శ్రీనాధుడు :
13, 14 సంవత్సరాల వయసులో "మరుత్తరాజు కథ"ను పద్యకావ్యంగా రచించిన శ్రీనాధుడు 1377 ప్రాంతంలో జన్మించాడు. ఇతని జన్మస్థలం కాల్పట్టణం. కవిత్రయం తరువాత చెప్పుకోవలసిన కవి కులగురువు శ్రీనాధుడు. కొండవీటి రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డి వద్ద విద్యాధికారిగా శ్రీనాధుడు 1402 నుండి 1420 వరకు పదవి నిర్వహించాడు. రెడ్డి రాజ్య పతనం అనంతరం రాజాశ్రయం కోసం రాజమండ్రి రెడ్డిరాజులను ఆశ్రయించాడు. వారు ఆశ్రయం ఇవ్వకపోవడంతో పల్నాడుకు వెళ్ళాడు. పల్నాడులో సంచరిస్తూ "పల్నాటి వీరచరిత్ర"ను ఆశువుగా ద్విపదలో రచించాడు. పల్నాడు నీటి కరువు ఉండడంతో
సిరిగలవానికి జెల్లును - దరుణులు బదియారువేల దగబెండ్లాడన్
దరిపెమున కిద్దరాండ్రా - పరమేశా గంగ విడుము పార్వతి చాలున్" ...
అని పరమేశ్వరుణ్ణి ఎత్తిపొడిచాడు. 1429 ప్రాంతాల్లో దాక్షారామం వెళ్ళాడు. తన బంధువైన బెండపూడి అన్నమంత్రి ద్వారా రెడ్డి రాజుల ప్రాపకం పొందాడు. అయితే అందుకు ప్రతిగా అన్నమంత్రి "శివపురాణం"ను తనకు అంకితం కావించుకున్నాడు. "శ్రీహర్ష నైషధము"ను ఆంధ్ర భాషలో శ్రీనాధుడు రచించాడు. అయితే కొన్ని ఆయువుపట్టు శ్లోకాలను అతడు యథాతథంగా తెలుగులోకి దించి, చివరన "డుమువులు" చేర్చడంతో సంస్కృత పండితులు నీ డుమువులు నువ్వు తీసుకొని మా నైషధం మాకిచ్చెయ్ అన్నారని చెప్పుకొంటారు. రాజమండ్రి పండితుల మూకుమ్మడి దాడి ఎక్కువ కావడంతో కర్ణాట రాజ్యంలో తన ప్రతిభ రాణిస్తుందని విజయనగరం బయల్దేరాడు. రెండవ దేవరాయలు విజయనగరాన్ని పాలిస్తున్న రోజులవి. అక్కడ డిండిమభట్టుతో వాదన సలిపి అతన్ని ఓడించి "కవి సార్వభౌమ" బిరుదును పొందాడు. "హర విలాసము", "భీమేశ్వర పురాణము", "క్రీడాభిరామం", "కాశీఖండము", "శివరాత్రి మహాత్మ్యము" వంటి అనేక గ్రంధాలను రచించాడు.