Type Here to Get Search Results !

Vinays Info

ఇతిహాసం - Epic in Telugu

 1. ఇతిహాసం(Epic)

ఇతిహాసమనగా 'పూర్వపుగాథ' అని అర్థము. ఇతి + హా  అను వ్యుత్పత్తితో 'ఇట్లు జరిగి యుండెను' అను అర్థము గోచరిస్తుంది. సంస్కృతమున మహాభారతాన్ని ఇతిహాసంగా పేర్కొంటారు. ఏకనాయకాశ్రయం కాక, అనేకాఖ్యానోపాఖ్యానాలతో విస్తృతరూపంలో ఉండునది ఇతిహాసమని చెప్తారు. కొందరు పురుషార్థాలను ఉపదేశించే పూర్వరాజుల కథను ఇతిహాసమన్నారు.

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తినతత్క్వచిత్ అన్నట్లు సంస్కృత మహాభారతం సర్వవిషయాలకూ ఆకరంగా ఉంది.

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అనే కవిత్రయం మహాభారతేతిహాసాన్ని ఆంధ్రీకరించారు. చంపూకావ్య పద్ధతిలో రసరమ్యంగా ఆంధ్రీకరించిన భారతంలో అనేక ప్రత్యేక కావ్యాలనదగ్గ ఉపాఖ్యానాలు కనిపిస్తాయి.

ఉపాఖ్యానాలను మాత్రమే లక్షణంగా స్వీకరించి కొందరు రామాయణాన్ని కూడా ఇతిహాసమన్నారు. రామాయణం తొలిమహాకావ్యమని సంస్కృతమున వ్యవహారం. తెలుగులో రామాయణం కూడా ఇతిహాసంగా ప్రచారంలో ఉన్నది.

భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ వంటి మహాభారతాన్ని పంచమవేదంగా పిలుస్తారు. ఇందులో వేద ప్రతిపాద్య విషయాలు కథా రూపంలో తేటతెల్లమవుతాయని అంటారు. ఇందులోని అనేక కథలు జానపద సాహిత్యంలో చోటు సంపాదించాయి. పురుషార్థ సాధనకు సంబంధించిన విషయాలను మహాభారత రామాయణాలు ప్రతిపాదిస్తాయి.

అనేక మంది కవులు ఇతిహాసాలలోని ఉపాఖ్యానాలను స్వీకరించి కావ్యాలుగా, మహాకావ్యాలుగా రచించి పేరు గడించారు. ఇటువంటి ప్రఖ్యాతాలను స్వీకరించి రచించిన వారిలో కాళిదాస భవభూతుల నుండి నేటి రచయితల వరకు కోకొల్లలు.

కొందరు విమర్శనాత్మకంగా, కొందరు ఇతిహాసాలలోని విషయాలను ధిక్కరిస్తూ రచించినా అవి వీటి శోభను మరింత పెంచేవిగానే భావించాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section