సాధారణంగా సమాఖ్య ప్రభుత్వాల్లో ద్వంద్వ న్యాయవ్యవస్థ ఉంటుంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా న్యాయశాఖలు ఉంటాయి. కానీ భారత్‌లో న్యాయశాఖ విభజన లేదు. రాజ్యాంగం శాసన, కార్యనిర్వహణ శాఖలతోపాటు స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే సుప్రీంకోర్టు. దీనికింద రాష్ట్రస్థాయిలో హైకోర్టులు, వాటి కింద స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి. కావున దీన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం అంటారు.
చరిత్ర
-దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనా సమయంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో మొదటిసారి సుప్రీంకోర్టును ఏర్పాటుచేశారు.
-భారత ప్రభుత్వ చట్టం-1935 ద్వారా ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్, అమెరికాల్లో ఉన్న న్యాయవ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టును రూపకల్పన చేశారు.
-బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏకీకృత, సమన్యాయ పాలనను, అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయసమీక్ష, స్వతంత్రప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థను గ్రహించారు. మన న్యాయవ్యవస్థ నిర్మాణం బ్రిటన్‌ను, పనితీరు అమెరికాను పోలి ఉంటుంది.
-1950, జనవరి 28న మొదటి సుప్రీంకోర్టు సమావేశం పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్ చాంబర్‌లో జరిగింది.
-రాజ్యాంగంలోని Vవ భాగం 4వ అధ్యాయంలోని 124 నుంచి 147 వరకు గల 24 ప్రకరణలు సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, అర్హతలు, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నాయి.
నిర్మాణం
-124వ ప్రకరణ సుప్రీంకోర్టు ఏర్పాటును, నిర్మాణాన్ని తెలుపుతుంది.
-రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. అయితే పార్లమెంటు న్యాయమూర్తుల సంఖ్యను పెంచవచ్చు (124(1)).
-సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 1956లో 10కి, 1960లో 13కు, 1977లో 17కు, 1986లో 25కు, సవరణ చట్టం-2008 ప్రకారం 2009లో 30కి పెంచారు.
-కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటుచేసేందుకు లెటర్స్ ఆఫ్ పేటెంట్ 1774, మార్చి 26న జారీ అయింది. కింగ్ జార్జి III మద్రాసులో సుప్రీంకోర్టును 1823, డిసెంబర్ 8న ఏర్పాటు చేశారు.
న్యాయమూర్తుల నియామకం
-124(2) ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (ప్రధాన న్యాయమూర్తితో సహా)ను రాష్ట్రపతి నియమిస్తారు.
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మినహా ఇతర న్యాయమూర్తుల నియామకంలో ప్రధానన్యాయమూర్తితోపాటు సుప్రీంకోర్టు, రాష్ర్టాల హైకోర్టుల న్యాయమూర్తులను సంప్రదించాలి.
-సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏండ్ల వరకు పదవిలో ఉంటారు.
చీఫ్ జస్టిస్ నియామకం
-సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ప్రత్యేక అర్హతలను రాజ్యాంగం పేర్కొనలేదు. సాధారణంగా సీనియర్ న్యాయమూర్తిని నియమిస్తారు. 1950 నుంచి 1973 వరకు ఇదే నియమాన్ని పాటించారు.
-కానీ 1973లో కేశవానంద భారతి కేసు తరువాత ముగ్గురు సీనియర్ న్యాయమూర్తు (డీఎం షేలట్, ఏఎన్ గ్రోవర్, కేఎస్ హెగ్డే)లను కాదని జూనియర్ అయిన ఏఎన్ రేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 1977లో కూడా సీనియర్ న్యాయమూర్తి అయిన హెచ్‌ఆర్ ఖన్నాను కాదని జూనియర్ అయిన ఎంహెచ్ బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
జడ్జిల నియామక ప్రక్రియ
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం ఐదుగురు సీనియర్ జడ్జిలు ఉండే న్యాయమూర్తుల కొలీజియం కొందరు న్యాయమూర్తుల పేర్లను న్యాయమంత్రిత్వ శాఖకు సిఫారసు చేస్తుంది.
-కేంద్ర న్యాయశాఖ వారి గుణగణాలను పరిశీలించి ప్రధాని కార్యాలయానికి పేర్లను పంపిస్తుంది.
-కేంద్ర న్యాయశాఖ వ్యాఖ్యానాలు, వివరాలను పరిశీలించిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయం ఆ ఫైలును రాష్ట్రపతికి నివేదిస్తుంది.
-రాష్ట్రపతి న్యాయమూర్తులుగా వారి పేర్లను ఖరారు చేయవచ్చు లేదా పునఃపరిశీలన కోసం సుప్రీంకోర్టుకు (కేవలం ఒకసారి మాత్రమే) తిప్పి పంపించవచ్చు. సుప్రీంకోర్టు అదే న్యాయమూర్తుల పేర్లను రెండోసారి కూడా పంపిస్తే రాష్ట్రపతి దాన్ని కచ్చితంగా ఆమోదించాలి.