పాడుదమా స్వేచ్ఛ గీతం - ఎగరేయుదమా జాతిపతాకం
పాడుదమా స్వేచ్ఛాగీతం
ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
|పాడుదమా|
ఎగరేయుదమా జాతిపతాకం
దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం
|పాడుదమా|
జలియన్ వాలా బాగు దురంతపు
నెత్తుటి ధారలు హత్తుకొని
ఉరికొయ్యల చెరసాలల గోడల
దారుణాలు తలకెత్తుకొని
పొగిడిన కాలం పోరాడిన కాలం
మరి మరి ఒకపరి తలచుకొని
మృత వీరుల గాధలు తెలుసుకొని
|పాడుదమా|
వందేమాతరమని నినదించిన
వీరుల శౌర్యం తలచుకొని
స్వాతంత్రం నా జన్మహక్కని
గర్జించిన గళమందుకొని
పోరాట ఫలం స్వాతంత్ర ఫలం
కలకాలం కాపాడుకొని
కడు గర్వంగా కొనియాడుకొని
|పాడుదమా|
మన్యం గుండెల మంటై రగిలిన
విప్లవ జ్యోతి స్ఫూర్తియని
గుండు కెదురుగా గుండె నిలిపిన
తెలుగు సింగముల తెగువగని
చీకటి గుండెల బాకై మెరిసిన
గరిమెళ్లను గురుతుంచుకొని
మన తెలుగు తేజమును నింపుకొని
|పాడుదమా|
జనగణమనముల జాగృతినింపిన
జెండా గాథలు చెప్పుకొని
జయహే జయజయహే జననీ యని
జయ గీతమ్ములు పాడుకొనీ
పావన చరితం పరిమళభరితం
అఖండ భారత ఖండమని
అది అక్షయ అమృతభాండమనీ
|పాడుదమా|