Type Here to Get Search Results !

Vinays Info

ప్లాసీ యుద్ధం

ప్లాసీ యుద్ధం, బెంగాలు నవాబు, అతడి ఫ్రెంచి మిత్రులపై బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్ణయాత్మక విజయం సాధించిన యుద్ధం. 1757 జూన్ 23 న జరిగిన ఈ యుద్ధం, బెంగాల్లో కంపెనీ స్థానాన్ని సుస్థిరపరచింది. తరువాతి వంద సంవత్సరాల్లో కంపెనీ తమ ప్రాబల్యాన్ని భారత్ అంతటా విస్తరించింది.

ఈ యుద్ధం బెంగాల్లో భాగీరథి నదీ తీరంలోని ప్లాసీ (ప్రస్తుత పలాషి) వద్ద జరిగింది. ఈ ప్రదేశం కలకత్తాకు ఉత్తరాన 150 కిమీ వద్ద, అప్పటి బెంగాలు రాజధాని ముర్షిదాబాదుకు దక్షిణాన ఉంది. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, ఇస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో ప్రత్యర్థులు. సిరాజుద్దౌలా అంతకు ఏడాది ముందే బెంగాలు నవాబయ్యాడు. వెంటనే అతడు ఇంగ్లీషువారిని వారి కోటల విస్తరణను ఆపమని ఆదేశించాడు. రాబర్టు క్లైవు, నవాబు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫరును లంచంతో లోబరచుకుని, అతణ్ణి బెంగాలు నవాబును చేస్తానని ఆశ గొలిపీ, తన పక్షానికి తిప్పుకున్నాడు. ప్లాసీ యుద్ధంలో క్లైవు, బెంగాలు నవాబును ఓడించి కలకత్తాను స్వాధీనపరచుకున్నాడు.[1]

ఈ యుద్ధానికి ముందు సిరాజుద్దౌలా బ్రిటిషు వారి నియంత్రణలో ఉన్న కలకత్తాపై దాడి చెయ్యడం, చీకటి గది మారణకాండ చేయించడం జరిగాయి. బ్రిటిషు వారు రాబర్టు క్లైవు నాయకత్వంలో మద్రాసు నుండి అదనపు బలగాలను పంపించి కలకత్తాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ వెంటనే క్లైవు ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న చందర్‌నగర్ కోటను వశపరచుకున్నాడు.[2] బ్రిటిషువారికీ, సిరజుద్దౌలాకూ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు ప్లాసీ యుద్ధానికి దారితీసాయి. సంఖ్యపరంగా సిరాజుద్దౌలా సైన్యం, బ్రిటిషు సైన్యం కంటే చాలా ఎక్కువ. ఈ విషయమై ఆందోళన చెందిన క్లైవు, మీర్ జాఫరు, యార్ లుతూఫ్ ఖాన్, ఓమిచంద్, రాయ్ దుర్లభ్, జగత్ సేఠ్‌లతో కలిసి కుట్రపన్నాడు. దాని ప్రకారం వీళ్ళంతా యుద్ధభూమికి తమ సైన్యాలతో వచ్చినప్పటికీ, యుద్ధంలో పాల్గొనలేదు. ఫలితంగా 18,000 మందితో కూడిన సిరాజుద్దౌలా సైన్యం, కేవలం 3,000 క్లైవు సైన్యం చేతిలో పరాజయం పొందింది. యుద్ధం కేవలం 40 నిముషాల్లో ముగిసిపోయింది.

సామ్రాజ్యవాదులు భారత్ ను ఆక్రమించుకోవడంలో ఈ యుద్ధం కీలకమైనదిగా భావిస్తారు. దీనితో బ్రిటిషువారికి బెంగాలు నవాబుపై అధిపత్యం కలిగింది. తద్వారా తమకు జరిగిన యుద్ధ, వ్యాపార నష్టాలకు పరిహారంగా అతడి నుండి ఎన్నో రాయితీలను పొందారు. ఈ సొమ్మును తమ సైనిక శక్తిని పెంపొందించుకునేందుకు, తమ ఐరోపా ప్రత్యర్థులను దక్షిణాసియా నుండి వెళ్ళగొట్టి, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకూ వాడుకున్నారు.

నేపథ్యంసవరించు

ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత్‌లోమూడు ప్రధాన స్థావరాలున్నాయి -మద్రాసులోని ఫోర్టు సెంట్ జార్జి, కలకత్తాలో ఫోర్ట్ విలియం, బొంబాయిలో బాంబే కోట. ఈ మూడూ స్వతంత్ర ప్రెసిడెన్సీలు, మూడింటికీ  విడిగా ప్రెసిడెంటు,  కౌన్సిలూ ఉంటుంది. వీరిని ఇంగ్లాండులోని డైరెక్టర్ల కోర్టు నియమిస్తుంది. స్థానిక రాజులు, నవాబులతో చేతులు కలిపి తిరుగుబాటు దారుల నుండి, విప్లవకారుల నుండి వాళ్ళకు రక్షణ కల్పించే విధానాన్ని బ్రిటిషు వాళ్ళు  అవలంబించారు.  దీనికి ప్రతిగా నవాబులు  వాళ్లకు అనేక రాయితీలు కల్పించారు.  అప్పటికి ఇస్ట్ ఇండియా కంపెనీకి, డచ్చి,  పోర్చుగీసు  వాళ్లకూ మధ్య వైరం  సమసిపోయింది.  ఫ్రెంచి  వాళ్ళు కూడా  14 వ లూయీ నేతృత్వంలో తమ స్వంత ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి బెంగాల్లోని చందర్‌నగర్,  పాండిచ్చేరిల్లో  తమ స్థావరాలను  నెలకొల్పుకున్నారు. ఈ రెండూ  కూడా పాండిచ్చేరి ప్రెసిడెన్సీ పాలనలో ఉండేవి.  ఫ్రెంచి వాళ్ళు  భారత్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, త్వరగా స్థిరపడిపోయి, బ్రిటన్ను మించిపోయే స్థాయికి చేరుకున్నారు.[3][4]

కర్నాటిక్ యుద్ధాలుసవరించు

The Mughal Empire's Nawab of Bengal Alivardi Khan adopted strict attitudes towards European mercantile companies in Bengal.
ఆస్ట్రియా యుద్ధం (1740 – 1748) తరువాత బ్రిటను, ఫ్రాన్స్ మధ్య భారత్‌లో సైనిక ఆధిపత్యం కోసం, రాజకీయ జోక్యం కోసం ఆధిపత్య పోరు మొదలైంది. 1746 సెప్టెంబరులో ఫ్రెంచి సేనాని మాహె డి లా బోర్దోన్నా, నౌకా సైన్యంతో మద్రాసు తీరం చేరి నగరాన్ని ముట్టడించాడు. మూడు రోజుల యుద్ధం తరువాత మద్రాసు లొంగిపోయింది. లొంగుబాటులో భాగంగా, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ అతడికి నగదు చెల్లించాలనే ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నరు జనరలు, డూప్లే ఒప్పుకోలేదు. అక్టోబరులో బోర్దోన్నా భారత్‌ను వదలిపెట్టి వెళ్ళిపోగానే, డూప్లే ఆ ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ మొహమ్మద్ ఖాన్ బ్రిటిషు వారికి మద్దతుగా కలగజేసుకున్నాడు. రెండు సైన్యాలు కలిసి, మద్రాసును తిరిగి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాయి. సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఈ సంయుక్త బలగాలు, ఫ్రెంచి వారి ముందు నిలవలేకపోయాయి. మద్రాసు ఓటమికి ప్రతీకారంగా బ్రిటిషు వారు మేజర్ లారెన్స్, అడ్మిరల్ బొస్కావెన్‌ల నాయకత్వంలో పాండిచ్చేరిని ముట్టడించాయి. కానీ 31 రోజుల తరువాత ముట్టడిని ఎత్తివేయాల్సి వచ్చింది. 1748 లో కుదిరిన ఐ లా చాపెల్ ఒడంబడికకు అనుగుణంగా డూప్లే మద్రాసును బ్రిటిషు వారికి తిరిగి ఇచ్చివేసాడు.[3][5]

ఐ లా చాపెల్ ఒడంబడిక రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలను నివారించినప్పటికీ, ఇరు దేశాలూ స్థానిక రాజులతో జతకట్టి ప్రచ్ఛన్న యుద్ధాలకు తెరదీసాయి. దక్కను నిజాము, దాని సామంత కర్నాటక రాజ్య నవాబుల వారసత్వ పోరులో డూప్లే కలగజేసుకున్నాడు. ఆ రెండు పదవులకూ బ్రిటిషు ఫ్రెంచి వారు తమ తమ అభ్యర్థులను ప్రకటించారు. రెండు చోట్లా డూప్లే అభ్యర్థులు మాయోపాయాలతోటీ, రెండు హత్యలతోటీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1751 మధ్య నాటికి, నవాబు స్థానానికి ఫ్రెంచి అభ్యర్థి ఐన చందా సాహిబ్, బ్రిటిషు అభ్యర్థి మొహమ్మద్ ఆలీ స్థావరమైన తిరుచినాపల్లిని ముట్టడించాడు. అతడికి ఫ్రెంచి సేనాని చార్లెస్ మార్క్ బుస్సీ సాయం చేసాడు.[3][5]

1751 సెప్టెంబరు 1 న 280 ఐరోపా సైనికులు 300 మంది సిపాయీలు కెప్టెన్ రాబర్టు క్లైవు నాయకత్వంలో కర్నాటిక్ రాజధాని ఆర్కాటును ఆక్రమించుకున్నారు. చందా సాహిబ్ తన సైన్యంలో కొంత భాగాన్ని ఇక్కడికి పంపిస్తాడని, అప్పుడు తిరుచినాపల్లిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చనీ వారు భావించారు. చందా సాహిబ్ రజా సాహిబ్ నేతృత్వంలో 4,000 మంది భారతీయులు, 150 మంది ఫ్రెంచి వారు ఉన్న సైన్యాన్ని పంపించాడు. వారు కోటను కొన్ని వారాల పాటు ముట్టడించి, కొన్ని చోట్ల గోడలను పగలగొట్టారు. క్లైవు, మురారి రావు అనే మరాఠా సేనానికి వర్తమానం పంపించాడు. మరాఠాలు రావడం ఖాయమని తెలిసిన రజా సాహిబ్, పెద్ద మొత్తంలో నగదు ఇస్తాను లొంగిపొమ్మని క్లైవుకు కబురు పంపాడు. క్లైవు ఒప్పుకోలేదు. నవంబరు 24 ఉదయాన, రజా సాహిబ్ కోటపై చివరి దాడి చేసాడు. కానీ బ్రిటిషు తుపాకుల దాడికి అతడి ఏనుగులు చెల్లాచెదురవడంతో అది విఫలమైంది. కోట రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళేందుకు అనేక విఫలయత్నాలు చేసారు. మరుసటి రోజు రజా సాహిబ్ దళాలు ముట్టడిని ఎత్తేసి, తమ ఆయుధాలు అక్కడే వదిలేసి, పారిపోయాయి. ఆర్కాటు, కాంచీవరం, తిరుచినాపల్లిలలో విజయాల తరవాత, బ్రిటిషు వారు కర్నాటకను స్వాధీనపరచుకుని కొత్త ఫ్రెంచి గవర్నరు, గొదేహూతో కుదిరిన ఒప్పందం ప్రకారం ముహమ్మద్ ఆలీని నవాబు చేసారు.

ఆలీవర్ది ఖాన్ ముర్షిదాబాదును ముట్టడించి పట్టుకున్నాడు. అతడు బెంగాలు నవాబయ్యాడు. అతడు బెంగాల్లోని ఐరోపా  దేశీయుల పట్ల కఠినంగా  ఉండేవాడని ప్రతీతి. మరాఠాలతో  అతడు యుద్ధాలు చేస్తున్న  సమయంలో  అతడు ఐరోపా వారి దుర్గాలను బలోపేతం చేసుకునేందుకు అనుమతించాడు. అలాగే బ్రిటిషు వారిని మరాఠా కందకాన్ని తవ్వనిచ్చాడు.  మరోవైపు తన యుద్ధాల ఖర్చుల కోసం వారి నుండి అధిక  మొత్తాల్లో ధనం వసూలు చేసాడు.

దక్షిణ భారతంలో బ్రిటిషు, ఫ్రెంచి వారు స్థానిక పాలకులను అడ్డుపెట్టుకుని చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధాల గురించి అతడికి బాగానే తెలుసు. ఆ పరిస్థితి తన రాజ్యంలో  రాకూడదని అతడు ఐరోపా దేశీయులతో జాగ్రత్తగా  వ్యవహరించేవాడు. అయితే, వారి మధ్య నిరంతరం స్పర్థ ఉండేది; ఫరూఖ్‌సియార్ 1717 లో జారీ చేసిన ఫర్మానాను అనుభవించనీయడంలేదని బ్రిటిషు వారు అతడిపై తరచూ ఆరోపించేవారు. నవాబు కొలువులోని వారిని మాత్రం బ్రిటిషు  వారు జాగ్రత్తగా చూసుకునేవారు.  స్థానిక  వ్యాపారులను  పన్ను లేకుండా వ్యాపారం చేసుకోనిచ్చేవారు.  తమ  ప్రాంతాలకు వచ్చే వస్తువులపై పన్నులు బాగా విధించేవారు. ఇవన్నీ నవాబు ఆదాయానికి గండికొట్టాయి.

1756 లో ఆలీవర్ది ఖాన్ మరణించాక అతడి మనవడు సిరాజుద్దౌలా పరిపాలన కొచ్చాడు. అతడు తీవ్రమైన కోపిష్టి అనీ, విషయ గ్రహణ శక్తి తక్కువనీ ప్రతీతి. ఐరోపా కంపెనీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయని అతడికి అనుమానంగా ఉండేది. బ్రిటిషు, ఫ్రెంచి వారు తమ స్థావరాలను బలోపేతం చేసుకుంటుండగా అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు కాబట్టి, వాటిని వెంటనే ఆపెయ్యమని అతడు ఆదేశించాడు. బ్రిటిషు వారు అందుకు తిరస్కరించినపుడు, నవాబు 3,000 మందితో కాసింబజారు వెళ్ళి కోటను, కర్మాగారాన్నీ ఆక్రమించి, అనేకమంది బ్రిటిషు అధికారులను బందీలుగా పట్టుకున్నాడు. అక్కడినుండి కలకత్తాపై దాడికి వెళ్ళాడు. కలకత్తాకు రక్షణ బలహీనంగా, ఆసలే లేనట్టుగా ఉంది. కోటలో ఉన్న 180 మంది సైనికులు, 50 ఐరోపా వాసులు, 60 మంది ఐరోపా సైనికులు, 150 మంది ఆర్మేనియా, పోర్చుగీసు సైనికులు, 35 మంది ఐరోపా శతఘ్నిదళం, 40 మంది నావికులూ నవాబు యొక్క 50,000 మంది సైన్యాన్ని ఎదుర్కొన్నారు. సిరాజ్ జూన్ 16 న నగరాన్ని, 20 వ తేదీన కోటనూ ఆక్రమించు కున్నాడు. బందీలను తన అధికారులకు అప్పగించి, ఫోర్టు విలియం కోటలోని చీకటిగదిలో బంధించాడు. దాన్నిబ్లాక్ హోల్ అనే వారు. 5.5 మీ పొడవు, 4.3 మీ వెడల్పూ కలిగిన ఈ చీకటిగదికి రెండు చిన్న కిటికీలుండేవి. ఆరుగురు ఖైదీలను ఉంచేందుకు బ్రిటిషువారు కట్టిన ఆ గదిలో 146 మంది బందీలను కుక్కారు. జూన్ 21 న గదిని తెరిచినపుడు 146 మందిలోనూ 23 మంది మాత్రమే బయటికి వచ్చారు. మిగతా వారు ఊపిరాడక, వేడికి, పిచ్చితోటీ మరణించారు. వారిని బంధించిన పరిస్థితుల గురించి నవాబుకు తెలిసినట్లుగా ఆధారాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా, నవాబు సైన్యం కలకత్తా నగరాన్ని, బ్రిటిషు కర్మాగారాలను దోచుకున్నారు.

కలకత్తా ఆక్రమణ కబురు 1756 ఆగస్టు 16 నాటికి మద్రాసులో తెలిసింది. కౌన్సిల్ వెంటనే కలనల్ క్లైవ్, అడ్మిరల్ వాట్సన్ నాయకత్వంలో ముందస్తు బలగాన్ని పంపింది. ఫోర్ట్ సెంట్ జార్జి కౌన్సిల్ ఇచ్చిన ఉత్తరంలో ఇలా ఉంది, "ఈ యాత్ర ఉద్దేశం కేవలం బెంగాల్లోని స్థావరాలను పునరుద్ధరించడమే కాదు, కంపెనీ హక్కులను గుర్తింపజేసి, జరిగిన నష్టానికి పరిహారాన్ని వసూలు చెయ్యడం కూడా" -అదీ యుద్ధం అవసరం లేకుండా. నవాబు ఉద్యోగులు, అనుచరులలో అసంతృప్తి ఏమైనా ఉంటే దాన్ని ఉసిగొలపాలి.[8] అని కూడా రాసారు. క్లైవు 900 మంది ఐరోపా సైనికులు, 1500 మంది సిపాయీలు ఉన్న పదాతి దళాన్ని నడపగా, వాట్సన్ నావికా దళానికి నేతృత్వం వహించాడు.  ఈ సైన్యం డిసెంబరులో హుగ్లీ  నదిని  చేరుకుంది. అక్కడ ఫుల్టా గ్రామం వద్ద పరారీలో ఉన్న తమ వారిని కలిసారు. వారిలో కౌన్సిల్ సభ్యులు కూడా ఉన్నారు. కౌన్సిల్ సభ్యులు దిశను చూపిస్తూండగా, సైన్యం డిసెంబరు 29 న బడ్జ్ బడ్జ్ కోటను స్వాధీనం  చేసుకుంది. వాళ్ళు మరింత ముందుకు వెళ్ళి, 1757 జనవరి 2 న కలకత్తా  కోటపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. 500 మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు.[9] కలకత్తాను స్వాధీనపరచుకున్నాక, కౌన్సిల్‌ను పునస్థాపించి, ఇక నవాబును ఏం చెయ్యలనే విషయంపై ప్రణాళిక రచించారు. ఫోర్ట్ విలియం ను పటిష్ఠ పరచి, నగరానికి ఈశాన్యాన రక్షణ చర్యలు చేపట్టారు.[10][11][12]

బెంగాల్ దండయాత్ర సవరించు

రాబర్ట్ క్లైవు (1773), నథానియెల్ డాంస్ - హాలండ్
1757 జనవరి 9 న కెప్టెన్ కూట్, మేజర్ కీల్పాట్రిక్ నాయకత్వంలో 650 మందితో కూడిన సైన్యం కలకత్తాకు 37 కిమీ దూరంలో ఉన్న హుగ్లీ పట్టణాన్ని ముట్టడించి ఆక్రమించింది. ఈ సంగతి తెలిసిన నవాబు, సైన్యాన్ని సన్నద్ధం చేసుకుని కలకత్తాకు ప్రయాణ మయ్యాడు. ఫిబ్రవరి 3 న సైన్యంలోని ప్రధాన భాగంతో చేరుకుని  మరాఠా కందకం వద్ద విడిది చేసాడు. తన ప్రధాన స్థావరాన్ని ఓమిచంద్ తోటలో స్థాపించాడు. అతడి సైన్యంలోని ఒక చిన్న భాగం పట్టణ ఉత్తర పొలిమేరల్లో దాడి చేసింది. లెఫ్టెనెంట్ లెబేమ్ నాయకత్వంలోని సైన్యం వీరిని ఓడించి, 50 మందిని ఖైదీలుగా పట్టుకుంది.[13][14][15][16][17]

ఫిబ్రవరి 4 ఉదయాన నవాబు శిబిరంపై మెరుపుదాడి చెయ్యాలని క్లైవు నిర్ణయించాడు. అర్ధరాత్రి 600 మంది నావికులు, 650 మంది ఐరోపా సైనికులు, 100 మంది శతఘ్ని దళం, 800 మంది సిపాయీలు, 6 ఆరు-పౌండ్ల గన్నర్లు నవాబు శిబిరాన్ని సమీపించాయి. ఉదయం 6 గంటలకు, దట్టమైన మంచు మాటున ఈ గస్తీ దళానికి నవాబు గస్తీ దళం ఎదురుపడింది, వాళ్ళు తుపాకులతో కాల్పులు జరిపి పారిపోయారు. దళం మరికొంత ముందుకు వెళ్ళి, ఓమిచంద్ తోటను సమీపించారు. అప్పుడు వారికి అశ్విక దళపు డెక్కల చప్పుడు వినిపించింది. అశ్వికులు 27 మీ దూరంలోకి వచ్చాక, బ్రిటిషు దళం వారిపై కాల్పులు మొదలుపెట్టింది. చాలా మంది మరణించగా మిగిలినవారు చెల్లాచెదురయ్యారు. మంచు కారణంగా నడక దూరానికి మించి దారి కనబడలేదు. దానితో దళం నడక మెల్లగా సాగింది. కాల్బలం, శతఘ్ని దళం అప్పుడప్పుడు రెండువైపులా కాల్పులు జరుపుతూ పోయింది. తోట దక్షిణాన ఉన్న సన్నటి ఎత్తైన దారిలో వెళ్ళి తోటలోని నవాబు శిబిరంపై దాడి చెయ్యాలని క్లైవు భావించాడు. నవాబు సైన్యం ఆ దారికి అడ్డు పెట్టింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో మంచు తెరలు తొలగడం మొదలైంది. అప్పుడు మరాఠా కందకం ఆవలి వైపు నుండి నవాబు శతఘ్ని దళం ప్రయోగించిన గుళ్ళ దాడికి బ్రిటిషు దళాలు చెల్లా చెదురయ్యాయి. నవాబు సైన్యం ఓ మైలు దూరంలో ఉన్న వంతెన ద్వారా కందకాన్ని దాటి, కలకత్తా చేరుకుంది. క్లైవు సైన్యంలో 57 మరణించగా, 137 మంది గాయపడ్డారు. నవాబు సైన్యం 22 మంది అధికారురతో సహా, 600 మంది సైనికులు, 4 ఏనుగులు, 500 గుర్రాలు, కొన్ని ఒంటెలను, ఎన్నో ఎద్దులనూ కోల్పోయింది. ఈ దాడితో నవాబు భయపడిపోయి, ఫిబ్రవరి 5 న కంపెనీతో ఆలీనగర్ ఒడంబడిక చేసుకున్నాడు. దాని ప్రకారం కంపెనీ కర్మాగారాలను పునర్నిర్మించుకోవడం, కలకత్తాను బలోపేతం చేసుకోవడం, గత హక్కులను పునస్థాపించుకోవడం ఈ ఒడంబడిక విశేషాలు. నవాబు తన సైన్యాన్ని తిరిగి రాజధాని ముర్షిదాబాదుకు తరలించాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section