కొమురం భీము (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఈయన ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీమ్ 1901 సంవత్సరంలో జన్మించాడు.పదిహేనేళ్ల వయుసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం బీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. అతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ యొక్క సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.
బాల్యం
కొమురం భీము గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ , సోంబాయి దంపతులకు 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.
ఉద్యమ జీవితం
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీము ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు.
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమసింహం లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, అక్టోబర్ 27 న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరంక్షభీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.
👉నేటి పోరాటాలకు స్ఫూర్తి
ఆ దివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీము. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం.పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు.ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డ్బ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్బాలు అనేకంఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమై న చోట తమ అస్తిత్వం కోసంఅలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమిడిలేరు. వారు స్వేచ్ఛా ప్రియులు. వారి జీవనాధారమైన అడివినుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంటవేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండులను వారి భూముల నుంచి తరిమేశారు. పంటలను ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు. ఈవేధింపులు, అణచివేతల నేపథ్యంలోంచే..ఆదిలాబాద్ గోండన్నలు పోరుబాట పట్టారు.తమ విముక్తి కోసం పోరాట జెండాపట్టారు. ‘మాఊర్లో మా రాజ్యం’అంటూ పన్నెండు గూడాలు బాబేఝరి లొద్దుల్లో తుడుం మోగించాయి. కొమురంభీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీవర్గాలపై తుడుం మోగించారు. కొమురంభీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించే లోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా పన్నెండు మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కారు పాశవికంగా కొమరంభీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడేఘాట్ లొద్దుల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్నది.
ఏహక్కుల కోసమైతే..నాడు భీం ఉద్యమించాడో.. ఆ హక్కుల కోసం ఆదివాసులు నేటికీ నిరంతరం పోరాటం చేయవలసే వస్తున్నది. ప్రజాస్వామిక రాజ్యమని చెప్పుకుంటున్న నేడు కూడా..ఆదివాసుల అవస్థలు ఏమీ తీరలేదు. నిజాం రాజు నియమించిన హైమన్‌డార్ఫ్ సూచనలను కూడా నేటి పాలకులు పాటించడంలేదు. కానీ నాటి నిజాం ప్రభువయినా.. గిరిజనుల అభ్యున్నతి కోసం హైమన్‌డార్ఫ్ సూచనలను పాటించాడు. వారి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాడు. కానీ..నేటి పాలకులు ఇవేవీ పట్టకుండా ఆదివాసులపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. కొమురం భీం స్ఫూర్తితో విప్లవ సంఘాల నాయకత్వంలో మరొకసారి ఆదివాసులు సంఘటిత పోరాటాలు చేశారు. దీంతో.. ఆదివాసుల ఐక్యతను చూసి తట్టుకోలేని ప్రభుత్వం ఇంద్ర మారణకాండను సృష్టించింది. ఇది ఆధునిక కాలంలోని మరో జలియన్‌వాలా బాగ్‌గా ప్రజాస్వామికవాదులు పిలుస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివాసుల పోరాటానికి సంఘీభావం వచ్చింది. ప్రభుత్వ దమననీతిని ఖండించారు. రాజ్యం తన హేయమైన చర్యలు చేస్తూ నే.. మరోవైపు సంస్కరణలు చేపట్టింది. ఆదివాసుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా..పైపూత మాటలతో జోకొట్టే ప్రయత్నం చేసింది. ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణ ఇచ్చే రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలును తుంగలో తొక్కి ఆదివాసులపై అన్నివైపుల నుంచి దాడులు జరుగుతున్నా యి. ప్రాజెక్టులు, గనుల తవ్వకాల పేరుతో నిర్వాసితులను చేస్తున్నది.
ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలు పర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజావూపతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమా జం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదు. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి డెభ్బైఏళ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తినేటికీ ఉంది. అది మరోఇంద్ర పోరాట రూపంగా పెల్లుబకవచ్చు. ప్రభుత్వాలు మరో ఉప్పెన రాక మునుపే మేల్కొనాలి.
అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.జల్,జంగల్,జమీన్ కోసం ఆదివాసులు కొమురంభీం బాటలో పయనిస్తున్నారు. కొమురం భీంను ప్రేమించే వాళ్లుగా.. ఆదివాసుల అస్తిత్వ పోరాటాలకు అండగా నిలుద్దాం. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలు అస్తి త్వంకోసం,స్వయంపాలన కోసం పోరాడుతున్నారు. సందర్భాలు వేరు కావచ్చు. కాని పోరాట లక్ష్యాలు ఒకటే. తెలంగాణ ప్రజలు కొమురం భీం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. పరపీడన నుంచి విముక్తి కోసం ఆయుధమెత్తి పోరాడిన భీం వారసులుగా కదం తొక్కాలి. వలస పాలనను అంతం చేయాలి. అదే.. కొమురం భీముకు నిజమైన నివాళి.
ఉద్యమ స్ఫూర్తి.. భీం
🔹నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన కొమురం భీం ఆశించిన లక్ష్యాలను నేటి పాలకులు నెరవేర్చలేక పోతున్నారు. భీం మరణించి 72 ఏళ్లు గడుస్తున్నా జల్, జంగిల్, జమీన్‌పై ఆదివాసీలు నేటికీ హక్కులు పొందలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు గిరిజనులు హక్కుల కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. భీం పుట్టింది ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సంకెపల్లి.. పెరిగింది సుర్తాపూర్. కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కావలి కాశీ పంటలు పండించేవాళ్లు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేకున్నప్పటికీ వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని సర్కారోళ్లు.. జంగ్లాత్ వాళ్లు గొడవలు చేసేవాళ్లు. తిరిగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్ధికి అనే వ్యక్తిని కర్రతో తల పగలకొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్ధికి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బల్లార్షా, చందా దిక్కు పారిపోయాడు. అక్కడ తేయాకు తోటల్లో కూలీపని చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త కొత్త పంటలు పండించటం, వాటిని మార్కెట్‌లో మంచి ధరకు అమ్మటం తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదంవూడులు ఉంటున్న కాకన్‌ఘాట్‌కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు లచ్చుప వద్ద జీతం ఉండగా భీంకు సోంబాయితో పెళ్ళి జరిగింది. ఆ కాలంలో అరకకు ఐదు రూపాయలు, పోడుకు రెండు రూపాయల చొప్పున పన్నును ఆసిఫాబాద్ తహసిల్దార్‌కు కట్టేవారు. కొమురం భీం అప్పటి తహసిల్దార్‌తో మాట్లాడి లచ్చుప చెందిన పన్నెండు ఎకరాల భూమి కేసును కొట్టేయించాడు. అప్పటినుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు.
🔹ఆ గ్రామాలు జోడుణ్‌ఘాట్, పట్నాపూర్, బాబెఝరి, నర్సపూర్, కల్లెగాం, చాల్‌బడి, బోయికన్ మోవాడ్, భోమన్‌గొంది, భీమన్‌గొంది, అంకుసాపూర్, దేవునిగూడ, గొగినవమోవాడ్. దీంతో అటవీ అధికారులు భీం మీద కేసుపెట్టారు. ఓ చౌకిదార్, అమీన్, తొమ్మిది మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. దీంతో భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరుగబడి కొట్టాడు. దీంతో అధికారులు భీంపై కేసుపెట్టారు. గిరిజనులు పోడుచేసుకుంటున్న భూములకు పన్ను కట్టాల్సిన పనిలేదని కోర్టు తీర్పు ఇచ్చిప్పటికీ అధికారుల వేధింపులు తప్పలేదు. భీంను, ఆయన అనుచరులను ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబర్ 1న నైజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులు ఉన్న 12 గ్రామాలను చుట్టిముట్టారు. మొదట భూములకు పట్టాలు ఇస్తామని చెప్పటంతో గిరిజనులు ఇళ్లల్లోంచి బయటకు వచ్చా రు. వీరిని పోలీసులు కొట్టడంతో గొడవ జరిగి కొమురం భీంతోపాటు 11 మంది గిరిజనులు చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువును కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్‌డార్ఫ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన పథకాలను సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కారుకు అందజేశారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీం త్యాగఫలితమే.. కొము రం భీం వారసులు ప్రస్తుతం సిర్పూర్ (యు) మండలం పెద్దదోబలో ఉంటున్నారు. భీం మనుమడు కొమురం సోనేరావ్ ప్రభుత్వం నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. భీం నేలకొరిగిన జోడెఘాట్‌లో కొమురం భీం మునిమనవరాలు కొమురం భీంబాయి నివసిస్తున్నారు. జోడేఘాట్ ఏర్పాట్లు ఏటా అశ్వయుజ కార్తీక పౌర్ణమి రోజు కెరమెరి మండలం జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఆయన 72వ వర్ధంతి దర్బార్‌ను సోమవారం జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హట్టిలోని భీం స్మారక బేస్‌క్యాంప్‌ను రంగులతో అలంకరించి, భీం విగ్రహాన్ని ముస్తాబు చేశారు. హట్టి గ్రామం వద్ద స్వాగత తోరణానికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జోడేఘాట్‌లోని భీం విగ్రహానికి రంగులు వేయించి, సమాధిని పూలతో అలంకరించారు. వర్ధంతి సందర్భంగా 15 వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. భీం వర్ధంతి సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ప్రజాగాయకుడు గద్దర్ రానున్నారని కొమురం భీం యువసేన జిల్లా అధ్యక్షుడు పేందూర్ ప్రభాకర్ తెలిపారు. ‘నిజాం సర్కారే నయం’ ‘కొమురం భీం పోరాడి పొందించిన 12 గ్రామాలను భీంనే ఏలుకొమ్మని నిజాం అనుమతినిచ్చాడు. కానీ ఆదివాసీలందరికీ హక్కులు కావాలని పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంతో నిజాం సర్కారు భీంను చంపేసింది. కానీ ఇప్పుడు సర్కారు ఆదివాసీల కనీసం హక్కులను కూడా హరిస్తోంది. కనీసం తాగేందుకు నీళ్లుకూడా లేకుండా చేస్తోంది. ఈ సర్కారు కన్నా నిజాం సర్కారే నయం. నా భర్త పొందించిన 12 గ్రామాలను ఏలుకొమ్మని అధికారం ఇచ్చాడు’ ఇవి భీం భార్య సోంబాయి బతికున్నప్పుడు అన్న మాటలు. అవును నిజమే నిజాం సర్కారు కేవలం భూములపై, పంటలపై, అడవిపై మాత్రమే ఆంక్షలు విధించి వీటిని చెల్లించాలని ఆదివాసీలపై పెత్తనం చెలాయించేది. కానీ ఇప్పుడున్న సర్కారు ఆదివాసీల కనీస హక్కులను సైతం హరిస్తోంది. 72 ఏళ్ల క్రితం జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడి ప్రాణాలను వదిలిన కొమురం భీం ఆశయాలను ఇంత వరకు మన పాలకులు, అధికారులు నెరవేర్చలేక పోతున్నారు. అటవీ చట్టాల పేరుతో అడవుల్లో ఆదివాసీలను మైదానాలకు తరిమి వేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఆదివాసీల సమస్యలు ఎప్పటికీ తీరవనే ముందు చూపుతోనే ప్రస్తుత సర్కారు కన్నా నిజాం సర్కారే నయమని సోంబాయి అనుకొని ఉంటారు.
👉కొమురం భీము విగ్రహము
డిసెంబరు 17, 2009 న హైదరాబాదులో కొమురం భీము విగ్రహం నెలకొల్పుటకు ప్రభుత్వం ప్రకటించింది
👉కొమరంభీమ్ సినిమా
👉కొమరంభీమ్ 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జోవితం ఆధారంగా నిర్మించిన చిత్రం. భూపాల్ రెడ్డి ప్రధాన పాత్రను పోషించాడు. ఈచిత్రం నిర్మాణానంతరం దాదాపు 20 సంవత్సరాలకు విడుదలయ్యింది. విడుదలకు ముందే ఈ చిత్రం ఉత్తమ దర్శకత్వానికి మరియు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా రెండు నంది పురస్కారములను సాధించింది.