మెడిసిన్ ఫ్రం స్కై కార్యక్రమం స్ఫూర్తితో, స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వినూత్నమైన డ్రోన్.. ‘ఎయిర్‌బార్న్ మెడికల్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్–25 (ఏఎంఆర్‌టీ25)’ను టీవర్క్స్ విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ నిలువుగా పైకి ఎగిరి, వేగంగా ప్రయాణించి, మళ్లీ నిలువుగా (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్– వీటీఓఎల్) కిందికి దిగుతుందని అక్టోబర్ 15న టీవర్క్స్ వెల్లడించింది. దేశంలో ఇలాంటి హైబ్రిడ్ డ్రోన్లను రూపొందించి, తయారు చేసి, పరీక్షించగలిగే అతికొద్ది సంస్థల జాబితాలో ‘టీవర్క్స్’ కూడా చేరినట్టు తెలిపింది. డ్రోన్‌లో ప్రధాన ఫ్రేమ్‌తోపాటు ఇతర విడిభాగాలన్నింటినీ హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న టీవర్క్స్‌లో తయారు చేసినట్లు పేర్కొంది.
ఏఎంఆర్‌టీ25 ప్రత్యేకతలివీ..
- ఉన్నది ఉన్నట్టుగా పైకి ఎగిరి, అదే తరహాలో కిందికి దిగుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ కోసం కేవలం ఐదు మీటర్లు పొడవు, 5 మీటర్లు వెడల్పు ఉన్న స్థలం సరిపోతుంది.
- గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం తరహాలో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. సుమారు 80–90 మీటర్ల ఎత్తులో.. గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వెళ్లగలదు.
- ప్రస్తుతం ఔషధాల సరఫరాకు వినియోగించినా.. ఏరియల్ సర్వే, తనిఖీలు, నిఘా, రక్షణ రంగ అవసరాల కోసం వీటిని ఉపయోగించవచ్చు.
- ఏఎంఆర్‌టీ25 కిలో నుంచి కిలోన్నర బరువు మోసుకుని.. గరిష్టంగా 45–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
- వంద కిలోమీటర్ల దూరం, 3.5 కిలోల బరువు మోసుకెళ్లేలా ఈ డ్రోన్ కొత్త మోడల్‌ను తయారు చేస్తున్నారు.