క్లోమం
క్లోమం జీర్ణాశయం కింది భాగాన, చిన్న పేగులోకి తెరుచుకొని ఉంటుంది. ఇది ఒక మిశ్రమ గ్రంథి. దీనిలోని అంతస్రావిక భాగం లాంగర్‌హన్‌స పుటికలు. క్లోమంలోని ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్‌ను, బీటా కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెండు హార్మోన్లు కలిసి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. గ్లూకగాన్ రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగి, శరీర అవయవాల పనితీరు దెబ్బతినే రుగ్మతను ‘మధుమేహం’ (Diabetes mellitus) అంటారు. ఇది రెండు రకాలు.
పూర్తిగా ఇన్సులిన్ ఏర్పడక పోవడం ద్వారా సంభవించేది టైప్-1 మధుమేహం. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా సరిగా పనిచేయకపోవడం ద్వారా సంభవించేది రెండో రకం మధుమేహం. రక్తంలో చక్కెర శాతం పెరిగే కొద్దీ రక్త సరఫరాకు అవరోధం ఏర్పడి, వివిధ అవయవాల పనితీరు దెబ్బతింటుంది. గాయాలు తొందరగా మానవు. పాదాల్లో అల్సర్లు ఏర్పడతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. కంటి చూపు మందగిస్తుంది (డయాబెటిక్ రెటినోపతి). చివరకు గుండె పనితీరు దెబ్బతిని, వ్యక్తి కోమా స్థితిలోకి చేరి మరణిస్తాడు.