ఎవరెస్ట్‌పై ఏడోసారి
ప్రపంచంలో అతిఎత్తైన ఎవరెస్ట్ శిఖరం చేరుకోవడం.. కొందరి జీవితాశయం! ఆ ఆశయాన్ని ఛేదించే వాళ్లు చాలా తక్కువ. అలాంటిది ఆ శిఖరాన్ని ఏడుసార్లు అధిరోహించారు లక్‌పా షెర్పా. గత శుక్రవారం తన ఏడో ఎవరెస్ట్ యాత్రతో.. అత్యధిక సార్లు ఆ శిఖరాగ్రం చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. షెర్పా అనే పేరు వినగానే మనకు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సాయపడే కుటుంబాలు గుర్తుకొస్తాయి. నేపాల్-చైనా సరిహద్దుల్లోని హిమాలయ ప్రాంతాలు వీరి ఆవాసాలు. లక్‌పా కూడా ఆ ప్రాంతానికి చెందినవారే. నేపాల్‌లోని తూర్పు సంఖువాసబా జిల్లా పరిధిలోని ఓ గ్రామం తనది. 11 మంది పిల్లలున్న కుటుంబంలో పుట్టింది లక్‌పా. ప్రపంచంలో అయిదో అతిఎత్తైన పర్వతం.. మకలూ ఇక్కడే ఉంటుంది. లక్‌పా బాల్యం దాని అధిరోహణలోనే గడిచిందని చెప్పాలి. అయితే తన ముప్పయ్యో ఏట.. 2000లో కాని ఎవరెస్ట్ ఎక్కలేదు లక్‌పా! ఆ ఏడాది ఎవరెస్ట్‌ని ఎక్కి.. బతికి బట్టకట్టిన తొలి నేపాలీ అమ్మాయిగానూ గుర్తింపూ సాధించారు. 1993లో పసంగ్ లాము షెర్పా ఈ ఘనత సాధించినా ఆమె ఎవరెస్ట్ నుంచి తిరిగొచ్చే దారిలో ప్రాణాలు విడిచారు! లక్‌పా తొలి అధిరోహణ తర్వాత ఈ పన్నెండేళ్లలో ఆరుసార్లు ఎవరెస్ట్‌ని అధిరోహించారు. 2002లో అమెరికాకు చెందిన పర్వతారోహకుడు జార్జి జిమారిస్కుని పెళ్లాడి.. అక్కడే స్థిరపడ్డారు. ఆయన క్యాన్సర్ బాధితుడు. దాంతో అక్కడే చిన్నాచితక పనులు చేస్తూ వస్తున్నారు లక్‌పా. వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణకు పోగా.. మిగతా డబ్బంతా పర్వతారోహణకే వెచ్చిస్తున్నారు!