డిజిటల్ ఇండియా(Digital India)
భారతదేశాన్ని శక్తివంతమైన డిజిటల్ సమాజంగా (Digitally Empowered Society), నాలెడ్జ్ ఆర్థిక వ్యవస్థగా (Knowledge Economy) మార్చేందుకు భారత ప్రభుత్వం దార్శనికతతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం డిజిటల్ ఇండియా(Digital India). ప్రపంచంతో మరింత వేగంగా అనుసంధానం అవటం, దేశంలోని అపారమైన యువ మానవ వనరుల్లో నైపుణ్యాలను పెంచి యువతకు ఉపాధిని సృష్టించటం, టెక్నాలజీ ఆధారంగా పేదరికం, అవినీతి, సామాజిక రుగ్మతలను రూపుమాపటం తదితర లక్ష్యాలతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నది. 2015 జూలై 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది.
దీని ముఖ్యోద్దేశం: ఐటీ + ఐటీ = ఐ.టీ (ఇండియన్ టాలెంట్) + (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) = (ఇండియా టుమారో). అంటే అభివృద్ధి చెందే క్రమంలో దేశ ముఖ చిత్ర మార్పునకు టెక్నాలజీని కేంద్రంగా చేయడం. ప్రభుత్వంలోని అన్ని విభాగాల సర్వీసులు, కార్యకలాపాలు ఒకే గొడుగు కిందకు తేవడం. అందరికి డిజిటల్ మౌలిక వసతుల కల్పన : డిమాండ్‌కు అనుగుణమైన ప్రభుత్వ పాలన, సేవలను ఈ-మాధ్యమంలో అందించుట. ఈ కార్యక్రమం మూడు కీలకమైన దార్శనిక రంగాలపై దృష్టి సారించింది. అవి:ప్రభుత్వ సేవలు, మౌలిక వసతులు కల్పించటం, ప్రభుత్వ సేవలను ఈ-మాధ్యమంలో అందించడం, పౌరులకు డిజిటల్ సాధికారత కల్పించడం ఈ మూడు కీలక లక్ష్యాల సాధనకు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తొమ్మిది మూల అంశాలను పునాదులుగా లేదా మూలస్తంభాలుగా (Nine Pillars) పరిగణిస్తారు.
అవి: 1.బ్రాడ్‌బ్యాండ్ హైవేలు (Broadband Highways) 2.అందరికి మొబైల్ కనెక్టివిటీ (Universal Access to Mobile Connectivity) 3.పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రాం (Public Internet Access Program) 4.ఈ-గవర్నెన్స్ (e-Governance) 5.ఈ-క్రాంతి (e-Kranti) 6.అందరి కోసం సమాచారం (Information for All) 7.ఎలక్ట్రానిక్స్ తయారీ (Electronics Manufacturing) 8.ఐటీతో ఉద్యోగాల సృష్టి (IT for Jobs) 9.సత్వర ఫలితాలు అందించే కార్యక్రమాలు (Early Harvest Programs)