1969 ఉద్యమం తర్వాత..తెలంగాణలో సంఘటనలు,పర్యవసానాలు
ఆంధ్ర ప్రాంతంతో తెలంగాణను కలిపి 1956లో బలవంతంగా విశాలాంధ్రను ఏర్పాటుచేసిన క్షణం నుంచి తెలంగాణపై ఆంధ్ర పెత్తనం పెరుగుతూ వచ్చింది. 1969 నాటికి తెలంగాణవాదులపై అణచివేత తారాస్థాయికి చేరటంతో మొదటిసారి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. దోపిడీని నిసరిస్తూ తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించిన ఉద్యమాన్ని వలస పాలకులు అధికార బలంతో అణచివేశారు. అందుకు కొందరు తెలంగాణ ఉద్యమ నాయకుల వ్యక్తిగత స్వార్థపూరిత నిర్ణయాలు కూడా తోడు కావటంతో ఉద్యమం చల్లారిపోయింది. అయితే, ఆ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరిగాయి. వాటి వరుసక్రమం నిపుణ పాఠకుల కోసం..
తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా పాల్వంచ వేదికయ్యింది. పాల్వంచ థర్మల్‌పవర్ స్టేషన్‌లో తెలంగాణ ప్రాంతం వారిని కాకుండా ఆంధ్రకు చెందిన ఉద్యోగులను ఎక్కువ మందిని తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రామదాసు ఈ అన్యాయాలను నిలదీశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసులు పెట్టి నానా హింసకు గురిచేశారు.
ఆ తరువాత 1969, జనవరి 9న పాల్వంచలోని గాంధీచౌక్ వద్ద రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరవధిక దీక్షను ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా ప్రజలు నిరసనలు, ర్యాలీలు తీశారు. ఖమ్మం జిల్లాలో మొదలైన ఆందోళన క్రమంగా నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు పాకింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు సర్వసభ్య సమావేశం నిర్వహించాయి. జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పాటయ్యింది. జనవరి 15 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే హైదరాబాద్‌లో కొందరు ప్రముఖులు సమావేశమై తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఖమ్మంలో దీక్ష చేపడుతున్న రవీంద్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణ వేడెక్కింది. జనవరి 16న విద్యార్థులు హైదరాబాద్‌లో ఊరేగింపు తీశారు. తెలంగాణ మొత్తం నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీంతో ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి తాత్కాలికంగా వేడిని తగ్గించడానికి 1969 జనవరి 19న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించారు.
1) ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల లెక్క తేల్చడం.
2) తెలంగాణ మిగులు నిధుల లెక్క తేల్చడం.
1969 జనవరి 21న జీవో 36ను ప్రభుత్వం విడుదల చేసింది. 1969 ఫిబ్రవరి 28లోపు నాన్‌ముల్కీలను వెనక్కి పంపుతామని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టంగా చెప్పింది.
ఒకవైపు తెలంగాణ రక్షణ కోసం జీవోలు ఇస్తూ మరోవైపు సీఎం బ్రహ్మానందరెడ్డి కుట్రలు పన్నారు. ఆయన ప్రోత్సాహంతో 1969 జనవరి 31న జీవో 36కు వ్యతిరేకంగా హైకోర్టులో తెలంగాణ ఉద్యోగినులు రిట్ దాఖలు చేశారు. తమ భర్తలు ఆంధ్రోళ్లని, జీవో 36ను అమలు చేస్తే తమ కుటుంబాలు ఇబ్బంది పడతాయని వాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుమార్ లలిత్ అనే అధికారితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మార్చిలోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 4500 మంది ఆంధ్ర ఉద్యోగులు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో పనిచేస్తున్నారని చెప్పింది.
1969 ఫిబ్రవరి 3న హైకోర్టు తీర్పు వెల్లడించింది. జీవో 36 రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది.
1969 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు జీవో 36 అమలు నిలిపేయాలని స్టే ఇచ్చింది.
కోర్టుల తీర్పులు, ప్రభుత్వ కుట్రలు తెలంగాణ ఉద్యమకారులకు కోపాన్ని తెప్పించాయి.
1969, ఫిబ్రవరి 20న హైకోర్టు మరో తీర్పు ఇచ్చింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమే అన్నది. జీవో 36ను సమర్థించింది. అయితే అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాల్లో చేరిన ఆంధ్ర ఉద్యోగులను వెనుకకు పంపొద్దని ఆ పోస్టులకు సమానంగా తెలంగాణ కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని ఆదేశించింది.
1969 ఫిబ్రవరి 28న ముల్కీ నిబంధనలు మరో ఐదేండ్లు పొడిగించడానికి వీలు కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించింది.
దీక్ష చేపట్టిన రవీంద్రనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో 17 రోజుల తర్వాత విద్యార్థి నాయకుడు వెంకట హైమారెడ్డి చొరవతో దీక్ష విరమించారు. కానీ తెలంగాణ శాంతించలేదు.
జనవరి 24న సదాశివపేటలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శంకర్ అనే యువకుడు గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
జనవరి 30న గజ్వేల్‌లో జరిగిన కాల్పుల్లో నర్సింహులు అనే విద్యార్థి చనిపోయాడు.
1969 ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి ఏర్పడింది. అధ్యక్షుడిగా మదన్‌మోహన్ ఎన్నికయ్యాడు.
1969 మార్చి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఒక సమావేశం జరిగింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని టీ పురుషోత్తమరావు ఆవిష్కరించారు.
1969 మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణవాదులు అసహనానికి గురయ్యారు. ఆ రోజే బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వాంఛూ అధ్యక్షతన కమిటీని వేసింది. ఆంధ్ర పాలకుల తీరుకు నిరసనగా అదే రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు.
1969 ఏప్రిల్ 11న జస్టిస్ భార్గవ కమిటీని ప్రభుత్వం నియమించి కుమార్ లలిత్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై విచారణ చేయమంది. కమిటీల మీద కమిటీలు తెలంగాణ ప్రజలకు ఆగ్రహం కలిగించాయి. ఉద్యమం ఊపందుకుంది. విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చారు.
1969 ఏప్రిల్ 11లోగా తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఆదిరాజు వెంకటేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా ఆమోదించారు.
సికింద్రాబాద్‌లోని అంజలి టాకీస్ చౌరస్తా వద్ద బూరుగు మహదేవ్ హాలులో కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర సమైక్యతను కోరుతూనే తెలంగాణ రక్షణలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమ నాయకులను ఉద్యమాన్ని విమర్శించింది. తెలంగాణవాదులకు కమ్యూనిస్టులకు మధ్య గొడవ జరిగింది. పోలీసులు లాఠీచార్జి చేస్తే 27 మందికి దెబ్బలు తగిలాయి. తెలంగాణవాదులను పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. తెలంగాణవాదుల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్‌లో సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యేలు అచ్యుతరెడ్డి, టీ అంజయ్య, మాణిక్‌రావు, హషీమ్ పాల్గొన్నారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. ఉద్యమ తీవ్రత ఢిల్లీకి చేరింది. ఇందిరాగాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, నూకల రామచంద్రారెడ్డి, జే చొక్కారావు హాజరయ్యారు. ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడానికి అష్టసూత్ర పథకాన్ని రూపొందించింది.
1969 ఏప్రిల్ 12న పార్లమెంటులో అష్టసూత్ర పథకం ప్రకటించింది.
అష్టసూత్రాలు
1) ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఉన్నతాధికారి సంఘం ఏర్పాటు.
2) కోల్పోయిన తెలంగాణ నిధులు సమకూర్చాలి.
3) తెలంగాణప్రాంత అభివృద్ధికి సీఎం అధ్యక్షతన ప్రణాళికలు రూపొందించాలి.
4) ప్రణాళిక సంఘం సలహాదారు అధ్యక్షతన అధికారుల కమిటీ ఏర్పాటు.
5) కమిటీలో అధికారులకు ఎక్కువ అధికారాలను ఇచ్చారు.
6) తెలంగాణలో ఉద్యోగాలు స్థానికులకే చెందాలి.
7) తెలంగాణ ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం.
8) తెలంగాణ అభివృద్ధికి కేంద్రం శ్రద్ధ వహిస్తుంది.
ఈ పథకం తెలంగాణవాదులను సంతృప్తిపర్చలేకపోయింది. తెలంగాణలో నిరసనలు కొనసాగాయి. దీంతో అష్టసూత్ర పథకం అమల్లోకి రాలేదు.
1969 ఏప్రిల్ 21న మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ ప్రకటన చేసి ఉద్యమంలోకి వచ్చాడు.
తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు మదన్‌మోహన్ పదవి నుంచి తప్పుకోవడంతో 1969 మే 22న అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యాడు.
1969 మే 25న మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలులో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం బ్రహ్మానందరెడ్డి ప్రసంగం ఉద్రేకాలను రెచ్చగొట్టింది. సీఎం తిరిగి హైదరాబాద్ వస్తుంటే అడుగడుగునా నిరసన తెలిపారు. ఆ రోజు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.
1969 మే 26న కాల్పులకు నిరసనగా సామూహిక సత్యాగ్రహాలు కొనసాగించింది తెలంగాణ ప్రజాసమితి.
సీఎం బ్రహ్మానందరెడ్డి ఎన్జీవో నాయకుడు కేఆర్ ఆమోస్‌ను డిస్మిస్ చేసి ఉపాధ్యాయ సంఘాన్ని రద్దు చేశాడు.
ప్రభుత్వం సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంలో చంచల్‌గూడ జైల్లో సత్యాగ్రహ ఖైదీలకు ఆంధ్రా ఖైదీలకు గొడవ జరిగింది. సత్యాగ్రహ ఖైదీలను పరామర్శించడానికెళ్లిన తెలంగాణ సమితి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ వార్త తెలంగాణ అంతటా వ్యాపించింది.
1969 మే 1న గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడానికెళ్లిన నాయకులపై కూడా పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు కాల్పులు జరిపితే 20 మంది ఉద్యమకారులు చనిపోయారు.
1969 జూన్ 2న ప్రభుత్వ దమనకాండకు నిరసనగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ సంపూర్ణంగా జరిగింది.
1969 జూన్ 3న గూండాయిజం వ్యతిరేక దినం జరపాలని తెలంగాణ ప్రజాసమితి నిర్ణయించింది. ఉద్యమ మంట ఢిల్లీకి చేరింది. ఢిల్లీ నుంచి సీఎంకు పిలుపు వచ్చింది.
1969 ఉద్యమం
May 13, 2016
Tags