నావిక్
-ప్రస్తుతం నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్ (నావిక్)గా నామకరణం చేసిన భారతదేశ ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థను మిలటరీ, పౌర ప్రయోజనార్థం, భూ, జల, వాయు మార్గాల్లో మార్గనిర్దేశనం కోసం సొంత టెక్నాలజీతో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
-కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా జీపీఎస్ సేవలను అందించడానికి నిరాకరించడంతో మరోసారి ఆ పరిస్థితులు ఏర్పడకుండా తన శక్తిసామర్థ్యాలపై నమ్మకంతో 7 ఉపగ్రహాల శ్రేణిలో మొదటిదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎను 2013, జూలై 1న ప్రయోగించారు. ప్రస్తుతం ప్రయోగించిన ఉపగ్రహంతో అంతరిక్షంలో ఉపగ్రహాలను కొలువుదీర్చే కార్యక్రమం పూర్తయ్యింది. ప్రయోగించిన ఏడు ఉపగ్రహాల్లో 4 భూ అనువర్తన కక్ష్యలో, 3 ఉపగ్రహాలు (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ - 1సి, 1ఎఫ్, 1జి) భూస్థిర కక్ష్యల్లో పరిభ్రమిస్తాయి.
-భూ అనువర్తన కక్ష్యలో పరిభ్రమించే 4 ఉపగ్రహాలు 8 ఆకారంలో పరిభ్రమిస్తాయి. ఉపగ్రహాల్లో సమయాన్ని కచ్చితంగా గణించడానికి రుబీడియం పరమాణు గడియారాలను అమర్చారు.
నావిక్ ప్రయోజనాలు
-నావిక్ వ్యవస్థ ద్వారా జీపీఎస్ తరహాలో రూపొందించిన ప్రత్యేక పరికరాలు, మొబైళ్ల సాయంతో మిలటరీ, సాధారణ పౌర అవసరార్థం నావిగేషన్ సమాచారాన్ని ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతికూల పరిస్థితుల్లోనైనా నిరంతరాయంగా కచ్చితత్వంతో అందించవచ్చు.
-ఈ వ్యవస్థ మిలటరీ అవసరాల కోసం రిస్టిక్టెడ్ సర్వీసులను సాధారణ పౌరులకు స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్‌ల రూపంలో నావిగేషన్ సదుపాయాల్ని కల్పిస్తుంది.
-విమానాలు, నౌకలు ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన రాడార్ల పరిధుల్లో దూరం, సమయం ఎక్కువైనా ప్రయాణించక తప్పని పరిస్థితి. నావిక్ వ్యవస్థ ద్వారా ఈ ఇబ్బంది తప్పి దూరం, సమయాలతో పాటు ఖర్చు కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
-వాహనాల గమనాన్ని పర్యవేక్షించుటకు, నేవీకి సంబంధించిన ఫ్లీట్ నిర్వహణలో ఉపయుక్తం.
-అత్యవసర పరిస్థితుల్లో, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అవసరమైన ప్రాంతాలకు, వ్యక్తులకు వివిధ వ్యవస్థలు త్వరగా చేరుకునేలా దారిచూపి బాధితులకు సత్వర సహాయం అందేలా చేస్తుంది.
-మిస్సైల్ టెక్నాలజీలో, మిస్సూల్స్‌కు అవసరమైన నావిగేషన్‌ను అందించి వాటి కచ్చితత్వాన్ని పెంపొందించగలదు.
-మొబైల్ ఫోన్లతో అనుసంధానమైన జీపీఎస్ తరహా సేవలను అందిస్తూ పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయవచ్చు. దేశ, విదేశీ పర్యాటకులకు గమన నిర్దేశ సౌకర్యాలను అందిస్తూ వారి సమయాన్ని ఆదా చేయడమేగాక మరిన్ని ప్రదేశాలను తక్కువ సమయంలో పర్యటించేలా చేయవచ్చు.
-సహజ వనరులను వెలికితీసేందుకు ఉద్దేశించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమాచారాన్ని నావిక్ వ్యవస్థతో విశ్లేషింపజేసి, ఆ వనరులున్న ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు సహాయపడగలదు.
-మత్య్సకారులకు చేపలు అధికంగా ఉండే ప్రాంతాలను సూచిస్తూ ఆ ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకొనేలా సూచనలందిస్తుంది.
-పర్వతారోహకులకు పర్వతారోహణలో, అడవుల వంటి వివిధ ప్రాంతాల్లో సాహస యాత్రలు నిర్వహించే బృందాలకు గమన నిర్దేశణలో సహాయకారిగా ఉంటుంది.
భారత్‌లో నావిక్ వ్యవస్థకు ముందు నావిగేషన్ సేవలు
-విమానయానంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ల నియంత్రణ సమన్వయానికి వీలుగా రీజినల్ నావిగేషన్ సిస్టం అభివృద్ధికి ఇస్రో, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా కృషి చేశాయి. దీనిలో భాగంగా ప్రధాన విమానాశ్రయాల్లో 2007లో టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ సిస్టంను ఏర్పాటు చేశారు.
-ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టం లేదా శాట్‌నావ్ వ్యవస్థ ఏర్పాటుకు ఇస్రో, ఏఏఐ సంయుక్తంగా జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మింటెడ్ నావిగేషన్- గగన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
-ఇందుకోసం తొలి గగన్ పేలోడ్‌ను జీ శాట్-8, జీ శాట్-10, జీ శాట్-15 ఉపగ్రహాలతో పాటుగా అమర్చి ప్రయోగించారు. ఈ ప్రయోగాలు 2011 మే 21, 2012 సెప్టెంబర్ 29, 2015 నవంబర్ 10న జరిగాయి