జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurthy)
పరిచయం
1893 మే నెల 11వ తేదీన జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో జన్మించారు.
ఈయనను అనీబిసెంట్ దత్తత తీసుకొన్నారు. ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించిన ఆమె, ఈయన తప్పక ప్రపంచానికి ఒక వెలుగు రేఖ కాగలడని విశ్వసించింది.
విద్యారంగంలో ప్రస్తుతం వ్వాప్తిలో ఉన్న అనేక సమస్యలను పరిశీలించి, వాటికి పరిష్కారం కనుక్కోవాలని ఈయన ప్రయత్నించారు.
జీవిత తత్వం
పేదరికం, ద్వేషం, సంకుచితత్వం, హింస, అసూయ మొదలైన అనేక సంక్షోభాలతో సమస్యలతో నిండిన ఈ ప్రపంచాన్ని తప్పక సంస్కరించాలి. సంక్లిష్టమైన మానవ స్వభావాన్ని గురించి అవగాహన చేసుకొన్న తరువాతనే సంస్కరణలు జరగాలి, మానవుడు సంపూర్ణ స్వతంత్రుడు, సర్వబంధ విముక్తుడు కావాలి. దానికి కావలసింది సర్వమైన విద్యావిధానం అని అభిప్రాయపడ్డారు. ప్రసిద్ధ తత్వవేత్త అయిన ఈయన కొత్తరకం తాత్విక చింతనను మానవాళికి అందజేశాడు.
1. తనను తాను తెలుసుకోవడమే జ్ఞానం.
2. నిరంతర సత్యాన్వేషణ వల్ల జ్ఞానం లభిస్తుంది.
3. ఈ సత్యాన్ని ఎవరికి వారు సాధన ద్వారా తెలుసుకోవాలి.
4. సత్యాన్వేషణ, మనస్సుకు స్వేచ్ఛ లభించిననాడే సాధ్యమవుతుంది.
5. సృజనాత్మకత అంటే అంతఃస్ఫూర్తి ఉండటం. దీనికి స్వేచ్ఛ కావాలి.స్వేచ్ఛకు వివేకం కావాలి.
6. మనసును వికసింపచేయడంలో సావధానతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
7. ఈయన విశ్వమానవుడు- వసుధైక కుటుంబ సభ్యుడు.
8. మానవులందరూ ఒక్కటే. కులం, మతం, జాతి, వర్ణ, భేదాలులేని విశ్వమానవ కుటుంబాన్ని ఈయన కాంక్షించాడు.
9 ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ గురువు కాదు. ఎవరికి ఎవరూ శిష్యుడు కాదు.(ఈ అభిప్రాయాన్ని చాలామంది తాత్వికులు అంగీకరించలేదు)
10. మనసుకు ఆలోచించే శక్తి ఉంది. దాన్ని వినియోగించి సత్యాన్ని కనుక్కోగలిగిన వాడే జ్ఞాని.