విద్యాహక్కు చట్టం
విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి ఈ ఏడాది ఏప్రిల్తో ఆరేళ్ళు పూర్తయింది. మొదటి రెండేళ్ళూ కేంద్రంలోని ఆనాటి యుపిఎ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ప్రకటించి ఆ తర్వాత ముఖం చాటేసింది. బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టాన్ని కావాలనే మర్చిపోయింది. ఆర్టిఇ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ మాత్రం ప్రతి ఏటా పరిస్థితిని తెలియ జేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. విద్యా హక్కు చట్టానికి వందేళ్ళ చరిత్ర ఉంది. బ్రిటీష్ పరిపాలనలో సార్వత్రిక విద్యా వ్యాప్తిపై చర్చ జరిగింది. స్వరాజ్య ఉద్యమానికి నాయకత్వం వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో విద్యపై ప్రత్యేక తీర్మానాలు చేశారు. 1935లో సిమ్లాలో జరిగిన సమావేశంలో గోపాలకష్ణ గోఖలే విద్యాహక్కు తీర్మానం ప్రతిపాదించారు. రాజ్యాంగ ముసాయిదాలో విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని డాక్టర్ అంబేద్కర్ ప్రయత్నించినా మిగిలిన సభ్యులు సమ్మతించకపోవటంతో ఆదేశిక సూత్రాలకే పరిమితమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పదేళ్ళలోనే పద్నాలుగేళ్ల ప్రాయం వరకు పిల్లలకు ఉచిత విద్యను నిర్బంధంగా అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. అందువల్ల విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలనే ఉద్యమాలు 1970వ దశకం నుంచి ఊపందు కున్నాయి. 1992లో ఉన్నికష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పులో విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని ఆదేశించింది. దానితో విద్యాహక్కు ముఖ్యమైన ఎజెండాగా చర్చనీయాంశమైంది. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల్లో ప్రాధాన్యత సంతరించుకున్నది. వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం ఉండగానే 2002లో విద్యా హక్కు బిల్లు ముసా యిదా రచన మొదలైంది. ఐదుసార్లు తిరగరాయబడి 2009 సెప్టెంబర్లో రాజ్యాంగం 86వ సవరణ ద్వారా ఆర్టికల్ 21(ఎ)గా చేర్చబడి ''బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009''గా వెలుగులోకి వచ్చింది. చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోడల్ రూల్స్తో 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
చట్టంలో ఏడు అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూల్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన లక్ష్యాలు : 6-14 ఏళ్ళ వయస్సు బాలలందరినీ పాఠశాలల్లో చేర్చాలి. బాలల నివాసానికి కిలోమీటరు దూరం లోపు ప్రాథమిక (1-5 తరగతులు) పాఠశాల, 3 కిలోమీటర్ల దూరం లోపు ప్రాథమికోన్నత (1-8 తరగతులు) పాఠశాల ఉండాలి. అంతకు మించిన దూరంలో పాఠశాల ఉంటే రవాణా లేదా రెసిడెన్షియల్ సదుపాయం కల్పించాలి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక స్కూళ్ళు నెలకొల్పాలి. పిల్లలను ఆరేళ్ళ వయస్సు కంటే ముందే పాఠశాల విద్యకు అలవాటు చేయాలి. మూడేళ్ళ వయస్సు నుంచే బడిలో చేర్చి నర్సరీ, కేజీ తరహా విద్యా బాధ్యతను స్థానిక ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయివేట్ స్కూళ్ళలో 1వ తరగతిలో ఉండే సీట్లలో 25 శాతం వరకు నైబర్హుడ్లోని పేద పిల్లలను అనుమతించాలి. బడిలో చేరిన విద్యార్థులను 8వ తరగతి పూర్తయ్యే వరకు డిటెయిన్ గానీ, డ్రాపవుట్ గానీ చేయకూడదు. తల్లిదండ్రుల నాయకత్వంలోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎన్ఎంసి) ద్వారా పాఠశాలలను నిర్వహించాలి. ఉపాధ్యాయులు, నిధులు, పర్యవేక్షణ, కరిక్యులమ్, పాఠ్య పుస్తకాలు, దుస్తులు ప్రభుత్వ బాధ్యత. షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనలు, ప్రమాణాల ప్రకారం ఉపాధ్యాయులు, భవనాలు, పనిదినాలు, లైబ్రరీ, లెబోరేటరీ, ఆటస్థలాలు మున్నగు సదుపాయాలు ప్రతి పాఠశాలకూ ఉండాలి. ఈ నిబంధనలు, ప్రమాణాలు పాటించని ప్రయివేట్ పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమైనా, ప్రయివేటైనా ఏ స్కూళ్లో ఏ మీడియంలో బోధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమే.
విద్యాహక్కు చట్టం అమలుకు నిర్ణయించిన గడువు ప్రకారం 2015 ఏప్రిల్ నాటికే అన్ని పాఠశాలలూ చట్టంలోని నిబంధనలు, ప్రమాణాల ప్రకారం పూర్తిస్థాయిలో పనిచేస్తూ ఉండాలి. గడువు దాటిపోయి మరో ఏడాది గడిచినా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. దేశ జనాభాలోని 6-14 ఏళ్ళ పిల్లల్లో 98 శాతం మంది (19.7 కోట్లు) పాఠశాలల్లో నమోదై నట్టు కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో ఉన్నది. చట్టం అమల్లోకి వచ్చిన 2010-11లో 13,62,324 పాఠశాలలు ఉండగా 2014-15 నాటికి 14,45,807 (83,483)కి పెరిగాయి. నమోదు శాతం, స్కూళ్ల సంఖ్య పెరిగినా 8వ తరగతి పూర్తికాకముందే మధ్యలోనే బడిమానేస్తున్న వారి సంఖ్య (41 శాతం) కూడా గణనీయంగానే ఉన్నది. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలు 9.05 శాతమే. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శాతం కూడా లేదని తెలుస్తోంది. నిధుల లేమి ప్రధానమైంది. అదనంగా కావాల్సిన వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎన్టైటిల్మెంట్స్ మున్నగు ఖర్చుల కోసం ఏడాదికి రూ.44 వేల కోట్లు కావాలని మజుందార్ కమిటీ సూచించింది. అందులో సగం కూడా ఏ సంవత్సరమూ కేటాయించలేదు. మీదు మిక్కిలి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన రెండు వార్షిక బడ్జెట్లలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే సర్వ శిక్షా అభియాన్కు నిధులు తగ్గిపోయాయి. 2015-16లో రూ.22,015 కోట్లు, 2016-17లో రూ.22,500 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపులు 2014-15 బడ్జెట్లో కేటాయించిన రూ.31,635 కోట్ల కంటె 28.5 శాతం తక్కువ. కేంద్రం బాటలో పయనిస్తున్న చాలా రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా విద్యకు బడ్జెట్ తగ్గించాయి. దానితో పాఠశాలల సమస్యలు నానాటికీ పెరిగి పోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దివాళా తీస్తున్నాయి. ప్రయివేట్ స్కూళ్ళు, వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య ఆయేటికాయేడు పెరిగిపోతోంది. ఉచితంగా అందించాల్సిన విద్య ఖరీదైన సరుకుగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పది లక్షల ఉపాధ్యాయుల కొరత కొనసాగుతోంది. 8.3 శాతం పాఠశాలలు ఒక్క టీచర్తోనే నెట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన చదువు నానాటికీ కనుమరుగవుతోంది. విద్యార్థుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలు కొడిగడుతున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవటం వల్లనే దేశ ప్రగతికి పట్టుగొమ్మగా ఉండాల్సిన ప్రాథమిక విద్య పతనమైపోతోంది. ఆత్మవిమర్శ చేసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా విద్యాహక్కు చట్టాన్నే నిర్వీర్యం చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా వ్యాపారుల దాడి జరుగుతోంది.
నాన్ డిటెన్షన్ విధానాన్ని ఎత్తేయాలని కేంద్రంతో పాటు బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి. నాన్ డిటెన్షన్ విధానం అమలు చేసినా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేందుకు తోడ్పడే నిరంతర సమగ్ర మూల్యాంకన (సిసిఇ) పద్ధతి పక్కనబెట్టాలని కొంత మంది ఉపాధ్యాయులు, ప్రయివేట్ స్కూళ్ళ యాజమాన్యాల అసహనం. ప్రయివేట్ స్కూళ్ళలో పేద కుటుంబాల విద్యార్థు లకు రిజర్వేషన్ల సదుపాయాన్ని రద్దు చేయాలని తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ విద్యాసంస్థలు, కొన్ని సంఘాలు, సంస్థలు, కొంత మంది విద్యావేత్తల డిమాండ్. తక్కువ మంది విద్యార్థులు అనే పేరుతో ప్రతి ఏటా కొన్ని వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయటం వల్ల గడిచిన ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా లక్ష పాఠశాలలు మూతబడ్డాయి. నాన్ డిటెన్షన్, ప్రయివేట్లో రిజర్వేషన్లు నిబంధనల తొలగింపుకు చట్టంలో సవరణల కోసం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.