ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY – Pradhan Mantri Gram Sadak Yojana)
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయడానికి, రహదారులను నిర్మించడానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను 2000, డిసెంబర్ 25న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులను అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను మాత్రమే నిర్మిస్తారు. దీనికోసం హైస్పీడ్ డీజిల్ ప్రతి లీటర్ కొనుగోలుపై 0.75 పైసలు సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. 2003లో వెయ్యి అంతకంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్న గ్రామాల్లో రోడ్లను నిర్మించారు. 2007 నుంచి 500లు, అంతకంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్న గ్రామాల్లో ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నారు. అదేవిధంగా 250 కంటే ఎక్కువ నివాస సముదాయాలు ఉన్న పర్వత రాష్ర్టాలు, ఎడారి ప్రాంతాల్లో, గిరిజన జిల్లాల్లోని గ్రామాల్లో రహదారులను నిర్మించారు. దీని పర్యవేక్షణకు నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీని(NRRDA) కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 2004-05లో రూ. 3,077.45 కోట్లతో 15,464 కి.మీ. పొడవైన రోడ్లను నిర్మించగా, 2014-15లో రూ. 16,538.05 కోట్లతో 36,337 కి.మీ., 2015-16లో సుమారు 19,200 కోట్లతో 37,000 కి.మీ. పొడవైన రహదాలను నిర్మించారు. ఈ పథకం ప్రారంభమైన నాటినుంచి 4,66,044 కి.మీ. రోడ్లను కొత్తగా నిర్మించగా, అప్పటికే ఉన్న 1,67,977 కి.మీ. పొడవైన రహదారులను అభివృద్ధిపరిచింది. ఈ పథకం కింద అత్యధికంగా మధ్యప్రదేశ్ (63,548 కి.మీ.) రాష్ట్రంలో రోడ్లు నిర్మితమవగా, రాజస్థాన్‌లో 58,462 కి.మీ., ఉత్తరప్రదేశ్‌లో 45,905 కి.మీ., బీహార్‌లో 35,510 కి.మీ., ఒడిశాలో 35,019 కి.మీ. పొడవైన రహదారులను నిర్మించారు.