నీతి ఆయోగ్ - ఒక సమగ్ర విశ్లేషణ..!
కొత్తగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఏర్పాటు, లక్ష్యా లు, పనితీరు వంటి అంశాలను అవగాహన చేసుకోవాలంటే భారతదేశంలో ప్రణాళికలు, ప్రణాళికాసంఘం పనితీరు ఎలా ఉండేదో మొదట అర్థం చేసుకోవాలి.
భారతదేశంలో ప్రణాళికలు - సింహావలోకనం
మొదటిసారి భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక ప్రగతి గురించి ప్రస్తావించిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన 1934లో ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంథంలో 1000 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడులతో పది సంవత్సరాలకు ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. 1938లో పండిట్ నెహ్రూ ఆధ్వర్యంలో నేషనల్ ప్లానింగ్ కమిటీని భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. 1940లో కొంత మంది పెట్టుబడిదారులు బాంబే ప్లాన్‌ను తయారు చేయగా దానికి ప్రత్యామ్నాయంగా ఎం.ఎన్.రాయ్ 1944లో పీపుల్స్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. బాంబే ప్లాన్‌లో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు. పీపుల్స్ ప్లాన్ చిన్న పరిశ్రమలు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకంటే ఎం.ఎన్.రాయ్ తయారు చేసిన పీపుల్స్ ప్లాన్ సోవియట్ యూనియన్ సామ్యవాద సిద్ధాంతాలపై ఆధారపడింది. 1944లోనే గాంధేయవాద సూత్రాలకు అనుగుణంగా గాంధీయన్ ప్లాన్‌ను ఎం.ఎన్.అగర్వాల్ ఆవిష్కరించారు. దీనిలో వికేంద్రీకరించిన ఆర్థిక వ్యవస్థకు, గ్రామాల స్వయం సమృద్ధికి అవసరమైన గ్రామీణ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు.
ప్రణాళికా సంఘం అవసరం
ఏ ఆర్థిక రంగ వ్యవస్థ అభివృద్ధి అయినా ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక దేశంలో ఉండే అన్ని వనరులను కలుపుకొని అక్కడి సామాజిక, రాజకీయ వ్యవస్థలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రూపొందించడం తప్పనిసరి. భారత్ వంటి సమాఖ్య దేశంలో ఇటువంటి పని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ చేయడం అవసరం.
ప్రణాళికా సంఘం ఏర్పాటు
పండిట్ నెహ్రూ 1948లో ప్రకటించిన పారిశ్రామిక విధానంలో భాగంగా భారత దేశంలో ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పండిట్ నెహ్రూపై సామ్యవాద సోవియట్ యూనియన్ సిద్ధాంతాల ప్రభావం అధికంగా ఉండటమే దీనికి కారణం. రష్యాలో జోసెఫ్ స్టాలిన్‌లా భారత్‌లో కూడా ఐదేళ్లకోసారి ప్రణాళిక రూపొందించుకొని, ఒక్కో పంచవర్ష ప్రణాళికా కాలంలో ఒక్కో అంశానికి ప్రాధాన్యతనిస్తూ భారతదేశం సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి సాధించాలని భావించారు. ఇందులో భాగంగా 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం ఒక రాజ్యాంగేతర, చట్టం ద్వారా రూపొందని సంస్థ.
ప్రణాళిక సంఘం ముఖ్య ఉద్దేశాలు...
1. భారతదేశంలో ఉన్న ద్రవ్య, సహజ, మానవ వనరుల అంచనా, వాటి సమగ్ర ఉపయోగం
2. ప్రణాళికను రకరకాల దశలుగా విభజించి దశలవారీ వనరుల కేటాయింపు
3. భారతదేశ అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న అంశాలను కనిపెట్టడం
4. ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం
తయారు చేసిన ప్రణాళికపై రాష్ట్రాలతో చర్చించేందుకు జాతీయ అభివృద్ధి మండలిని 1952 ఆగస్టులో ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం, జాతీయాభివృద్ధి మండలికి చైర్మన్‌గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు. ప్రణాళికా సంఘానికి ఒక డిప్యూటీ చైర్మన్‌ను ప్రధాని నామినేట్ చేస్తారు. ప్రణాళికా సంఘానికి ఒక పూర్తి స్థాయి సెక్రటేరియట్ ఉంది. దీనిని యోజన భవన్ అంటారు.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు
+ మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56)
+ రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61)
+ మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66)
+ వార్షిక ప్రణాళికలు (1966-69)
+ నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969-74)
+ ఐదో పంచవర్ష ప్రణాళిక (1974-78)
+ రోలింగ్ ప్రణాళికలు (1978-80)
+ ఆరో పంచవర్ష ప్రణాళిక (1980-85)
+ ఏడో పంచవర్ష ప్రణాళిక (1985-90)
+ వార్షిక ప్రణాళికలు(1990-92)
+ ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)
+ తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997-2002)
+ పదో పంచవర్ష ప్రణాళిక (2002-2007)
+ పదకొండో పంచవర్ష ప్రణాళిక (2007 - 12)
+ పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17)
ప్రణాళికా సంఘం - విమర్శనాత్మక పరిశీలన
* చట్టబద్ధత లేని ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలో భాగంగా రాష్ట్రాలకు, కేంద్రాలకు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయించడాన్ని కొందరు తప్పుబట్టారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘం కార్యకలాపాలను ప్రణాళికా సంఘం నిర్వహించడం ఏమిటన్నది మరో ప్రశ్న. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందుతున్న నిధుల్లో దాదాపు 30 శాతం ప్రణాళికా సంఘం ద్వారా వచ్చేవే.
* ప్రణాళికా సంఘం 65 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ పేదరిక నిర్మూలన, పూర్తి ఉద్యోగిత సాధన వంటి మౌలిక లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైందనేది ఇంకో వాదన.
* సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వంటి అంశాలు బాగా పుంజుకొన్న ఈ కాలంలో కేంద్రీకృతమైన ప్రణాళికలు, వాటిని తయారు చేసే కేంద్రీకృతమైన ప్రణాళికా సంఘం ఔచిత్యాన్ని కొందరు ప్రశ్నించారు.\
* ప్రణాళికా సంఘం పై స్థాయి నుంచి కిందకు అనే ఆర్థికాభివృద్ధి నమూనా భారత్ వంటి దేశానికి ఉపయోగకరం కాదనేది ఇంకో విమర్శ.
* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాధాన్యం బాగా తగ్గించి వాటిని ప్రణాళిక తయారీలో కాకుండా కేవలం ఆమోదించడంలోనే భాగస్వామ్యులను చేసిందన్నది ప్రణాళికా సంఘంపై ఉన్న అతి పెద్ద విమర్శ
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 1978లో జనతా ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికల స్థానంలో రోలింగ్(నిరంతర)ప్రణాళికలను ప్రవేశపెట్టింది. అయితే, 1980లో ఇందిరాగాంధీ తిరిగి పంచవర్ష ప్రణాళికల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత కొంత మంది ఆర్థిక వేత్తలు ప్రణాళికా సంఘాన్ని పదే పదే ప్రశ్నించసాగారు.
నీతి ఆయోగ్ ఏర్పాటు
2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రణాళికా సంఘం కొనసాగింపుపై వేసిన ఇండిపెండెంట్ ఇవాల్యుయేషన్ కమిషన్ ప్రణాళికా సంఘం స్థానంలో ఇప్పటి అవసరాలకు తగినట్టుగా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు 2015 జనవరి 1న కేంద్ర క్యాబినెట్ ఒక తీర్మానం ద్వారా నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 8న జరిగింది. NITI అంటే(National Institution for Transforming India). ఆయోగ్ అంటే సంస్థ అని అర్థం. ఈ సందర్భంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి చేసిన వ్యాఖ్య నీతి ఆయోగ్ అవసరాన్ని సుస్పస్టం చేసింది. ‘‘65 సంవత్సరాల ప్రణాళికాసంఘం తన ఔచిత్యాన్ని కోల్పోయింది. భారతదేశం ఒక భిన్నత్వం కలిగిన దేశం, అందులోని రాష్ట్రాలు ఆర్థికాభివృద్ధి విషయంలో రకరకాల స్థాయుల్లో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి వాటి బలాలు, బలహీనతలు వేరు వేరుగా ఉండటం వల్ల అన్నిటికీ ఒకే రకమైన ప్రణాళిక అనే అంశం భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడనివ్వకుండా అడ్డుకుంటుంది’’.
నీతి ఆయోగ్ నిర్మాణం
ప్రధాన మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్, ముఖ్య కార్యనిర్వాహణాధికారి, దీర్ఘకాలిక సభ్యులు (అంశాలవారీగా నిపుణులు), స్వల్పకాలిక సభ్యులను, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను ప్రధాని నియమిస్తాడు. గవర్నింగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు ఉంటారు. దీనికి అదనంగా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి ప్రాంతీయ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుత నీతి ఆయోగ్ నిర్మాణం
చైర్మన్ : నరేంద్రమోదీ
వైస్ చైర్మన్: అరవింద్ పనగరియా
ముఖ్య కార్యనిర్వాహణాధికారి: అమితాబ్ కంత్
దీర్ఘకాలిక సభ్యులు: వివేక్ దేబరాయ్(ఆర్థిక వేత్త), వి.కె.సారస్వత్(డీఆర్‌డీఓ మాజీ చీఫ్), రమేష్ సింగ్ (వ్యవసాయ రంగ నిపుణులు)
ఎక్స్ అఫీషియో సభ్యులు: రాజ్‌నాథ్ సింగ్ (కేంద్ర హోంశాఖ మంత్రి), అరుణ్ జైట్లి(కేంద్ర ఆర్థిక మంత్రి)
సురేష్ ప్రభు(కేంద్ర రైల్వే మంత్రి), రాధా మోహన్ సింగ్(కేంద్ర వ్యవసాయ మంత్రి)
ప్రత్యేక ఆహ్వానితులు: నితిన్ గడ్కారి(కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి), థావర్ చంద్ గెహ్లాట్(సామాజిక న్యాయ శాఖా మంత్రి), స్మృతి ఇరాని(కేంద్ర జౌళి శాఖ మంత్రి)
నీతి ఆయోగ్ విధులు
నీతి ఆయోగ్‌లో అంతర్గతంగా టీమ్ ఇండియా అనే పేరుతో ఒక విభాగం; విజ్ఙానం, ఆవిష్కరణల పేరుతో మరో విభాగం ఉంది. టీమ్ ఇండియా విభాగం రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమై రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. విజ్ఞాన, ఆవిష్కరణల విభాగం ఒక ఆలోచనల భాండాగారం(థింక్ ట్యాంక్). నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘంలా కాకుండా కింది స్థాయి నుంచి పైకి ఆర్థికాభివద్ధి కోసం ప్రయత్నిస్తుంది.
నీతి ఆయోగ్ లక్ష్యాలు
+ ప్రణాళిక తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలకు అవసరమైన సలహాలను, సహకారాన్ని అందించడం
+ మంత్రిత్వశాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి అన్ని మం త్రిత్వ శాఖలకు ఒకే విజన్ ఉండేలా ప్రయత్నం చేయడం
+ గ్రామస్థాయి నుంచి ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు తయారుచేసి వాటిని కేంద్ర స్థాయికి తీసుకెళ్లడం, తద్వారా ఏ వర్గాల వారైతే ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోయారో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం.
+ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రకరకాల పథకాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన సూచనలు చేయడం
+ మహిళా సాధికారత, అభివృద్ధిలో పేదలు, గ్రామాలు, రైతులను భాగస్వాములను చేయడం, సుపరిపాలనకు పెద్దపీట వేయడం.
నీతి ఆయోగ్ వల్ల పెరిగిన రాష్ట్రాల ప్రాముఖ్యం:
భారతదేశాన్ని ఒక సహకార సమాఖ్యగా మార్చడానికి నీతి ఆయోగ్ ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో మూడు సబ్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
1. కేంద్ర ప్రాయోజిక పథకాలపై
2. నైపుణ్యాల అభివృద్ధిపై
3. స్వచ్ఛ భారత్ మిషన్‌పై
గమనిక:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వచ్ఛ భారత్ మిషన్ సబ్ గ్రూపులో సభ్యులు కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్‌గ్రూప్‌లో సభ్యులు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక నిధులు కల్పన విషయం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉన్నది.