Type Here to Get Search Results !

Vinays Info

International Museum Day | ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే

International Museum Day |  ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే

మ్యూజియంలు చరితకు చిరునామాలు.
నాగరికత పరిణామానికి నిలువెత్తు సాక్ష్యాలు.

_అవి జ్ఞానభాండాగారాలు, విజ్ఞాన నిక్షేపాలు._
_కళాఖండాల కోశాగారాలు, సాంస్కృతిక సారస్వత కేంద్రాలు._

_మ్యూజియంలు రేపటి తరాలకు దారిచూపే వెలుగు దివ్వెలు..._

*★ ఎన్నో గాథలకు అక్కడ సాక్ష్యాలు కనిపిస్తాయి. ఘనమైన చరిత్రకు నిజమైన ఆధారాలుంటాయి. పురాతన వస్తువులన్నీ అలనాటి వైభవాన్ని గుర్తుచేస్తుంటాయి. మొదటి ఫోను మనల్ని పలకరిస్తుంది. రెండో తరం కంప్యూటర్‌ ఆకట్టుకుంటోంది. తాతల కాలం నాటి వర్ణ చిత్రాలు అబ్బురపరుస్తాయి. రాజుల ఖడ్గాలు రాజసాన్ని ఒలికిస్తాయి. సింహాసనాలు దర్జాగా కొలువుతీరుతాయి. సాసర్‌ నుంచి శాటిలైట్‌ దాకా అక్కడ కనిపించేవెన్నో. వినిపించే కథలెన్నో.చరిత్రకు చిరునామాలు, విజ్ఞానభాండాగారాలు.. మ్యూజియాలు.*

■ ఒకప్పుడు మ్యూజియం అంటే జనాలు పరుగులు తీసేవారు. అక్కడికెళ్లి అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకునేవారు. చరిత్రను తెలుసుకునేవారు. విజ్ఞానాన్ని పెంచుకునే వారు. కానీ నేడు మ్యూజియాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. పురాతన వస్తువులను చూసి మనం ఏం చేస్తాం? అనే ధోరణితో చాలామంది మ్యూజియం తలుపు తట్టట్లేదు.

*■ దాంతో మ్యూజియాలను ప్రజలకు చేరవ చేయడంతో పాటు, వాటిపై ప్రజల్లో అవగాహ న తీసుకురావడానికి ‘ద ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మ్యూజియమ్స్‌(ఐసీఓఎమ్‌) 1977లో "మే18ని మ్యూజియమ్‌ డే "గా ప్రకటించింది. ఆ రోజు నుంచి మే 18న ఎన్నో మ్యూజియాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఉచిత ప్రవేశం కూడా కల్పిస్తున్నారు. 129 దేశాల్లోని దాదాపు 30 వేల మ్యూజియాలు.. ఈ రోజు (మ్యూజి యం డే)ను ఘనంగా నిర్వహిస్తున్నాయి.*

■నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్నో ప్రత్యేక మ్యూజియంలు నెలకొన్నాయి. జీవితంలో పెరుగుతున్న వేగం నేపథ్యంలో ఎంతో మంది ఏ మ్యూజియంనూ చూడలేకపోతున్నారు. అలాంటి వారికి ఓ తరుణోపాయం… ఆన్‌లైన్‌లో మ్యూజియం లను వీక్షించడం.

*■ ఇంటర్నెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యం లో ఆన్‌లైన్‌లోనూ ఎన్నో మ్యూజియంలు రూపుదిద్దుకుంటున్నారుు. వీటినే వర్చువల్‌ మ్యూజియంలుగా వ్యవహరిస్తున్నారు. భౌతిక రూపంలో ఉన్న మ్యూజియంలకు డిజిటల్‌ రూపం ఇచ్చేవి కొన్నయితే, కేవలం డిజిటల్‌ రూపంలో మాత్రమే ఉండేవి మరికొన్ని.*

*■ మ్యూజియం …ఈ పేరు చెప్పగానే మనలో చాలా మందికి గుర్తుకువచ్చేది సాలార్‌ జంగ్‌ మ్యూజియం. ఒక వ్యక్తి సేకరించిన వస్తువుల తో రూపుదిద్దుకున్న మ్యూజియంలలో ప్రపంచప్రఖ్యాతి చెందింది అది.*

◆ సాలార్‌జంగ్‌ మ్యూజియంలో క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచి క్రీ.శ. 20వ శతాబ్దానికి చెందిన వస్తువులు కొలువై ఉన్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన దాదాపు 40 వేల కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ఐవరీ, చేనేత, కలంకారి, ఇనుప, చెక్క, జేడ్‌లతో రూపొందించిన కళాకృతులను ఈ మ్యూజియంలో చూడొచ్చు. చైనా, జపాన్‌, యూరోపియన్‌ పేర్లతో గ్యాలరీలున్నాయి.

*◆ మన ఆంధ్రరాష్ట్రంలోని మరోకటి.. నాగార్జున సాగర్‌కు సమీపంలో కృష్ణానదిపై ఉన్న నాగార్జున కొండ మ్యూజియం.ఇందులో కొత్తరాతి యుగంలోని బంగారునగలు, నాణేలు, ఇతర పనిముట్లు, శిలాశాసనాలు తదితర వస్తువులు ఆకట్టుకుంటాయి.*

*🍄ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియమ్స్..*

*లె లూవర్‌ మ్యూజియం :* ప్యారిస్‌
ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లోని ప్రాచీన మ్యూజియం ఇది. సువిశాలమైన ఈ మ్యూజియంలో చరిత్ర పూర్వయుగం నాటి వస్తువుల మొదలుకొని ఇరవై ఒకటో శతాబ్ది నాటి ఆధునిక వస్తువుల వరకు అనేక అరుదైన వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తాయి. పన్నెండో శతాబ్దిలో రెండో ఫిలిప్‌ హయాంలో కోటగా నిర్మించిన ఈ భవంతిని ఫ్రెంచి విప్లవం తర్వాత 1793లో మ్యూజియంగా మార్చారు.

*ప్రాడో మ్యూజియం:* స్పెయిన్‌ రాజధాని  మాడ్రిడ్ లో ఉన్న ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన యూరోపియన్‌ కళాఖండాలు కనిపిస్తాయి. స్పెయిన్‌ రాజుల హయాంలో వారు వాడిన వస్తువులు, వారు సేకరించిన వస్తువులతో, కళాఖండాలు, ఆభరణాలతో ఈ మ్యూజియంను 1819లో ఏర్పాటు చేశారు.

*స్టేట్‌ హెర్మిటేజ్‌ మ్యూజియం:* సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌,రష్యాలోని అతి పురాతనమైన మ్యూజియం ఇది. ఆరు భవంతుల ప్రాంగణంలో 1754లో ఏర్పాటైంది ఈ మ్యూజియం. ఈ ప్రాంగణంలోనే అప్పట్లో రష్యన్‌ జార్‌ చక్రవర్తులు విడిది చేసే ‘వింటర్‌ ప్యాలెస్‌’ కూడా ఉంది. ఇందులో పురాతన ఈజిప్షియన్, గ్రీకు, రోమన్‌ నాగరికత లకు చెందిన అరుదైన వస్తువులు ఉన్నాయి. 

*రైక్స్‌ మ్యూజియం :* నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న ఈ మ్యూజియం డచ్‌ కళాఖండాలకు ఆలవాలంగా సందర్శకులకు కనువిందు చేస్తోంది. తొలుత దీనిని 1800లో హేగ్‌ నగరంలో ఏర్పాటు చేసినా, 1808లో ఆమ్‌స్టర్‌డామ్‌లోని రాజప్రాసాదానికి తరలించారు. ఆ తర్వాత 1885లో ప్రస్తుత భవంతిలోకి మార్చారు. అప్పటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

*స్మిత్‌ సోనియన్‌ మ్యూజియం:* అమెరికా  రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఈ మ్యూజియం పురాతన వస్తువులకు, జ్ఞాన సమాచారానికి, పురావస్తు పరిశోధనలకు కేంద్రంగా ఉంటోంది. ఇదివరకు దీనిని యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ మ్యూజియం అని కూడా అనేవారు.  

*బ్రిటిష్‌ మ్యూజియం :* బ్రిటిష్‌ రాజధాని లండన్‌లోని పురాతన కట్టడాల్లో ఒకటి బ్రిటిష్‌ మ్యూజియం. వైద్యుడు, శాస్త్రవేత్త సర్‌ హాన్స్‌ స్లోన్‌ 1753లో తాను సేకరించిన పురాతన వస్తువులతో దీనిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరేళ్లకు దీనిని చూసేందుకు ప్రజలను అనుమతించడం మొదలుపెట్టారు. ఈజిప్షియన్‌ మమ్మీల మొదలుకొని అనేక అరుదైన పురాతన చారిత్రక వస్తువులకు ఇది కేంద్రంగా ఉంటోంది.

*★ కెంటకీలోని ఫోర్ట్‌ మిట్‌చెల్‌లో ‘వెంట్‌ హెవెన్‌’ అనే ఓ మ్యూజియం ఉంది. (చేతిలో ఓ బొమ్మ పట్టుకుని సరదాగా మాట్లాడుతుండే మిమిక్రీ ఆర్టిస్టులను వెంట్రిలాక్విజస్ట్స్ అంటారు.)ఈ కళను వెంట్రిలాక్విజమ్‌ గా చెబుతారు. అలాంటి వెంట్రిలాక్విజమ్‌ బొమ్మలున్న ఏకైక మ్యూజియం వెంట్‌ హెవెన్‌. వెంట్రిలాక్విజమ్‌ చరిత్రతో పాటు, ఈ కళకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. దాదాపు 800 బొమ్మలున్నాయి.*

★ అజర్‌బైజాన్‌ దేశంలోని బాకులో ‘మినియేచర్‌ పుస్తకాల మ్యూజియం’ ఉంది. ఇందులో దాదాపు వేలెడంత ఉన్న పుస్తకాలు 6500 వరకు ఉన్నాయి.

*★ పూర్తిగా గాజు వస్తువులతో ఏర్పాటైన ‘మ్యూజియం కార్నింగ్‌ మ్యూజియం ఆఫ్‌ గ్లాస్‌’ ఇదిన్యూయార్క్‌లోని కార్నింగ్‌లో ఉంది.*

ఇంకా.. ఇటలీలోని జిగ్ నీస్ లో ‘అంబ్రెల్లా మ్యూజియం’, వియన్నాలో గోడగడియారా లతో ‘వియెన్నెస్‌ క్లాక్‌ మ్యూజియం’, అమెరికాలోని గాట్లిన్‌బర్గ్‌లో ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ షేకర్స్‌’ మ్యూజియం.. ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు మ్యూజియాలు న్నాయి. పజిళ్లకు కూడా ఓ మ్యూజియం ఉంది. వాటర్‌ క్యాన్‌లకు జర్మనీలో ఓ మ్యూజియం ఉంది. యుద్ధ ట్యాంకులు, విమానాలకు సంబంధించిన మ్యూజియమ్స్‌ చాలా దేశాల్లో ఉన్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మ్యూజియాల జాబితా చూస్తే.. మ్యూజియంలో పెట్టడానికి కాదేది అనర్హం అనాలేమో...

★ ఈ మ్యూజియాల ద్వారా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక అంశాలను, నేటి తరాలవారికి  ఎంతో చక్కగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు... 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section