దేశంలోని క్షేత్రస్థాయి స్థానిక ప్రభుత్వ విభాగాలను బలోపేతం చేయడానికి
73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు (1992) ఎంతో దోహదపడుతున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి (పంచాయతీ రాజ్ సంస్థలు) వివరిస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి (పురపాలక, నగర పాలక సంస్థలు) వివరిస్తుంది. ఈ రెండు సవరణ చట్టాలు 1993లో అమల్లోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ చట్టాలు మైలురాళ్లని చెప్పవచ్చు.
చారిత్రక నేపథ్యం :
మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్య ఆశయాన్ని భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 40వ ప్రకరణలో పొందుపర్చారు. ఈ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయతీరాజ్ సంస్థలను నిర్వహించి, అవి స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి. సామాన్య ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిథ్యం కల్పించడానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. ఈ సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదుల లాంటివి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1952లో సమాజాభివృద్ధి పథకం (COMMUNITY DEVELOPMENT PROGRAMME) అమలు కోసం తగిన చర్యలు తీసుకుంది. 1953లో కేంద్ర ప్రభుత్వం (NATIONAL EXTENSION SERVICE SCHEME - NESS) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. 1957లో బల్వంత్ రాయ్‌మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలనా సంఘాన్ని నియమించింది. సమాజాభివృద్ధి పథకాల వైఫల్యానికి దారితీసిన పరిస్థితుల గురించి విచారణ జరపాల్సిందిగా ఈ సంఘాన్ని ప్రభుత్వం కోరింది.
-బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ అనేక సిఫారసులు చేసింది. వాటిలో ప్రధానమైనవి గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ వంటి మూడంచెల ప్రాతినిథ్య సంస్థలను ప్రవేశపెట్టడం.
-అశోక్ మెహతా కమిటీ - 1978
-జీవీకే రావ్ కమిటీ - 1985
-ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ - 1986 మొదలైనవి
-ఈ కమిటీలు అనేక రకాల సూచనలు ఇచ్చాయి. ఈ సూచనలు వాస్తవానికి 73, 74 రాజ్యాంగ సవరణలకు మార్గదర్శకత్వం వహించాయి. వీటిలో ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ ప్రధానమైనది. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగపరమైన గుర్తింపును ఇచ్చి వాటి ఔన్నత్యాన్ని, సమగ్రతను కాపాడాలని, సింఘ్వీ కమిటీ సూచించింది.
పట్టణ, పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు
-74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
-పట్టణస్థాయి స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన హోదాను కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ప్రధాన లక్ష్యమని చెప్పవచ్చు. మున్సిపాలిటీస్ అనే శీర్షికతో IX-A భాగాన్ని ఈ చట్టం రాజ్యాంగంలో ఏర్పర్చింది. ఈ భాగంలో 18 ప్రకరణాంశాలు (243 P నుంచి 243 2 (G)) ఉన్నాయి. మున్సిపాలిటీల అధికారాలు, విధులు (మొత్తం 18 అంశాలు గల 12వ షెడ్యూల్‌ను కూడా ఈ చట్టం రాజ్యాంగంలో చేర్చింది. పట్టణ, నగర పాలన సంస్థలకి ఈ చట్టం రాజ్యాంగపరమైన హోదానిచ్చింది. తద్వారా ఈ సంస్థలకు న్యాయరక్షణ ఏర్పడింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్ట నిబంధనలను అనుసరించాల్సిన బాధ్యత ఏర్పడింది.
-74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992.. 1993 ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొందింది. 1993 జూన్ 1న అమల్లోకి వచ్చింది.
ప్రధాన లక్షణాలు
-73, 74 రాజ్యాంగ సవరణల చట్టాలు స్థానిక ప్రభుత్వాలను రాజ్యాంగపరంగా బలపర్చడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ రెండు సవరణల చట్టాల్లోని అనేక ప్రధానాంశాలు ఒకే తీరులో ఉంటాయి. ఉదాహరణకు ఎన్నికల అంశాలు, రిజర్వేషన్లు, ఎన్నికల కమిషన్, ఆర్థిక సంఘం మొదలైనవి 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఒకే తీరుగా కనిపిస్తాయి. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాంగంలో IX-A భాగం చేర్చబడిందని, ఇందులో 243 (P) నుంచి 243 (IG) ప్రకరణలున్నాయని, ఈ భాగం మున్సిపాలిటీస్ అనే శీర్షిక ద్వారా వివిధ పట్టణ స్థానిక సంస్థల గురించి వివరిస్తుందని తెలుసుకున్నాం. 243P ప్రకరణలో చట్టంలో ఉపయోగించబడిన అనేక పదాలకు నిర్వచనాలున్నాయి. ఇతర ప్రకరణలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తాయి.
పట్టణ స్థానిక ప్రభుత్వాలు
-మున్సిపాలిటీల వ్యవస్థ (243-Q)
-243-Q ప్రకరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా మూడు తరహాల మున్సిపాలిటీలుండాలి. అవి...
-నగర పంచాయతీ (గ్రామీణ ప్రాంత స్థాయి నుంచి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతం)
-మున్సిపల్ కౌన్సిల్ (చిన్న పట్టణ ప్రాంతం)
-మున్సిపల్ కార్పొరేషన్ (బాగా విస్తరించిన పట్టణ ప్రాంతం)
మున్సిపాలిటీల నిర్మాణం (243-R)
-మున్సిపాలిటీల నిర్మాణం గురించి ఈ చట్టం వివరిస్తుంది. దీని ప్రకారం మున్సిపల్ స్థానాలకు ప్రతినిధుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఇందుకోసం మున్సిపాలిటీలను వార్డులుగా విభజిస్తారు. వార్డుల్లోని ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
వార్డు కమిటీలు (243-S)
-మూడు లక్షలు లేదా అంతకుమించి ఉన్న పురపాలక సంస్థల్లో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో శాసనాలను రూపొందించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు పొందుతాయని 243-S ప్రకరణ పేర్కొంటుంది.
-సీట్ల రిజర్వేషన్లు (243-T) : మున్సిపాలిటీ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి సీట్ల రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాక 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కూడా చట్టం నిర్దేశిస్తుంది.
-మున్సిపాలిటీల పదవీకాలం (243-U) : ఈ చట్టం మున్సిపాలిటీల పదవీకాలాన్ని ఐదేండ్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏ కారణం రీత్యానైనా పదవీకాలం ముగియకముందే మున్సిపాలిటీ రద్దయితే తిరిగి ఆరుమాసాల్లో వాటికి ఎన్నికలు జరిపించాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది.
అనర్హతలు (243-V)
-పురపాలక సంస్థల సభ్యులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అంశాలను ఈ చట్టం నిర్దిష్టంగా పేర్కొంటుంది. దీని ప్రకారం అనర్హతలకు సంబంధించిన వివాదాలను రాష్ట్ర శాసనసభ ఏర్పర్చిన ఒక ప్రత్యేక అథారిటీ నిర్ణయిస్తుంది.
మున్సిపాలిటీల అధికారాలు, హక్కులు (243-W)
-మున్సిపాలిటీలకు అధికారాలు, హక్కులు, బాధ్యతలను రాష్ట్ర శాసనసభలు ప్రత్యేక శాసనాల ద్వారా రూపొందించి ఈ ప్రభుత్వాలను స్వయం సంస్థలుగా తీర్చిదిద్దాలని 243-W ప్రకరణ పేర్కొంటుంది. 18 అంశాలతో మున్సిపాలిటీలకు గల అధికారాలు, హక్కులు, బాధ్యతలను ఈ చట్టం 12వ షెడ్యూల్‌లో పేర్కొంటుంది.
-ఆదాయ వనరులు (243-X) : మున్సిపాలిటీలకు గల వివిధ ఆదాయ వనరుల గురించి ఈ చట్టంలో పేర్కొంది. కొన్ని అంశాలకు సంబంధించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్ర సంఘటిత నిధి నుంచి లభించే గ్రాంట్-ఇన్-ఎయిడ్ మొదలైనవి మున్సిపాలిటీలకు గల ఆదాయ వనరులు.
-ఆర్థిక సంఘం (243-Y) : 243-Y ప్రకరణ ప్రకారం పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్షపై ఒక ఆర్థిక సంఘం ఏర్పడింది. ఈ ఆర్థిక సంఘం మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని కూడా సమీక్షించి, తగిన విధి విధానాల సూచనతో రాష్ట్ర గవర్నర్‌కు నివేదికను పంపించాలని చట్టం పేర్కొంటుంది.
లెక్కల తనిఖీ ఖాతాలు (243-Z): మున్సిపాలిటీల పద్దులు, వ్యయాలను ఆడిటింగ్ జరపడానికి రాష్ట్ర శాసనసభ తగిన చట్టాలు అమలు చేయాలని ఈ చట్టం పేర్కొంటుంది.
-మున్సిపాలిటీలకు ఎన్నికలు (243-ZA): ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ నియంత్రణకు సంబంధించిన అధికారాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుంది. రాజ్యాంగ పరిధికి లోబడి మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను రాష్ట్ర శాసనసభ రూపొందించాలి.
-కేంద్ర పాలిత ప్రాంతాల్లో మున్సిపాలిటీలు (243-ZB): ఈ చట్టం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఏర్పాటు, రద్దుకు సంబంధించిన వ్యవహారాలు మొదలైనవి రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఉంటాయి.
-కొన్ని ప్రాంతాల మినహాయింపు (243-ZC): కొన్ని నిర్దిష్ట షెడ్యూల్ ప్రాంతాలకు, ఆదివాసి ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదని 243-ZC పేర్కొంటుంది. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌లోని కొండ ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటుచేసిన డార్జిలింగ్, గుర్ఖాహిల్ కౌన్సిల్ అధికారాలను ఈ భాగం ప్రభావితం చేయదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంటు ఈ భాగాన్ని వర్తింపచేయడానికి శాసనాలు చేయవచ్చు.
-జిల్లా ప్రణాళికా సంఘం (243-ZD) : జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక ముసాయిదాను ఏర్పాటుచేయడానికి ప్రతి జిల్లాలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని రాష్ట్ర శాసనసభ ఏర్పాటుచేయాలని ఈ చట్టంలో పేర్కొంది.
-మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం (243-ZE) : ఈ చట్టం ప్రకారం మెట్రోపాలిటన్ ప్రాంతానికి ఒక మెట్రోపాలిటిక్ ప్రణాళికా సమగ్రాభివృద్ధికి అవసరమైన ముసాయిదా ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్ర శాసనసభ దాని నిర్మాణ బాధ్యతలు మొదలైన వాటి గురించి తగిన శాసనాలు రూపొందించాలి.
-కొన్ని చట్టాల కొనసాగింపు (243-ZF) : 74వ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు వాడుకలో ఉన్న చట్టాలన్నీ శాసనసభ ప్రత్యేకంగా రద్దు చేయకపోతే, కొనసాగుతాయని 243 - ZF ప్రకరణ పేర్కొంటుంది.
-పార్కులు, తోటలు, ఆటస్థలాల వంటి పౌర సౌకర్యాల ఏర్పాటు
-విద్యాసాంస్కృతిక అభివృద్ధికి చర్యలు
-శ్మశానవాటికల్లో సౌకర్యాలు
-పశువులు, జంతువుల సంరక్షణ
-జనన, మరణాల నమోదు
-వీధి దీపాలు, బస్టాండ్లు, పార్కులు, ప్రజోపయోగ ప్రాంతాల్లో సౌకర్యాలు
-మాంసం దుకాణాలపై నియంత్రణ
క్షేత్రస్థాయి రాజకీయ సంస్థలు
-పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలను క్షేత్రస్థాయి రాజకీయ సంస్థలని అనవచ్చు.
-దేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వానికి ప్రసిద్ధమైన చరిత్ర ఉంది. ఉదాహరణకు పట్టణ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో 1870లో లార్డ్ మేయో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవానికి క్రీస్తుపూర్వం మౌర్యుని పాలనాకాలం నుంచి పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఉండేవని తెలుస్తుంది.
-ప్రధానంగా పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఎనిమిది రకాలుగా ఉన్నాయి. అవి
1) నగరపాలక సంస్థ
2) పురపాలక సంఘం
3) నోటిఫైడ్ ఏరియా కమిటీ
4) టౌన్ ఏరియా కమిటీ
5) కంటోన్మెంట్ బోర్డు
6) టౌన్‌షిప్
7) పోర్ట్‌ట్రస్ట్
8) స్పెషల్ పర్పస్ ఏజెన
నగర పాలక సంస్థ
-పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థల్లో నగరపాలక సంస్థ అగ్రస్థానం వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ప్రత్యేక చట్టం ద్వారా నగర పాలక సంస్థను ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా 3 లక్షలు లేదా 4 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండి, కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే నగరపాలక సంస్థను ఏర్పాటుచేయవచ్చు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఎప్పటినుంచో నగరపాలక సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు దేశంలో మొట్టమొదటి నగరపాలక సంస్థ మద్రాస్.
-నగర పాలక సంస్థల్లో నాలుగు ప్రధానాంగాలు ఉంటాయి. అవి 1) నగర పాలక మండలి 2) మేయర్ 3) స్థాయీ సంఘాలు 4) కమిషనర్