తన. కాళ్లు, చేతులను ఏ విధంగా కదిలించాలో తెలుసుకున్న తర్వాత పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది.

    ఆచరించడం

    ఆచరణవల్ల ప్రవర్తనలో మార్పు జరగాలి. ఉదా: అనేకసార్లు అభ్యాసం చేయడం (ఆచరించడం) వల్ల నీటిలో మునిగిపోకుండా ఈతకొట్టగలడు. ఎంత ఎక్కువగా ఆచరిస్తే అభ్యసనం అంతగా బలపడుతుంది.

    శాశ్వత మార్పు

    ప్రవర్తనలో మార్పు చాలాకాలం వరకు ఉండాలి. ఉదా: అనివార్య కారణాలవల్ల కొంతకాలం ఈతకొట్టకపోయినప్పటికీ కొన్ని నెలలు/కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈతకొట్టగలరు.

    అభ్యసనం పరిధిలోకి రాని అంశాలు

    గుడ్డి అనుకరణ (ఇంప్రింటింగ్‌): ఆలోచన లేకుండా చేసే చర్య ఉదా: కోడి పిల్లలు తల్లిని అనుకరించడం

    మత్తుమందులు: మత్తు మందు ప్రభావం ఉన్నంతవరకే వ్యక్తి ప్రవర్తనలో మార్పు ఉంటుంది.

  • పరిపక్వత: వయస్సుతోపాటు వచ్చే మార్పులు. ఉదా: పాకడం, కూర్చోవడం, నిలబడటం, నడవటం

    సహజాతాలు: పుట్టుకతో వచ్చిన ప్రతిస్పందనలు. ఉదా: ఆకలి, దప్పిక, నిద్ర, శ్వాసించడం

    ప్రతిక్రియా చర్యలు: వ్యక్తి ప్రమేయం లేకుండా జరిగేవి. ఉదా: వేడివస్తువులను తాకగానే చేతిని వెనక్కు లాగడం

    నిష్పాదనం: వ్యక్తి తనలోని సామర్థ్యాలను చూపడం. ఉదా: పరిగెత్తడం, బరువులు ఎత్తడం

    వ్యాధులు, అలసట: ఇవి తాత్కాలికమైనవి.

    శారీరక వికాసం (పెరుగుదల): వ్యక్తి ప్రమేయం లేకుండా శారీరక అవయవాల్లో వచ్చే మార్పు

    పై అంశాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పటికీ అవి అభ్యసనం కిందకు రావు. ఎందుకంటే ఈ ప్రవర్తనలో మార్పు అభ్యాసం ద్వారా  వచ్చినదికాదు.

    అభ్యసనం పరిధిలోకి వచ్చే అంశాలు

    • అభ్యాసం
    • అనుభవం
    • ఆచరణ
    • సాధన
    • శిక్షణ
    • పునర్బలనం
    • అభిరుచులు
    • వైఖరులు
    • అలవాట్లు
    • ప్రేరణ
    •  మానసిక వికాసం
    • సాంఘిక వికాసం
    • ఉద్వేగ వికాసం
    • నైతిక వికాసం

    పై అంశాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు అభ్యాసం ద్వారానే వచ్చింది. కాబట్టి ఇవి అభ్యసనం కిందకి వస్తాయి.

     గమనిక: అభ్యాసం ద్వారా వచ్చే మార్పు మాత్రమే అభ్యసనం అవుతుంది. పైన పేర్కొన్న అంశాల్లో అంతర్గతంగా అభ్యాసం ఇమిడి ఉంది.

    లక్షణాలు

    • అభ్యసనం సార్వత్రికమైనది.
    • అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతుంది.
    • అభ్యసనం జీవితాంతం జరిగే ప్రక్రియ.
    • అభ్యసనం జీవితంలో అత్యంత ప్రాధాన్యంగల ప్రక్రియ.
    • అభ్యసనం ఒక ప్రక్రియ మాత్రమే, ఫలితం కాదు.
    • అభ్యసనం ఫలితం మంచి/చెడు కావచ్చు.
    • అభ్యసనం ఫలితం వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మార్పు.
    • అభ్యసనం వ్యక్తి ప్రవర్తనలోని అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది.
    • అభ్యసనం ప్రయోజనాత్మకమైనది.
    • అభ్యసనం గమ్యనిర్దేశకమైనది.
    • అభ్యసనం గతీశీలకమైనది.
    • అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది (పాత అంశాల ఆధారంగా కొత్తవి నేర్చుకోవడం).
    • అభ్యసనం బదలాయించే ప్రక్రియ.
    • అభ్యసనం రేటు, వేగం అందరిలోనూ ఒకేలా ఉండదు.
    • అభ్యసనం ఒకరిలోనైనా అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు.
    • అభ్యసనంలో వైయక్తిక భేదాలుంటాయి.
    • అభ్యసనం సమయోజనానికి (సర్దుబాటు) గాని, విషమయోజనానికి గాని కారణం కావచ్చు.
    • అనుభవం వల్ల, సాధన వల్ల సిద్ధించేదే అభ్యసనం.
    • అభ్యసనం సమ్మిళితం, వియుక్తం
    • అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.
    • అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ.
    •  అభ్యసనం ప్రత్యక్ష, పరోక్ష అనుభవాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు.

    నోట్‌: కొన్ని జీవులకు కొన్ని లక్షణాలు పుట్టుకతో (చేప నీటిలో ఈదడం) వస్తే, అవే లక్షణాలు మరికొన్ని జీవులకు (మానవుడి ఈత) అభ్యసనం వల్ల వస్తుంది.

    మానవుడు స్వరపేటిక ద్వారా శబ్దాలు చేయడమనేది పుట్టుకతో వచ్చిన లక్షణం. కాగా మాట్లాడటం, ఉపన్యసించడం, పాటలు పాడటం మొదలైన లక్షణాలు అభ్యసనం ద్వారానే సంభవిస్తాయి.

    అభ్యాసం, అభ్యసనం, నైపుణ్యం మధ్య సంబంధం

    • ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే చేయడం- అభ్యాసం
    • అభ్యాసం ద్వారా వచ్చిన ఫలితమే- అభ్యసనం 
    •  అతి అభ్యాసం ద్వారా జరిగేదే- నైపుణ్యం
    • అభ్యసనాన్ని నిర్ణయించే అంశాలు/నిర్ణయాలు

    1) సంసిద్ధత (రెడీనెస్‌)

    2) పరిపక్వత/పరిణితి (మెచ్యురేషన్‌)

    3) ప్రేరణ (మోటివేషన్‌)

    4) అవసరాలు (నీడ్స్‌)

    సంసిద్ధత: ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండటమే సంసిద్ధత.

    • ఒక వ్యక్తిలో శారీరక సంసిద్ధతను కలిగించేది- పరిపక్వత
    • ఒక వ్యక్తిలోమానసిక సంసిద్ధతను కలిగించేది- ప్రేరణ
    • ఒక వ్యక్తిలో శారీరక, మానసిక సంసిద్ధతను కలిగించేది- అభ్యసన సంసిద్ధత
    • నిత్యజీవితంలో ఎక్కువగా ఉపయోగపడే విషయాలపట్ల విద్యార్థులు ఎక్కువగా సంసిద్ధతను కలిగి ఉంటారు- థారన్‌ డైక్‌
    • హెర్బర్ట్‌ పాఠ్యపథక సోపానాల్లో ‘సన్నాహం’ అనేది సంసిద్ధతను సూచిస్తుంది.

    పరిపక్వత

    • పరిపక్వత అనేది వ్యక్తిలో సహజసిద్ధంగా వయసుతోపాటు జరిగే ప్రక్రియ.
    • పరిపక్వతలో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. అవి.. 1) పరిసరాల్లోని ఉద్దీపనలను గ్రహించగలగడం, 2) గ్రహించినదాన్ని వినియోగించుకుని ప్రతిస్పందించగలగడం
    • అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే తగినంత పరిక్వత అవసరం
    • ఒక పిల్లవాడు సైకిల్‌ తొక్కుతున్నాడంటే దానికి ఆ పిల్లవాడికి తగినంత పరిపక్వత, అభ్యాసంతోనే సాధ్యమవుతుంది.
    • సిలబస్‌, అభ్యసన కార్యక్రమాలను రూపొందించేటప్పుడు పరిపక్వతను దృష్టిలో పెట్టుకోవాలి.
    •  అభ్యసనం అనేది పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.

    ప్రేరణ

    •  ప్రత్యేకమైన లక్ష్యాలవైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ- బెర్నార్డ్‌
    • అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో ప్రేరణ ముఖ్యపాత్ర వహిస్తుంది.

    అభ్యసనానికి ప్రేరణ రాచబాట

    • ప్రేరణ అనేది అభ్యసనానికి పురిగొల్పి, అభ్యసనం కొనసాగేటట్లు చేసి లక్ష్యాన్ని త్వరగా చేరేటట్లు చేస్తుంది.
    • ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది.
    • అభ్యసనంలో ప్రేరణ ప్రభావం గురించి తెలిపినది- ఎలిజబెత్‌ హర్లాక్‌

    అవసరాలు

    • వ్యక్తి వికాసానికి కావాల్సిన ఉపయోగకరమైన పరిస్థితిని అవసరం అంటారు.
    • కోటి విద్యలు కూటి కోసమే అనే సామెత అభ్యసనానికి, అవసరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.
    • వ్యక్తి అవసరాలను అనుసరించే ప్రేరణ ఉంటుంది.
    •  అవసరం తప్పనిదైతే ప్రేరణ అభ్యసనం పూర్తయ్యే వరకు ఒకేరీతిలో కొనసాగుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section