గోన బుద్దారెడ్డి సుప్రసిద్ధ తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూరు రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీ.శ.1294-1300 కాలంలో రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు. గోనబుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు తిక్కన రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణం కాదు.
కుటుంబ నేపథ్యం
కాకతీయుల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు గోన గన్నారెడ్డి వంశస్థులు. బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. బుద్ధారెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి ముత్తాత పేరు గోన రుద్రభూపతి. రుద్రభూపతి తండ్రి గోన కాటరెడ్డి.
జీవిత విశేషాలు
కాకతీయ రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్థమానపురం (నేటి వడ్డెమాన్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోనబుద్దారెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గోన గన్నారెడ్డి వర్థమానపురం రాజధానిగా పాలించాడు.ఇతని తర్వాత గోన బుద్దారెడ్డి అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోనబుద్దారెడ్డి కూతురు కుప్పాంబిక గుండేశ్వరాలయం నిర్మించింది. ఈమె తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతి చెందింది.